అసలు వర్షరుతువే ఉల్లాసభరితం. హర్షోత్సవం. ఆనందదాయకం! ఆపై ఈ రుతువులో మనలో ఉత్సాహాన్ని నింపడానికి ఎన్నో పండుగలు, మరెన్నో వేడుకలు. గాడ్స్ ఓన్ కంట్రీగా పేరొందిన కేరళ(Kerala)లో ప్రతి రోజూ ఓ వేడుకే! ప్రకృతి రమణీయతకు మారుపేరైన కేరళను ఇప్పుడు సందర్శిస్తే ఎందుకక్కడ దేవతలు నివసిస్తారో తెలిసొస్తుంది.
అసలు వర్షరుతువే ఉల్లాసభరితం. హర్షోత్సవం. ఆనందదాయకం! ఆపై ఈ రుతువులో మనలో ఉత్సాహాన్ని నింపడానికి ఎన్నో పండుగలు, మరెన్నో వేడుకలు. గాడ్స్ ఓన్ కంట్రీగా పేరొందిన కేరళ(Kerala)లో ప్రతి రోజూ ఓ వేడుకే! ప్రకృతి రమణీయతకు మారుపేరైన కేరళను ఇప్పుడు సందర్శిస్తే ఎందుకక్కడ దేవతలు నివసిస్తారో తెలిసొస్తుంది. ఏడాది పొడవునా ఏదో ఓ పర్వదినం అక్కడ ఉత్సాహభరిత సౌరభాలను వెదజల్లుతుంటుంది కానీ ఇప్పుడు మాత్రం ద్విగుణీకృతమైన ఉత్సాహం అక్కడ కనిపిస్తుంది. పది రోజులుగా కేరళ కొత్త శోభతో మెరిసిపోతున్నది. మురిసిపోతున్నది. ఇప్పుడు కేరళవాసులు ఓనమ్(Onam festival) వేడకలతో తీరిక లేకుండా ఉన్నారు. బలి చక్రవర్తి(Bali chakravarthi) ఆగమనం కోస వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. మంగళవారం జరిగే తిరు ఓనమ్(Thiru Onam) కేరళ ముస్తాబయ్యింది. మలయాళీలకు ఇది అత్యంత ప్రధానమైన పండుగ. బలిచక్రవర్తి స్వయంగా వచ్చి తమ ఆనందోత్సాలను చూసి సంతోషిస్తారని వారి విశ్వాసం.
ఓనమ్ పండుగ వెనుక ఓ పురాణగాథ ఉంది. బలిచక్రవర్తి పాలనలో ప్రజలంతా సంతోషంగా ఉండేవారు. రాజ్యం సుభిక్షంగా ఉండింది. ధర్మం నాలుగు పాదాలా నడిచింది. తన ప్రజలకు ఎలాంటి కష్టనష్టాలు కలగకుండా కంటికి రెప్పలా కాపాడుకున్నాడాయన! అందుకే బలిచక్రవర్తి అంటే కేరళప్రజలకు అంత ఇష్టం. దైవంతో సమానం! వచ్చిన వాడు వామనుడి వేషంలో వున్న విష్ణుమూర్తి అని తెలుసు. ఆ ఆదినారాయణుడు తనను చంపడానికే వచ్చాడనీ తెలుసు. అయినా బలి చక్రవర్తి వామనుడు అడిగిన మూడడుగుల నేలను సహృదయంతో దానమివ్వడానికి సిద్ధపడ్డాడు. గురుదేవుడు శుక్రాచార్యుడు అడ్డుపడితే, సాక్షాత్తూ లక్ష్మీదేవిని తాకిన ఆ విష్ణుమూర్తి చేయి కన్నా నాది పై చేయి కావడం కంటే ఈ జన్మకు కావాల్సిందేముందన్న బలి చక్రవర్తి అక్కడితో ఆగకుండా మూడో అడుగును తన నెత్తి మీద పెట్టమన్నాడు. అంతటి మహనీయ చక్రవర్తి ఆయన. బలిచక్రవర్తి పాతాళానికి వెళ్లే ముందు ఆ త్రివిక్రముడిని ఓ వరం కోరతాడు. ఏడాదికి ఓసారి తన ప్రజలను చూసే భాగ్యాన్ని ప్రసాదించమని వేడుకుంటాడు. విష్ణుమూర్తి తథాస్తూ అన్నాడు. అప్పటినుంచి ప్రతి ఏడాది బలిచక్రవర్తి తమ ఇళ్లకు వచ్చి తమ సంతోషాన్ని చూస్తాడన్నది ప్రజల నమ్మకం. బలిచక్రవర్తి భూలోకానికి వచ్చే రోజునే ఓనమ్ పండుగగా జరుపుకుంటారు. అసలు బలిచక్రవర్తిని విష్ణుమూర్తి పాతాళానికి తొక్కేయలేదని, అసలు ఆయన తన పాదాన్నే బలి నెత్తి మీద పెట్టలేదని కేరళ వాసుల గట్టి నమ్మకం. బలి చక్రవర్తికి సువర్లోక పాలన బాధ్యతలను అప్పగించిన విష్ణువు ఆయన ద్వారపాలకుడిగా మారాడంటారు.
