తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పొటెత్తిన భక్తులు
పెద్దఎత్తున పాల్గొన్న భక్తులు
రాష్ట్రవ్యాప్తంగా రథసప్తమి వేడుకలు
తెల్లవారుజాము నుంచే ఆలయాలకు పొటెత్తిన భక్తులు
జగతికి వెలుగులు పంచే దినకరుడి పండుగ రథసప్తమి అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తారు. దీంతో దేవాలయాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. తిరుమలలో ఈ వేడుకలు కనులపండువగా సాగుతున్నాయి. ఇవాళ సప్త వాహనాలపై శ్రీవారు భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఇందులో భాగంగా తొలుత సూర్యప్రభ వాహనంపై తిరుమాడవీధుల్లో మలయప్ప స్వామిని ఊరేగించారు.
ప్రత్యేక ఏర్పాట్లు చేసిన టీటీడీ
అంతకుముందు టీటీడీ(TTD) అధికారులు వాయువ్య దిశలో సూర్యప్రభ వాహనాన్ని(Surya Prabha Vahanam) నిలిపి సూర్య కిరణాలు తాకిన వెంటనే వాహన సేవలను ప్రారంభించారు. తిరుమలేశుడ్ని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది. చలి, ఎండ, వర్షానికి ఇబ్బంది లేకుండా గ్యాలరీల్లో జర్మన్ షెడ్లు ఏర్పాటు చేశారు. 130 గ్యాలరీల్లో ప్రత్యేకంగా ఫుడ్ కౌంటర్లు ఏర్పాటు చేశారు. భక్తులకు నిరంతరాయంగా టీ, కాఫీ, పాలు, మజ్జిగ, మంచినీరు, సాంబారన్నం, పెరుగన్నం, పులిహోర, పొంగలి అందిస్తున్నారు . గ్యాలరీల్లోకి చేరుకోలేక బయట ఉన్నవారి కోసం ఎల్‌ఈడీ స్క్రీన్లు(LED Screens) ఏర్పాటు చేశారు. మాడవీధుల్లోని గ్యాలరీల్లో సౌకర్యాల పర్యవేక్షణకు సీనియర్ అధికారులకు విధులు కేటాయించారు.
శ్రీకాకుళం జిల్లా అరసవల్లి(Arasavalli) సూర్యనారాయణ స్వామి దేవాలయం(Surya narayana temple)లో అంగరంగ వైభవంగా రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. అర్ధరాత్రి నుంచే ఆదిత్యుడి దర్శనం కోసం భక్తులు పొటెత్తారు. స్వామివారికి దేవాలయశాఖ ప్రిన్సిపాల్ సెక్రటరీ వినయ్ చంద్ పట్టు వస్త్రాలను సమర్పించారు. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యేలు గొండు శంకర్, బగ్గు రమణమూర్తి, మామిడి గోవిందరావు, గౌతు శిరీష తదితరులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం నాలుగు వరకు భక్తులకు నిజరూప దర్శనం కల్పించనున్నారు. అరసవల్లి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం ఏర్పాట్లు చేసినట్లు రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు.