భారతీయ సంప్రదాయంలో పండుగలు చాలావరకు జ్యోతిర్విజ్ఞానంతో ముడిపడిఉంటాయి . ఋజుమార్గ కాలగమనంలో సాగే గ్రహాల చక్రగతులవల్ల భూగోళంపై , జీవరాశిపై , మానవాళిపై కలిగే గ్రహస్థితుల ప్రభావాన్ని గ్రహించి ఆయా ప్రాంతాలనుబట్టి మానవాళిని సమర్థులుగా సన్నద్ధంచేయడానికి విధినిషేధకవాటాలతో నిర్మితమైన ద్వారాలుగా పండుగలు యేర్పాటు చేయబడ్డాయి .

భారతీయ సంప్రదాయంలో పండుగలు చాలావరకు జ్యోతిర్విజ్ఞానంతో ముడిపడిఉంటాయి . ఋజుమార్గ కాలగమనంలో సాగే గ్రహాల చక్రగతులవల్ల భూగోళంపై , జీవరాశిపై , మానవాళిపై కలిగే గ్రహస్థితుల ప్రభావాన్ని గ్రహించి ఆయా ప్రాంతాలనుబట్టి మానవాళిని సమర్థులుగా సన్నద్ధంచేయడానికి విధినిషేధకవాటాలతో నిర్మితమైన ద్వారాలుగా పండుగలు యేర్పాటు చేయబడ్డాయి .
ఇవి తరువాత తరువాత వచ్చిన వైదికశాఖాభేదాల వికృతదూరాలకు అతీతమైన మహార్షహృదయావిష్కృతాలు . మహాశివరాత్రి(Maha Shivratri) అంటే అత్యంత శివమయమైన , శివంకరమైన రాత్రి అని మహర్షుల అనుభవము . అటువంటి అనుభవం కలుగడానికి ఎవరికైనా కొంత బుద్ధిసూక్ష్మత , హృదయసరళత+సౌకుమార్యం , ఏకాగ్రత అవసరం .
పరబ్రహ్మము(Para Brahman), శివము(Shivam) అన్నపదాలు వైదిక వాఙ్మయంలో అక్కడక్కడ పర్యాయవాచకాలుగా వాడబడతాయి . ఉదాహరణకు "శివం శాంతం అద్వైతం ..." అని మాండూక్యం ప్రకటిస్తుంది . తరువాతికాలంలోకూడా శుద్ధాద్వైత పరబ్రహ్మమును శాక్తాద్వైతం శివము అనిఅంటుంది . పారమాత్మికంగా శాంతమూ , అద్వయమూ యైన పరబ్రహ్మమే శివము . అదే సచ్చిదానందఘనము. అదే స్పందనాశక్తిమయమైన సదాశివచైతన్యము . వ్యావహారికంగా మనలోని శక్తి , జ్ఞానము , శాంతము(ఆనందము) , సరళత , ప్రేమ , పూర్ణత అనబడు షడ్గుణసంపదయే శివము . శివము తన స్పందనాశక్తిని ప్రకటిస్తే జగతికృతి . తన స్పందనాశక్తిని ఉపసంహరించుకుంటే జగతిమృతి . సకల దేశకాలాలలో , అన్నిరూపాలలో "ఉనికి"అన్నది శక్తియొక్క విలాసవిన్యాసాలే . శక్తి సంతులితమైతే సంతోషం , ఉద్విగ్నమైతే కల్లోలం , స్వల్పస్పందనమైతే స్తబ్దత , నిస్పందనమైతే లయం .
ఇది నిత్యజీవితంలో సుఖదుఃఖాలుగా , నిద్ర , మహానిద్రగా మనం చూస్తున్నదే .
మామూలుగా పగలు ... వెలుగుకు , జాగ్రదావస్థకు , రాజసానికి , బహిరంగకర్మలకు , శబ్దాలకు , సంబంధాల విస్తరణకు ఆస్పదము .
