✕
శ్రీ కృష్ణ పరమాత్ముడు యాదవుడా? లేక క్షత్రియుడా? క్షత్రియుడు అయితే రాజ్యపాలన చేయాలి కదా? గోపాలుడు ఎందుకయ్యాడు? అంటే అదో పెద్ద కథ. శ్రీకృష్ణుడి వంశ చరిత్రను క్లుప్తంగా చెప్పుకుందాం! ఆయన రాజో, యాదవుడో తెలుసుకుందాం!
పురూరవుడికి గంధర్వలోకంలో ఉండే అప్సరసకు ఆయువు, ధీమంతుడు, అమావసువు, దృఢాయువు, వనాయువు, శతాయువు అనే ఆరుగురు కుమారులున్నారు. ఆయువు, సర్భనవి అనే దంపతులకు నహుషుడు, వృద్ధశర్మ, రజి, గయుడు, అనేనసుడు అనే అయిదుగురు కుమారులు కలిగారు. వీరిలో నహూషుడు నాలుగు సముద్రాలు కలిగిన భూమండలాన్ని పాలించాడు. నూరు యజ్ఞాలు చేశాడు.

x
Lord Krishna
-
- శ్రీ కృష్ణ పరమాత్ముడు యాదవుడా? లేక క్షత్రియుడా? క్షత్రియుడు అయితే రాజ్యపాలన చేయాలి కదా? గోపాలుడు ఎందుకయ్యాడు? అంటే అదో పెద్ద కథ. శ్రీకృష్ణుడి వంశ చరిత్రను క్లుప్తంగా చెప్పుకుందాం! ఆయన రాజో, యాదవుడో తెలుసుకుందాం! పురూరవుడికి గంధర్వలోకంలో ఉండే అప్సరసకు ఆయువు, ధీమంతుడు, అమావసువు, దృఢాయువు, వనాయువు, శతాయువు అనే ఆరుగురు కుమారులున్నారు. ఆయువు, సర్భనవి అనే దంపతులకు నహుషుడు, వృద్ధశర్మ, రజి, గయుడు, అనేనసుడు అనే అయిదుగురు కుమారులు కలిగారు. వీరిలో నహూషుడు నాలుగు సముద్రాలు కలిగిన భూమండలాన్ని పాలించాడు. నూరు యజ్ఞాలు చేశాడు. శత్రువులందరినీ జయించి దేవేంద్ర పదవిని కూడా పొందాడు.నహుషుడు, ప్రియంవద దంపతులకు యతి, యయాతి, సంయాతి, అయాతి, అయతి, ధ్రువుడు అనే ఆరుగురు కుమారులు జన్మించారు. వీరిలో యయాతి మహా చక్రవర్తి అయ్యాడు. అనేక యజ్ఞాలు చేశాడు. శుక్రాచార్యుడి కూతురైన దేవయానిని యయాతి పెళ్లి చేసుకున్నాడు. ఈ దంపతులకు యదువు, తుర్వసుడు అనే కుమారులు కలిగారు. తర్వాత ఆమెకు తెలియకుండా ఆమె స్నేహితురాలు, వృషపర్వుడి కూతురు శర్మిష్టను పెళ్లి చేసుకున్నాడు. వీరికి ద్రుహ్వి, అనువు, పూరుడు అనే ముగ్గురు కుమారులు కలిగారు. ఈ విషయాన్ని తెలుసుకున్న దేవయాని కోపంతో వెళ్లి తండ్రితో తన బాధను చెప్పుకుంది. పట్టరాని కోపంతో శుక్రాచార్యుడు ఏ యవ్వన మదంతో ఇంతటి నీచానికి పాల్పడ్డావో ఆ యవ్వనం నాశనమవుగాక, నీకు తక్షణం వృద్ధాప్యం దాపురించుగాక అంటూ శపించాడు. వెంటనే యయాతి వికారంగా, ముసలివాడిగా మారిపోయాడు. కాసేపు అయ్యాక శుక్రాచార్యుడికి కోపం చల్లారింది. అల్లుడు ముసలివాడైతే తన కూతురు సంగతేమిటని ఆలోచించాడు.
