వనమంతా పందిరి వేసుకున్న పచ్చదనం. మోడువారిన చెట్లు సైతం చిగురులు తొడిగే కాలం. తరువులన్ని రంగుల పూలను తొడుక్కునే మాసం. ప్రకృతి అనేక రంగులతో సింగారించుకునే సమయం. ఇది చైత్రమాసపు సోయగం. చిగురించే మోదుగలు, పూసే గురువిందలు.
వనమంతా పందిరి వేసుకున్న పచ్చదనం. మోడువారిన చెట్లు సైతం చిగురులు తొడిగే కాలం. తరువులన్ని రంగుల పూలను తొడుక్కునే మాసం. ప్రకృతి అనేక రంగులతో సింగారించుకునే సమయం. ఇది చైత్రమాసపు సోయగం. చిగురించే మోదుగలు, పూసే గురువిందలు. వేసే మొల్లల మొగ్గలు. సాగే మల్లెల కొనలు. రాలే పొగడ పుప్పొడి రేణువులు. కురిసే గోగు తేనెలు. గుత్తులెత్తే గోరంటలు. ఊరికే అనలేదు వసంతాన్ని రుతువులకే రారాజని! వసంతం రాగానే అప్పటి వరకు మూగబోయిన మత్త కోకిలలు గొంతులు సవరించుకుంటాయి. ప్రకృతి రమణీయను సంతరించుకుంటుంది. అంతటా ఆనందాలు, ఆహ్లాదాలు. చైత్రమాసాన్ని మధుమాసం అని కూడా అంటారు. మధువంటే తేనె. అంటే జీవితం కూడా తేనెలాగే అమృతతుల్యం కావాలన్నది ఆంత్యరం. బ్రహ్మదేవుడు ఈ సమస్త చరాచర విశ్వాన్ని చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి నాడు ప్రారంభించాడు. అందుకే చైత్ర ఆరంభ దినాన్ని వేడుక చేసుకోవడం అనాదిగా ఆనవాయితీగా వస్తున్నది.
ఉగాది రోజున పూర్ణ కుంభదానం చేయడం మంచిది. వెండి లేదా రాగి, అది కాకపోతే మట్టిపాత్రను నీళ్లతో నింపుతారు. అందులో గంఘం, పూలు, అక్షతలు, మామిడి, వేప, మోదుగ, నేరేడ, అశోక తదితర చెట్ల పల్లవులను వేసి పూజిస్తారు. ఆ కుండను గురువులకు కానీ, పెద్దవారికి కానీ, ఇంటి పురోహితుడికి కానీ ఇచ్చి ఆశీస్సులను స్వీకరిస్తారు. మహావిష్ణువు మత్స్యావతారాన్ని ధరించి సోమకాసురుడి నుంచి వేదాలను రక్షించి బ్రహ్మదేవుడికి అందచేస్తారు. ఆ శుభరోజును పురస్కరించుకుని ఉగాదిని జరుపుకుంటున్నాం. అందుకే కొన్ని ప్రాంతాలలో ఉగాదిని మత్స్య జయంతిగా కూడా జరుపుకుంటారు.
ఉగాది రోజున షడ్రుచుల సమ్మేళితమైన పచ్చడిని ఎలాగూ జరుపుకుంటాం. అది కూడా ఉగాది రోజున చేయాల్సిన కర్తవ్యాలు చాలానే ఉన్నాయి. కొత్త సంవత్సరం రాకను స్వాగతిస్తూ భగవత్ కీర్తనలు పాడాలి. ద్వారాలకు తోరణాలు కట్టాలి.
శతాయుర్వజ్రదేహాయ
సర్వసంపత్కరాయ చ
సర్వారిష్ట వినాశాయ
నింబకం దళ భక్షణం అనే శ్లోకం పఠించాలి.
తిథిని బ్రహ్మ, వారాన్ని మయబ్రహ్మ, నక్షత్రాన్ని త్వష్ణబ్రహ్మ, యోగాన్ని శిల్పి బ్రహ్మ, కరణాన్ని విశ్వజ్ఞబ్రహ్మ ఇలా పంచాంగాన్ని పంచబ్రహ్మలు సృష్టించారట! ఈ పంచ బ్రహ్మలనే సనాతన బ్రహ్మలని పిలుస్తారు. ఉగాది రోజున పంచాంగశ్రవణం ఎందుకంటే తిథుల శ్రవణ ఫలితంగా సంపదలు, వార శ్రవణంతో దీర్ఘాయుష్షు, నక్షత్రం గురించి తెలుసుకోవడం వల్ల పాపహరణం, యోగ | శ్రవణమూలంగా రోగ నివారణ, కరణ శ్రవణ ఫలంగా కార్యసిద్ధి ప్రాప్తిస్తాయన్నారు. తెలుగు సంవత్సరాల పేర్లకు తగిన ఫలితం ఆ ఏడాది లోకంలో ప్రతిఫలిస్తుందంటారు. ఇప్పుడు మనం శోభకృత్ నామ సంవత్సరంలో ప్రవేశించబోతున్నాం. శోభకృత్ అంటే ప్రకాశాన్ని కలిగించేదని అర్ధం.శోభకృత్ నామ సంవత్సరం అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని కోరుకుందాం!
ఉగాది కాల సంబంధమైన పండుగ కాబట్టి ఆదిత్యుణ్ణి, విశ్వసృజనకు ఆరంభ దినం కాబట్టి సృష్టికర్త బ్రహ్మను ఆరాధించాలి. అలాగే ఇష్టదేవతలను పూజించి, పెద్దల ఆశీస్సులు అందుకోవాలి. ఒక రకంగా శ్రీరామనవమి నవరాత్రులకు ఆరంభదినమే ఉగాదే. EHA పాఠకులందరికీ మరోసారి ఉగాది శుభాకాంక్షలు..