మనకు దసరా వేడుకలంటే(Dasara celebrations) మొదట స్ఫురించేది మైసూరే!

మనకు దసరా వేడుకలంటే(Dasara celebrations) మొదట స్ఫురించేది మైసూరే! మైసూర్‌లో(Mysore) జరిగే వేడుకలు జగద్విఖ్యాతం. వాటిని చూసేందుకు ఖండాలు దాటి మరీ పర్యాటకులు వస్తుంటారు. అయితే మైసూర్‌ వేడుకలకు దీటుగా, అంతే వైభవోపేతంగా, అంతకు మించిన ఉత్సాహంతో బస్తర్‌ ప్రజలు దసరా వేడుకలను జరుపుకుంటారు.

చత్తీస్‌గఢ్‌(Chhattisgarh) జగ్దల్‌పూర్‌లో(Jagdalpur) ఉన్న దంతేశ్వరి మాత ఆలయంలో దసరా ఉత్సవాలను అత్యంత వైభవంగా జరుపుతారు. 75 రోజుల పాటు వేడుకలు జరుగుతూనే ఉంటాయి.. ! అలాగే బస్తర్‌ జిల్లాలో జరిగే విజయదశమి వేడుకలు ఎంతో సుప్రసిద్ధం.. ఇది పూర్తిగా అటవీ ప్రాంతం. గిరిజనుల(Tribes) ఆవాసం.. ఇక్కడ దసరా వేడుకలు మిగతా ప్రాంతాలకు భిన్నంగా జరుగుతాయి.. అందరూ దసరాను తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటే బస్తర్‌లో మాత్రం 90 రోజులపాటు జరుపుకుంటారు. ఆ మూడు నెలలూ వారిలో అదే ఉత్సాహం.. అదే సంబరం..

బస్తర్‌ దసరా వేడుకలకు ఏడు శతాబ్దాల చరిత్ర ఉంది. బస్తర్‌లో ఎన్నో గిరిజన తెగలు నివసిస్తున్నాయి. మరియా, మురియా, అబుజ్‌ మరియా, దుర్వా, దొర్లా, బాట్రా, హల్బా తెగలకు చెందిన గిరిజనులు ఎక్కువగా ఉన్నారు. దసరా వేడుకల సందర్భంగా అందరూ ఒక్కటవుతారు. కలసికట్టుగా సంబరాలు జరుపుకుంటారు. డప్పుల మోతలు. వాయిద్యాల చప్పుళ్లు. బాణాసంచాల మిరిమిట్లు. లయబద్ధమైన అడుగుల సవ్వడులు. ఇవన్నీ దసరా పండుగ కళను రెట్టింపు చేస్తాయి..

ఓరుగల్లులో అస్తమించిన కాకతీయ సామ్రాజ్యం బస్తర్‌లో వెలుగొందిన విషయం మనకు తెలిసిందే! బస్తర్‌ను ఏలిన ఆ కాకతీయ రాజుల్లో మొదటివాడు అన్నమదేవ్‌. నాలుగో రాజు పురుషోత్తమ్‌ దేవ్‌. ఈయన క్రీస్తుశకం 1468 నుంచి 1534 వరకు బస్తర్‌ను పరిపాలించాడు.. దసరా వేడుకలకు ఆద్యుడు ఈయనే! పురుషోత్తమ్‌దేవ్‌ ప్రారంభించిన ఈ ఉత్సవాలు ఇప్పుడు ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలలో భాగమయ్యాయి. బస్తర్‌లో విజయదశమి వేడుకలు ఆగస్టు 14న మొదలవుతాయి.. పట జాత్రతో మొదలయ్యే వేడుకలు విజయదశమి వరకు కొనసాగుతాయి. పటజాత్ర అంటే చెట్లు చేమలకు మొక్కడం. వృక్ష సంతతికి పూజలు చేయడం.. అక్కడ్నుంచి రోజుకో రకమైన ఉత్సవం బస్తర్‌ను శోభాయమానం చేస్తాయి.

