సిరిసంపదలున్న చోట బంగారముంటుందో..బంగారమున్న చోట సిరిసంపదలు వర్ధిల్లుతాయో తెలియదు కానీ మనవాళ్లకు బంగారమున్న చోట లక్ష్మీ తాండవిస్తుందనేది గట్టి నమ్మకం. అదే ధన త్రయోదశి(Dhana Trayodasi) రోజు బంగారం కొన్నామే అనుకోండి మహాలక్ష్మి స్థిరంగా ఉంటుందనే విశ్వాసం ఉంది. ఈ నమ్మకం మనవాళ్లకు కొత్తగా పుట్టుకొచ్చింది.

సిరిసంపదలున్న చోట బంగారముంటుందో..బంగారమున్న చోట సిరిసంపదలు వర్ధిల్లుతాయో తెలియదు కానీ మనవాళ్లకు బంగారమున్న చోట లక్ష్మీ తాండవిస్తుందనేది గట్టి నమ్మకం. అదే ధన త్రయోదశి(Dhana Trayodasi) రోజు బంగారం కొన్నామే అనుకోండి మహాలక్ష్మి స్థిరంగా ఉంటుందనే విశ్వాసం ఉంది. ఈ నమ్మకం మనవాళ్లకు కొత్తగా పుట్టుకొచ్చింది. పాతిక సంవత్సరాల కిందట ధన త్రయోదశి గురించి మనకు పెద్దగా తెలియదు. ధన త్రయోదశి రోజు బంగారాన్ని కొని తీరాల్సిందేనా? కొంటే లక్కు కలిసొస్తుందా? లక్ష్మమ్మ నట్టింట్లో పద్మాసనం వేసుకుని కూర్చుంటుందా? లేకపోతే ఇదంతా మార్కెట్‌ జిమ్మిక్కా? చెప్పడం కష్టమే కానీ తెలుగువారికి ఇదో కొత్త పండుగైంది. బంగారం సంగతి పక్కన పెడితే ధన త్రయోదశిని దీపావళి వేడుకల్లో భాగంగా జరుపుకోవడం అనాదిగా వస్తున్నదే. ఈ పండుగను ఒక్కో చోట ఒక్కో విధంగా జరుపుకుంటారు. కొంత మంది యమదీపం వెలిగించి ఇంటి ముందుంచుతారు. ఇంకొంత మంది బంగారం వెండి వస్తువులు కొంటారు. మరికొందరు లక్ష్మీపూజ చేస్తారు. త్రయోదశి రోజున చీకట్లు ముసురుతున్న వేళ అపమృత్యు నివారణ కోసం నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దాన్ని పూజించి ఇంటిముందుంచుతారు. ఇదే యమదీపం.ఈ దీపోత్సవాన్ని కౌముదీ మహోత్సవం అని కూడా అంటారు. నరక చతుర్దశి రోజున యమునికి తర్పణాన్ని ఆచరించి.దీపదానం చేస్తే పుణ్యలోకాలు సంప్రప్తాయన్నది ఓ విశ్వాసం. వివిధ ఆభరణాలతో లక్ష్మీదేవిని అలంకరిస్తారు... ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి గడపదాటి వెళ్లిపోదనేది హిందువుల నమ్మకం.ఉత్తర భారతంలో ఈ ఆచారం ఇప్పటికీ వుంది. ధన్‌తేరస్‌ పేరిట ఈ శుభదినాన్ని ఐశ్వర్య ప్రదాయక తరుణంగా వారు భావిస్తారు.

