శబరిమలలో(Shabarimala) కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివెళుతుంటారు.
శబరిమలలో(Shabarimala) కొలువైన అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివెళుతుంటారు. ఇప్పుడంటే శబరిమల యాత్రం కాసింత సులభతరం అయ్యింది కానీ ఆరేడు దశాబ్దాల కిందట స్వామి దర్శనానికి చాలా కష్టపడాల్సి వచ్చేది. ఇప్పుడు కూడా శ్రమకోరిస్తే తప్ప అయ్యప్ప కనికరించడు. శబరిమలపై మరణాలు కూడా నమోదవుతున్నాయి. వీటిల్లో ఎక్కువ శాతం గుండె(Heart failure) ఆగిపోవడం, శ్వాసకోశ(Respiratory problem) సమస్యలతో చనిపోతున్నారు. గత సీజన్‌లో 55 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో శబరిమల ఆలయాన్ని సందర్శించే భక్తులకు బీమా కవరేజీని ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన ట్రావెన్‌కోర్ దేవోస్వమ్ బోర్డుకు వచ్చింది. ఈ ఆలోచనకు బీమా సంస్థల నుంచి సానుకూల స్పందన వచ్చింది. ఇటీవల కొన్ని బీమా కంపెనీలతో టీడీబీ చర్చలు కూడా జరిపింది. నిష్పాక్షిక ప్రక్రియ ద్వారా బీమా ప్రొవైడర్‌ను ఎంపిక చేస్తామని టీడీబీ చెప్పింది. తక్కువ ప్రీమియంతో గరిష్ట ప్రయోజనాలు అందించే సంస్థను ఎంపిక చేస్తామన్నారు టీడీబీ అధికారులు. గత కొన్నేళ్లుగా యాత్రికులకు ప్రమాద మరణ బీమా కవరేజీని టీడీబీ కల్పిస్తున్నది కానీ ప్రతి ఏడాది జరుగుతున్న మరణాలలో ఎక్కువ భాగం ప్రమాదం కాని కారణాల వల్ల సంభవిస్తున్నాయి. దీంతో బాధిత కుటుంబాలకు పరిహారం అందడం లేదని అధికారులు అంటున్నారు. గత యాత్రల సీజన్ వరకు యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ సంస్థ భాగస్వామ్యంతో యాత్రికులకు బీమా కవరేజీని అందించేవారు. పరిమిత ప్రయోజనాలను అందించే పథకానికి బోర్డు వార్షిక ప్రీమియం చెల్లించేది. దీని ద్వారా శబరిమల కొండపై ప్రమాదవశాత్తు మరణించినవారి కుటుంబాలకు 5 లక్షల రూపాయల పరిహారం అందించేవారు. ఇక ఇప్పుడు శబరిమల భక్తులు వర్చువల్ క్యూ విధానం ద్వారా దర్శనం బుక్ చేసేటప్పుడు 10 రూపాయల వరకు వన్ టైమ్ ప్రీమియం చెల్లించి కవరేజీని ఎంచుకోవచ్చు. ఈ కొత్త పథకం కింద సుమారు 5 లక్షల రూపాయల బీమా సౌకర్యంతోపాటు మెరుగైన ప్రయోజనాలు కలుగుతాయి.