పురుషోత్తమ్‌దేవ్‌ ఓసారి పూరీ జగన్నాథుడిని దర్శించుకున్నాడట! వచ్చిన తర్వాత జగన్నాథుడు కలలో కనిపించి రథయాత్ర జరిపించమని ఆదేశించాడట! అప్పట్నుంచి దసరా రోజున బస్తర్‌లో రథయాత్రను జరపడం ఆనవాయితీగా వస్తోంది.. నాలుగు చక్రాల రథాన్ని పూలతో అలంకరిస్తారు.. ప్రత్యేక కర్రలతో చేసిన రథాన్ని బెడా ఉమర్‌గావ్‌కు చెందిన వడ్రంగులు ప్రత్యేక పద్దతులను అనుసరించి తయారుచేస్తారు. ఈ రథ నిర్మాణంలో మేకులు వాడకపోవడం విశేషం.. పూర్తిగా తాళ్లతోనో లేకపోతే లతలతోనే కడతారు. అప్పట్లో పూల కిరీటాన్ని ధరించిన మహారాజు ఈ రథంలో ఊరేగేవారు.. అయితే ఇప్పుడు కేవలం దంతేశ్వరి అమ్మవారి ఛత్రాన్ని మాత్రమే ఊరేగిస్తున్నారు. నవరాత్రి వేడుకల్లో రెండో రోజు నుంచి ఏడవ రోజు వరకు ఈ రథోత్సవం జరుగుతుంది.. దసరా రోజున ఎనిమిది చక్రాల రథంలో అమ్మవారిని ఊరేగిస్తారు. 12వ రోజున కృతజ్ఞతాంజలి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. రథం నడిచే దారిపొడవునా గిరిజన సంప్రదాయ నృత్యాలు కనువిందు చేస్తాయి.. ముగింపు రోజున అందరూ కలిసి సహపంక్తి భోజనం చేస్తారు. ఇందుకు ప్రత్యేక ఆకులతో చేసిన విస్తళ్లను ఉపయోగిస్తారు.

పెత్తర అమావాస్య నుంచి దశమి వరకు దంతేశ్వరి ఆలయం భక్తులతో పోటెత్తుతుంది. ఈ పది రోజులూ రాజే అధికారికంగా ప్రధాన పూజారి అవుతాడు. పూర్తిగా దంతేశ్వరీ దేవి పూజలోనే ఆయన గడుపుతారు. ఇప్పుడు దంతేశ్వరి ఆలయం గురించి క్లుప్తంగా తెలుసుకుందాం! దంతేశ్వరిగా అమ్మవారు పూజలందుకుంటున్న ఈ క్షేత్రం 52 శక్తి పీఠాలలో ఒకటి. అమ్మవారి దంతాలు పడిన ప్రాంతమిది! జగ్దల్‌పూర్‌ తెహసీల్‌కు 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న దంతెవాడలో ఉంది. కాకతీయులు ఈ ఆలయాన్ని నిర్మించారు. దంతేశ్వరిదేవి వెలసిన ప్రాంతం కాబట్టి దంతెవాడ అనే పేరు వచ్చింది. బస్తర్‌ వాసులకు దంతేశ్వరిదేవి కులదైవం. అమ్మవారి విగ్రహాన్ని నల్లనిరాయితో చెక్కారు. అమ్మవారి రూపు సౌందర్యవంతంగా ఉంటుంది.. ఆలయంలో గర్భాలయం.. మహా మండపం.. ముఖ్యమండపం.. సభ మండపం అనే నాలుగు భాగాలున్నాయి. దేవాలయం ముందు గరుడ స్తంభం ఉండటం ఇక్కడి ప్రత్యేకత. ఆలయం సమీపంలో శంకిని..లంకిణి నదులు భిన్నమైన వర్ణాలతో ప్రవహిస్తుంటాయి..

Updated On 11 Oct 2024 11:30 AM GMT
Eha Tv

Eha Tv

Next Story