అసలు ధన త్రయోదశి నుంచే ఇంటి ముందు దీపాల్ని వెలిగించడం మొదలవుతుంది. ఈ దీపారాధన కార్తీక మాసం చివరి వరకూ కొనసాగుతుంది.పితృదేవతలు ధన త్రయోదశి రోజున తమ పూర్వ గృహాలకు వస్తారని ఉత్తర భారతీయులు నమ్ముతారు..అందుకే సాయంకాలం ఇంటి ముందు దక్షిణ దిక్కుగా అన్నపురాశిపై దీపాన్ని వుంచుతారు.పితృదేవతలకు ఈ దీపమే దారి చూపుతుందని వారి విశ్వాసం. దక్షిణ భారతంలో ధన త్రయోదశిని ఐశ్వర్య, సౌభాగ్యదాయక పర్వదినంగా నిర్వహించుకుంటారు.దీనికి సంబంధించి ఎన్నో పురాణగాధలున్నాయి. నరకాసురుడి చేతిలో బందీగా వున్న ధనలక్ష్మీని శ్రీమహా విష్ణువు విడిపించి, తన పాంచజన్య శంఖంతో, కామధేను క్షీరంతో, చతుస్సముద్ర జలంతో ధనలక్ష్మీకి సామ్రాజ్య పట్టాభిషేకం జరిపించిన రోజు ఇదే! బలిచక్రవర్తికి వామనావతారంలో వున్న విష్ణుమూర్తి వరమిచ్చిన రోజు కూడా ఇదే! తాను భూలోకాన్ని సందర్శించేటప్పుడు సర్వం లక్ష్మీశోభితంగా వుండాలని ఆ లక్ష్మీపతిని బలిచక్రవర్తి ప్రార్థిస్తాడు. ఆ మహాభక్తుడి కోరిక మేరకు దీపకాంతుల వైభవంతో లక్ష్మీకళ ఉట్టిపడేలా ధన త్రయోదశి నాడు శ్రీహరి వర ప్రదానం చేశాడు.అందుకే ఈ పండుగకు అంత వెలుగు..

ఈ పండుగకు సంబంధించిన మరో కథ కూడా వుంది. సంతానం కోసం పరితపిస్తున్న హిమవంతుడనే రాజుకు లేక లేక ఓ కొడుకు పుడతాడు.ఆ రాజకుమారుడు తన పదహారో ఏట వివాహమైన నాలుగో రోజున పాముకాటుతో చనిపోతాడని జ్యోతిష్కులు చెబుతారు.వాళ్లు చెప్పినట్టే పదహారోఏట వివాహమవుతుంది. ఆ రాజకుమారుడి భార్య తన భర్త ప్రాణాలను కాపాడుకునేందుకు రాజసౌధాన్ని దీపాలతో అలంకరిస్తుంది. బంగారం, వెండి, రత్నాలను రాశులుగా పోసి శ్రీహరి వైభవాన్ని గానం చేస్తుంది. రాజకుమారుడి ప్రాణాలు తీయడానికి సర్పరూపంలో వచ్చిన యమధర్మరాజుకు ఆ దీపకాంతికి, బంగారం వెండి ధగధగలకు కళ్లు మిరుమిట్లు గొలిపాయి. కళ్లు చెదిరి కదలకుండా ఉండిపోతాడు.వచ్చిన పని మర్చిపోతాడు. అందుకే స్త్రీల సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి ధన త్రయోదశి ఓ సూచిక. అందుకే ఈ రోజున వెండి బంగారాలను కొని ధనలక్ష్మీ పూజ చేస్తారు. అయితే ఇదంతా ఉత్తర భారత దేశంలో ప్రాచుర్యమైన పురాణకథలు. ఇక్కడి వాళ్లకు పెద్దగా సంబంధం లేదు. పండుగ రోజు కొత్త వస్తువును కొనాలన్నది వుంటే వుండవచ్చు కానీ.ధన్‌తేరాస్‌ నాడు బంగారం కొనడం తప్పనిసరని ఏ పురాణ గ్రంధమూ చెప్పలేదు. అదో ఆప్షన్ మాత్రమే.

Updated On 9 Nov 2023 3:44 AM GMT
Ehatv

Ehatv

Next Story