-
- శాపవిమోచనం ఇచ్చాడు. ప్రస్తుతం నీ వార్ధక్యాన్ని నువ్వు నిజంగా ముసలివాడయ్యేంత వరకు నీ వాళ్లు ఎవరైనా స్వీకరించి- వారి యవ్వనాన్ని నీకు ఇవ్వడానికి అంగీకరిస్తే నీకు వెంటనే యవ్వనం వచ్చేస్తుంది. నువ్వు నా కూతురు దేవయాని, శర్మిష్టలతో మరో వేయి సంవత్సరాలు ఆనందంగా సుఖంగా ఉండవచ్చు. ఆ తర్వాత నీ యవ్వనాన్ని వారికి తిరిగి ఇచ్చేసి, నీ నిజ వార్ధక్యన్ని నువ్వు పొందవచ్చు అని శుక్రాచార్యుడు చెప్పాడు. కొంతకాలం అకాల వార్ధక్యాన్ని అనుభవించాడు యయాతి. కోరికలు తగ్గకపోవడంతో కుమారులను పిలిచి తన మనుసులోని కోరికను చెప్పాడు. వెయ్యి సంవత్సరాల తర్వాత నీ యవ్వనం నీకు తిరిగి ఇచ్చేస్తాను. వరాలిస్తాను అంటూ వారికి ఆశలు చూపించాడు. అతడి పెద్ద కొడుకు యదువు తండ్రి మాటను కాదన్నాడు. ' నా మాట విననివాడికి నా ఆస్తిలో వాటా లభించదు. నీ వంశస్తులకు ఎన్నటికీ రాజ్యార్హత ఉండదు. నా మాట కాదని ఎవరైనా రాజ్య చేపట్టినా రాణించలేరు. మీరంతా పశువులు మేపుకుంటూ బతకండి అని శపించాడు యయాతి. తర్వాత తుర్వసుడిని పిలిచి తన కోరిక కోరాడు యయాతి. అతడు కూడా కాదన్నాడు. 'మీ వంశంవారు అడవులు పట్టి కిరాతకులై తిరుగుతారు అని శపించాడు యయాతి.
-
- ద్రుహ్వినితో నిత్వం నావపై తిరుగాల్సిన చోట ఉండు. నీ వంశంలోని వారు రాజులు కాలేరు అని అన్నాడు. అలాగే అనువును నీ సంతానం యవ్వనం పొందుతూనే నశిస్తుంది అని శపించాడు. చివరకు పురువు మాత్రమే యయాతి ప్రతిపాదనకు సరే అంటాడు. అతనికే వేయి సంవత్సరాల తర్వాత యయాతి తదనంతరం రాజ్యం దక్కతుంది. కురు పాండవులు పురువు వారసులే. ఇదిలా ఉంటే యయాతి ఆదేశాన్ని యదు వంశ వారసులందరూ పాటించలేదు. యదువు పెద్ద కొడుకు సహస్రజిత్తు మనువడు హేహయుడి నుంచి హేహయ వంశం పుట్టింది. వారికి మాహిష్మతి రాజధాని. ఈ వంశంలోని వాడే కార్తవీర్యార్జునుడు. యదువు రెండో కుమారుడు క్రోష్టువు వంశంలో విదర్భుడు ప్రసిద్ధుడు. రుక్మిణీదేవి ఈ వంశస్తురాలే! క్రోష్ణువు తక్కిన వారసుల ద్వారా భోజ వంశం, అంధక వంశం వృష్టి వంశం, చేది వంశం కలిగాయి. శ్రీకృష్ణుడు అంధక వంశానికి చెందిన వాడు. వృష్ణి వంశస్తురాలు సత్యభామ. చేది వంశానికి చెందినవాడే శిశుపాలుడు. శ్రీకృష్ణుడి తాత శూరసేనుడు మహావీరుడు. యయాతి శాపాన్ని పక్కకు పెట్టి మధరకు రాజయ్యాడు. అతడి కొడుకుల్లో ఒకడు వసుదేవుడు. కూతుళ్లలో ఒకరు పృథ. ఈమెను తన బావ అయిన కుంతిభోజుడికి పిల్లలకు లేకపోతే దత్తతకిచ్చాడు శూరసేనుడు. ఈయన పేరు మీదనే ఆమె కుంతిగా ప్రసిద్ధికెక్కింది. తదనంతర కాలంలో పాండవులకు తల్లయ్యింది. శూరసేనుడి తర్వాత వసుదేవుడు రాజవ్వాలి.
-
- కాని ఆయన యయాతి శాసనాన్ని ధిక్కరించలేక రాజ్యాన్ని వదులుకున్నాడు. భోజవంశంలోని ఉగ్రసేనుడికి మధుర రాజ్యాన్ని అప్పగించాడు. తను సలహాలు ఇచ్చే మంత్రిగా ఉన్నాడు. రోహిణి అనే ఆమెను వివాహం చేసుకున్నాడు. చాలా కాలం వారికి పిల్లలు పుట్టలేదు. ఓ రాత్రి రోహిణికి నారద ముని కలలోకి వచ్చి నీ భర్త మరో పెళ్లి చేసుకుని, నీ సవతికి బిడ్డలు కలిగితేనే నీకు పిల్లలు పుడతారు అని చెప్పాడు. ఈ మాటను వసుదేవుడికి చెబితే మొదట ఒప్పుకోడు. చివరకు ఎలాగో అలాగా ఒప్పించారు. వసుదేవుడికి తన కూతురు దేవకిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఉగ్రసేనుడు ముందుకొస్తాడు. తనకు రాజ్యాన్ని అప్పగించిన వసుదేవుడికి ఆ మాత్రం చేయకపోతే ఎలా అని అనుకున్నాడు ఉగ్రసేనుడు. మధురకు రాజుగా తాను, యువరాజుగా తన కుమారుడు కంసుడు ఉన్నాడంటే అది వసుదేవుడి చలవేనన్నది ఉగ్రసేనుడి భావన. అదే సమయంలో మగధను జరాసంధ చక్రవర్తి ఏలుతున్నాడు. తన కూతుళ్లు అస్తి, ప్రాప్తిలను సామంత రాజ్యమైన మధుర యువరాజు కంసుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. దేవకిని పెళ్లి చేసుకుని వసుదేవుడు తన ఇంటికి ఆమెను తీసుకెళుతున్నప్పుడు కంసుడే రథం నడుపుతున్నాడు. మార్గ మధ్యంలో ఆకాశవాణి కంసుడిని హెచ్చరిస్తుంది.