మలయాళీల క్యాలెండర్ ప్రకారం చింగ మాసంలో వస్తుందీ పండుగ. వారి కొల్లవర్షమ్‌లో మొదటి నెల ఇది! పది రోజులపాటు ఓనమ్ వేడుకలు జరుగుతాయి. ఓనం తర్వాత కూడా కొన్ని చోట్ల వేడుకలు జరుగుతాయి. ఆ మాటకొస్తే చింగమాసం మొత్తం పండుగ సందడి కనిపిస్తుంటుంది. ఇళ్ల ముందు రంగురంగుల పూలతో అలంకరించిన రంగవల్లికలు ఓనమ్ ప్రత్యేక ఆకర్షణ. ఒక్కోరోజు ఒక్కో రంగు పువ్వులను కోసుకొచ్చి తమ సృజనాత్మకతనంతా ఆ రంగవల్లికలో చూపిస్తారు. . రకరకాల ఆకృతుల్లో ముగ్గులను తీర్చి దిద్దుతారు. పొట్ట చేత పట్టుకుని పరాయి దేశాలకు వెళ్లిన వారిని సొంతూళ్లకు రప్పించే గొప్ప పండుగ ఇది. పండుగ సంబరాల్లో మొదటి రోజు ఆతమ్.. ఈ రోజు నుంచే కేరళలో పండుగ వాతావరణం వచ్చేస్తుంది. రెండో రోజును చిత్తిర అంటారు. పూక్కాలమ్ కొత్త రంగులను అద్దుకుంటుంది. కొత్త ఆకృతిని ధరిస్తుంది. అప్పుడే పూచిన పూలన్నీ అందులో భాగం పంచుకోవడానికి ఉవ్విళూరుతుంటాయి. మగపిల్లలంతా పూల సేకరణలో పడతారు. ప్రతి ఒక్కరూ మహాబలిని తమ ఇంటికే రావాలంటూ ఆహ్వానిస్తారు. పక్కింటివారి కంటే తమ ఇంటి ముంగిట ఉన్న పూక్కాలమే ఆకర్షణీయంగా ఉన్నదనే నమ్మకంతో ఉంటారు. మూడో రోజు చోధి. ఓనమ్ దగ్గరకొచ్చేస్తుండటంతో హడావుడి పెరిగిపోతుంది. షాపింగ్‌ల సందడి మొదలవుతుంది. మార్కెట్లన్నీ కళకళలాడుతుంటాయి. షాపింగ్ మాల్స్ అన్నీ డిస్కౌంట్లతో హోరెత్తుతుంటాయి. బంధుమిత్రులకు ఇవ్వడానికి కానుకలను సిద్ధం చేసుకుంటారంతా! పరిసరాలను శుభ్రం చేసుకుంటారు. ఇంటిని ముస్తాబు చేసుకుంటారు. నాలుగో రోజు వైశాఖం. ఓనమ్ రోజు చేసుకునే ఓనసద్య వంటకానికి కావాల్సిన సరకులన్నీ సిద్ధం చేసుకుంటారు. రకరకాల పచ్చళ్లను తయారుచేస్తారు. అలాగే అప్పడాలు కూడా. ఇక అమ్మాయిలైతే కొత్త కొత్త డిజైన్లను తయారుచేయడంలో మునిగిపోతారు.