రాత్రి చీకటికి , మందావస్థకు , తామసానికి , రహస్యకర్మలకు , నిశ్శబ్దానికి , సంబంధాల పరిమితికి , విశ్రాంతికి ఆస్పదము .
జీవపరంగా పగలు కర్మలతో శక్తివినియోగ కాలము . రాత్రి విశ్రాంతితో శక్తిసంవర్ధక కాలము .సగటుజనులు ... ఇంద్రియసుఖపరిమితిలో , ఐహికమునమగ్నులై , బహురాగాసక్తులై పగలు పరిశ్రమించి రాత్రి విశ్రమిస్తారు .
యోగులు , ఆధ్యాత్మికమూర్తులు ... ఇంద్రియదూరమనస్కులై , అమృత ఆత్మానందాకృష్టులై పగలు ఉపశమించి , నిశ్శబ్దరాత్రిలో ఉద్దీప్తులై ఏకాగ్రతతో వారి వారి దైవవిభూతులద్వారా పరబ్రహ్మము , పరమాత్మయైన శివముతో అనుసంధానించుకుంటారు . తద్వారా తమ తమ వాసనాబంధాలను విదుల్చుకొని , అంతర్గత శివశాంతశక్తిని జాగృతంచేసుకొని , లౌకిక జీవనదృష్టిని సహజ సరళ ధర్మవీర నిష్ఠితం చేసుకుంటూ మోక్షంవైపు పురోగమిస్తారు .
ఆ విధంగా శివసాధనకు రోజులో మధ్యరాత్రి , ప్రతిమాసంలో అమావాస్యముందు చతుర్దశినాడు మాసశివరాత్రి , ప్రతిసంవత్సరం శీతాకాలం చివరలో మాఘమాస అమావాస్యకుముందు చతుర్దశినాడు మహాశివరాత్రి పరమోత్కృష్టకాలంగా సిద్ధుల నిర్ణయం . సనాతన సంప్రదాయంలో మహాశివరాత్రిని మహాలింగోద్భవ కాలంగానూ , శివపార్వతుల కళ్యాణప్రద కాలంగానూ , ప్రళయతాండవ కాలంగానూ భావించి శివుణ్ణి ఆరాధిస్తారు . మహాశివరాత్రినాటి శివారాధనలో దేహనియంత్రణగా ఉపవాసం , స్ఫురణోద్దీపనగా జాగరణ , ప్రకృతితో అనుసంధానంగా బిల్వంతో శివలింగార్చన ప్రధానం . అట్లే అంతర్ముఖీనులకు శివనామ జపం , శివపంచాక్షరీమంత్ర జపం , శివధ్యానం ప్రశస్తమైనవి . సాధారణంగా మిగతా పర్వదినాలలో అభ్యుదయం ప్రధానధ్యేయంగా ఉంటే , మహాశివరాత్రికి జీవుడి శుద్ధీకరణతో నిశ్శ్రేయసము ప్రధానధ్యేయంగా ఉంటుంది .మానవ జీవనగమన చక్రీయతలో ప్రతిరోజులోకానీ , ప్రతిమాసంలోకానీ , ప్రతిసంవత్సరంలోకానీ చరమదశగా దృష్టి కేంద్రీకరింపబడవలసింది ... అమృత ఆత్మానంద నిశ్శ్రేయసముపైనే ! ఆ సాధనలో ఆర్షధర్మమిచ్చిన మహోపకరణం ... మహాశివరాత్రి పర్వదినం !

లింగగర్భం జగత్సర్వం
త్రైలోక్యంచ చరాచరం
లింగబాహ్యాత్ పరంనాస్తి
తల్లింగంచ ప్రపూజయేత్ ...

సకల దేశకాలాలూ , సకల లోకవర్తనలూ , సకల పాపపుణ్యాలూ , సకల బంధమోక్షాలూ సదాశివచైతన్యలింగాతర్గతమే ...
ఆ సదాశివచైతన్యంతో తల్లీనతయే ... మృత్యోర్మా అమృతంగమయ !

Updated On 8 March 2024 12:53 AM GMT
Ehatv

Ehatv

Next Story