-
- దేవకి గర్భంలో పుట్టిన ఎనిమిదో కుమారుడే నిన్ను సంహరిస్తాడని చెబుతుంది. దాంతో దేవకి, వసుదేవుడిని కంసుడు చెరసాలలో పెట్టాడు. అప్పుడు వసుదేవుడు తన మొదటి భార్య రోహిణిని వ్రేపల్లెలోని తన మిత్రుడు నందుడు దగ్గరకు వెళ్లి తలదాచుకోమని చెప్పి పంపిస్తాడు. అక్కడే రోహిణికి బలరాముడు జన్మిస్తాడు. కంసుడు తన మామ జరాసంధుడి మాట విని తండ్రిని ఖైదు చేస్తాడు. తానే రాజవుతాడు. ఈ మధ్యలోనే దేవకి అష్టమ సంతానంగా కృష్ణుడు జన్మిస్తాడు. కృష్ణుడిని కూడా నందుడి ఇంటికి చేరుస్తాడు వసుదేవుడు. వసుదేవుడి స్నేహితుడు నందుడు యాదవుడు. ఆయన భార్య యశోద. కృష్ణుడు ఆమె దగ్గరే పెరుగుతాడు. అంటే కృష్ణుడు పుట్టుకతో క్షత్రియుడే కానీ పెరిగింది మాత్రం యాదవుల ఇంట్లో! కృష్ణుడి కారణంగా తన ప్రాణాలు పోతాయని తెలిసి అతడిని చంపడానికి ప్రయత్నిస్తాడు కంసుడు. ఈ క్రమంలోనే ముష్టి యుద్ధానికి ఆహ్వానించి చంపించబోతాడు. బలరామకృష్ణులు ఆ మల్లయోధులను చంపేస్తారు. అదే ఊపుతో కంసుడిని కూడా కృష్ణుడు చంపేస్తాడు. చెరసాలలో ఉన్న తల్లిదండ్రులు దేవకీ వసుదేవులను, మాతామహుడు, మాతామహి అయిన ఉగ్రసేనుడు, పద్మావతిలను విడుదల చేస్తాడు.
-
- మేనమామ కంసుడిని చంపిన తర్వాత శ్రీకృష్ణుడు మధురలోనే ఉన్నాడు. కృష్ణుడికి రాజ్యం అప్పగించడానికి ఉగ్రసేనుడు సిద్ధమైనా కృష్ణుడు ఒప్పుకోడు. కంసుడు చనిపోయిన తర్వాత అతడి భార్యలు అస్తి, ప్రాప్తిలిద్దరూ తండ్రి జరాసంధుడి దగ్గరకు వెళ్లిపోయారు. మధురలోనే ఉంటున్న కృష్ణుడి దగ్గరకు నందుడు వచ్చి కన్నవాళ్లను చూడగానే పెంచినవాళ్లను మర్చినట్టు ఉన్నావు అంటూ దీనంగా అడుగుతాడు. ఎప్పుటికైనా తాను నందనందనడినేనని, యశోదాసుతుడినేనని చెప్పి నందుడిని పంపిస్తాడు. కృష్ణుడు రాజుగా అధికారం చేపట్టకపోయినా అనేక క్షాత్రధర్మాన్ని పాటించాడు. యుద్ధాలు చేశాడు. అనేకానేక ఆయుధాలను ప్రయోగించడం కృష్ణుడికి తెలుసు. జాంబవంతుడితో అనేక రకాల ఆయుధాలతో యుద్ధం చేసిన సంగతి తెలిసిందే కదా! ఇక శ్రీకృష్ణుడి అష్ట భార్యల విషయానికి వస్తే పట్టమహిషి రుక్మిణిదేవి, ఇష్ట సఖి సత్యభామలిద్దరూ తన యాదవ వంశ క్షత్రియ వర్ణానికి చెందినవారే! మేనత్త శ్రుతకీర్తి కూతురే మూడో భార్య భద్ర. అవంతీ దేశాధినేత విందుడి చెల్లెలు మిత్రవింద నాలుగో భార్య . మద్రదేశపు రాజు బృహత్సేనుడి కూతురు లక్షణ అయిదో భార్య. సూర్యుడి కూతురు కాళింది ఆరో భార్య. కోసల దేశాధిపతి నగ్నజితి కూతురు నాగ్నజితి ఏడో భార్య. జాంబవంతుడి కూతురు జాంబవతి ఎనమిదో భార్య. జాంబవతి తప్ప అందరూ రాజపుత్రికలే! ఇక తన చెల్లెలు సుభద్రను అర్జునుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఈ లెక్కన కృష్ణుడు క్షత్రియుడో, యాదవుడో తేల్చుకోవచ్చు!

Ehatv
Next Story