అయిదో రోజును అనిఝమ్‌గా చేసుకుంటారు. ఈ రోజున స్నేక్‌బోట్ పందాలు జరుగుతాయి. దీన్నే వల్లమ్‌కలి అని కూడా అంటారు. ఈ పడవల పందాల వెనుక కొన్ని శతాబ్దాల చరిత్ర వుంది. కేరళలో ఏనుగుల పోటీ ఎంత ప్రసిద్ధి చెందిందో బోటింగ్ రేసు కూడా అంతే ప్రసిద్ధిగాంచింది. ఈ ఉత్సవాన్ని స్ఫూర్తి సమైక్యతలకు మారుపేరుగా చెప్పుకుంటారు మలయాళీలు. పాము ఆకారంలో తీర్చి దిద్దిన పడవలే కాకుండా ఇంకా వివిధ రకాలైన చిన్న చిన్న పడవతో ఈ పోటీలో పాల్గొంటారు. ఈ బోటు రేసింగ్‌లో పెడల్, లాంగ్ బోటు వంటి పలు రకాలైన పడవలను పోటీకి ఉపయోగిస్తారు. ప్రపంచంలోకెల్లా ఎక్కువ మంది పాల్గొనే ఆటగా పేరొందింది. పంబ, అరన్‌ముల్లా నదీ తీరాలైతే కిక్కిరిసిపోతాయి.ఈ రోమాంచితులను చేసే పడవ పందాలను చూసేందుకు దేశ విదేశాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఓనమ్ పర్వదినాలలో ఆరోది త్రికెటా. పండుగ సందడి తాండవిస్తుంటుంది. బంధు మిత్రుల రాకపోకలతో ఇళ్లన్నీ కళకళలాడుతుంటాయి. సాంస్కృతిక కార్యక్రమాలతో సాయంకాలాలకు కొత్త శోభ వస్తుంది.ఉద్యోగ రిత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినవాళ్లు సొంతగూటికి చేరతారు. పల్లెల్లో ఇళ్లకు కొత్త కళ వస్తుంది. ఏడో రోజు మూలమ్. షాపులన్నీ విద్యుద్దీపాలతో జిగేల్‌మంటుంటాయి. సాయంత్రమైతే చాలు. రోడ్లన్నీ జనసందోహమవుతాయి. కోట్లాది మంది కేరళవాసుల మొహాల్లో పండుగ శోభ వస్తుంది. పూక్కాలమ్, అదే పూల రంగవల్లికల వైశాల్యం పెరుగుతుంది. కొత్త కొత్త పూలను ఏరి తెస్తారు. ఎనిమిదో రోజును పూరాడమ్‌గా జరుపుకుంటారు. భక్తులు మట్టితో రకరకాల బొమ్మలు చేస్తారు. పూరాడమ్ రోజు ఈ బొమ్మలను చేస్తారు కాబట్టి వీటిని పూరాడ ఉట్టిగల్ అని కూడా అంటారు. వీటిని రక రకాల పుష్పాలతో చక్కగా అలంకరిస్తారు. ఓనమ్ పండుగ ముందు రోజు ఉత్తరాడం. తాము ఆరాధించే బలిచక్రవర్తి వచ్చే రోజు ఆసన్నమయ్యిందన్న సంబరం. ఆయనకు స్వాగతం చెప్పాలన్న ఉత్సాహం. ఉత్తరాడాన్ని మొదటి ఓనమ్‌గా, తిరుఓనమ్‌ను రెండో ఓనమ్‌గా జరుపుకుంటారు. పది రోజుల ఓనమ్ వేడుకల్లో తిరు ఓనమ్ చివరిది. ఇదే ప్రధాన పండుగ. పొద్దున్నే నిద్రలేచి అభ్యంగన స్నానమాచరించి, కొత్త బట్టలు వేసుకుని, దగ్గరున్న ఆలయానికి వెళ్లి దైవ దర్శనాన్ని చేసుకుంటారు. అప్పటికే పూక్కాలమ్ రెడీగా ఉంటుంది. అమ్మాయిలు పోటీపడి మరి రంగవల్లికలను తీర్చి దిద్దుతారు. చిన్నపిల్లలేమో పూల రంగవల్లికలకు కాపలా ఉంటారు.
ఈ పది రోజులూ కేరళలో ఎక్కడ చూసినా కోలాహలమే కనిపిస్తుంటుంది. ఓనమ్ పాటలే వినిపిస్తుంటాయి. యువకులు శారీరకశ్రమనిచ్చే ఆటలు ఆడతారు. పెద్దవారు ఇంట్లో ఉంటూ చదరంగం, పులిజూదం వంటి ఆటలు ఆడుకుంటారు. విలువిద్యా పోటీలు, కత్తి యుద్ధాలు వంటి క్రీడలు కూడా మనకు కనిపిస్తాయి. కబడ్డీ ఆటను కూడా ఇష్టంగా ఆడతారు. ఓనమ్ పండుగ కోసం ప్రత్యేకంగా రూపొందించిన నాట్యాలున్నాయి. వీటిల్లో కైకొట్టికలై, తుంబి తుల్లర్‌లు చాలా ముఖ్యమైనవి. ఓనమ్ రోజున ఎక్కడ చూసినా కేరళ సంప్రదాయ చీరలతో అమ్మాయిలు కైకొట్టికలై ఆడుతూ కనిపిస్తారు. తిరు ఓనమ్ రోజున ప్రత్యేకంగా వంటలు చేస్తారు. ఈ విందు భోజనాన్ని ఓన సద్య అంటారు. పదకొండు నుంచి పదమూడు అతి ముఖ్యమైన పదార్థాలతో కూడిన తొమ్మిది రకాల భోజనమన్నమాట! ఇందులో రకరకాల పచ్చళ్లు కూడా ఉంటాయి. అప్పడాలు, పాయసాలు, నేంద్రపళం అనే ఓ రకమైన అరటికాయతో చేసిన చిప్స్ కూడా ఉంటాయి. ఓన సద్యను అరటి ఆకుల్లో వడ్డిస్తారు. పండుగ కోసం వచ్చిన అతిథితులతో కుటుంబసభ్యులంతా కూర్చొని ఆనందంగా సందడి చేస్తూ భోజనం చేస్తారు. వడ్డించడం కూడా కళే అంటారు. అది ఓనసద్య నుంచే పుట్టిందేమో! ఎందుకంటే అంత కచ్చితంగా ఉంటుందీ వడ్డన! ఇప్పుడైతే కూరల సంఖ్య తగ్గింది కానీ ఒకప్పుడు అయితే 64 రకాల వంటకాలు ఉండేవి! పండగ రోజు కథాకళి నృత్యం తప్పనిసరిగా వుండి తీరాల్సిందే. పురాణగాథలను అభినయిస్తూ ప్రేక్షకులను కట్టిపడేస్తారు కళాకారులు. ఏనుగుల ఊరేగింపు కన్నుల పండుగగా సాగుతుంది. త్రిసూర్ దగ్గర్నుంచి బయలుదేరే ఈ ఊరేగింపు వీధివీధిని చుట్టేస్తుంది. ఇక్కడే ముసుగులు ధరించిన కళాకారులు అందమైన కుమ్మట్టికలి నృత్యాన్ని అభినయిస్తూ ఇంటింటికి వెళతారు. ఓనం వేడుకల్లో ఊయలలూగడం ఓ అంతర్భాగం. గ్రామీణ ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. కేరళ సంప్రదాయ చీరలతో అందంగా ముస్తాబైన అమ్మాయిలు ఊయ్యాలూగుతూ ఓనం పాటలు పాడతారు. వినాయక చవితి పండగ రోజున విఘ్నేశ్వరుడి ప్రతిమలను ప్రతిష్టించినట్టుగా ఓనం పండుగ రోజుల్లో త్రిక్కకర అప్పన్ అంటే వామనుడి రూపంలో వున్న విష్ణుమూర్తి విగ్రహాన్ని తమ ఇళ్లలో ప్రతిష్టిస్తారు. కేరళలలో అన్ని వర్గాల ప్రజలు ఈ పండుగను ఉత్సహాంగా జరుపుకుంటారు.. ఓనం హిందు మతానికి సంబంధించిన పండగే కానీ హిందువులతో సరిసమానంగా ముస్లిములు, క్రైస్తవులు కూడా జరుపుకుంటారు. సమైక్య భావనకు ఇదో దర్పణం.
తిరు ఓనమ్‌తో పండుగ సంబరాలు ముగిసిపోవు. మరో నాలుగైదు రోజుల పాటు ఆ ఉత్సాహం కొనసాగుతుంటుంది. పండుగ తర్వాత జరిగే పడవ పందాలు, పులి నృత్యాలను చూసి కానీ పర్యాటకులు వెనక్కి రారు. పులిక్కలి అంటే పులి ఆటలు ప్రత్యేకం. ఓనమ్ వైభవం కేరళలోనే కాదు, మలయాళీలున్న ప్రతిచోటా ఆ సంబరం కనిపిస్తుంది. విదేశాలలో స్థిరపడిన మలయాళీలు ఓనమ్ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అందరూ ఒక్కచోటకు చేరి సంబరాలు చేసుకుంటారు. రోజంతా ఆనందంగా గడిపేస్తారు. నిజానికి తిరు ఓనమ్‌తో పండుగ ఉత్సవాలు ముగియాలి కానీ ఓనమ్ తర్వాతి రెండు రోజులు కూడా ప్రజలు సెలెబ్రేషన్స్ చేసుకుంటారు. ఓనమ్ మరుసటి రోజును అవిట్టమ్ అంటారు. పది రోజులుగా పూక్కాలమ్‌లో ప్రతిష్టించిన త్రిక్కకర అప్పన్ విగ్రహాన్ని సమీపంలో ఉన్న నదిలోనో చెరువులోనో నిమజ్జనం చేస్తారు. పులిక్కలి నృత్యాలు ఈ రోజుకు మరింత శోభనిస్తాయి. ఆ మరుసటి రోజును చట్యమ్ అంటారు. ఆ రోజే సంఘసంస్కర్త శ్రీ నారాయణగురు జయంతి. ఇదే రోజున తిరువనంతపురంలో ప్రభుత్వం డాన్స్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తుంది.. తిరు ఓనమ్‌ను శ్రావణమహోత్సవమని, శ్రావణోత్సవమని కూడా అంటారు. మహా బలి పరిపాలనలో ప్రజలందరూ ఒక్కటే! కుల మత ప్రసక్తే లేదు. పేదవాడు గొప్పవాడు అన్న తేడా లేదు. ప్రజలంతా సుఖశాంతులతో వుండేవారు. కష్టాలంటే ఏమిటో తెలియదు. రోగాలంటే ఏమిటో తెలియదు. బాల్య మరణాలుండేవి కావు. అబద్ధాల్లేవు. ప్రజలెప్పుడూ సత్యాన్నే పలికేవారు. దొంగలభయం లేదు. దొంగతనాలూ లేవు. తూనికలు కొలతలు సరిగ్గా వుండేవి.. కల్లలెరుగని ప్రజలకు మోసాలేం తెలుస్తాయి? ప్రతి ఒక్కరు పొరుగువారి పట్ల సఖ్యతతో వుండేవారు.అలాంటి పాలనలో కేరళ ప్రజలు వుండేవారు... అందుకే ఆ మహాబలిని ప్రతి సంవత్సరం కొలుచుకునేది. తరాలు మారుతూ వున్నా... కాలం మారుతూ వస్తున్న అందమైన సంస్కృతిని ప్రతిబింబించే ఓనం పండగపై మాత్రం ఆసక్తి ఎంత మాత్రం తగ్గలేదు. ఇదీ ఓనమ్ పండగ కథ.