మానవుల కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే సంకష్టహర చతుర్థి పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు.
మానవుల కష్టాల నుంచి గట్టెక్కించేది సంకటహర చతుర్థి వ్రతం. గణపతికి అత్యంత ప్రీతిపాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అయితే సంకష్టహర చతుర్థి పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థి రోజున చేసే వ్రతంను సంకష్టహర చతుర్థి లేదా సంకటహర చతుర్థి వ్రతం అంటారు. సంకటములను తొలగించే సంకట హర చతుర్థి వ్రతంను మాత్రం ఆలంబనంగా ఆచరిస్తూ ఉంటారు. ఒకవేళ సంకష్ట హర చతుర్థి మంగళవారం కాని వస్తే దానిని అంగారక చతుర్థి అని అంటారు. అలా కలిసి రావడం చాలా విశేషమైన పర్వదినం. అంగారక చతుర్థి నాడు సంకటహర చతుర్థి వ్రతం ఆచరించడం వల్ల జాతకములోని కుజదోష సమస్యలు తొలగడంతో పాటుగా చేసే పనులలో ఆటంకాలు తొలగి సఫలత చేకూరుతుంది. సంకట హర చతుర్థి పూజా విధానం, ప్రాముఖ్యత గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
ప్రతిమాసం కృష్ణ పక్షంలో అనగా పౌర్ణమి తరువాత 3 , 4 రోజుల్లో చవితి వస్తుంది. సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు వుంటుందో ఆ రోజున సంకష్టహర చవితిగా పరిగణించాలి. అయితే రెండు రోజులు ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒక వేళ ఎప్పుడైనా అలా జరిగితే రెండవ రోజున సంకటహర చవితిగా గమనించాలి. సంకష్టహరచవితి వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలపాటు ఆచరించాలి. ఈ వ్రతాన్ని బహుళ చవితి నాడు ప్రారంభించాలి. సంకష్ఠి చతుర్థి వ్రతాన్ని ఆచరించే వారు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి. వ్రతం చేసే వారు ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. సాధారణంగా పూజలన్నీ ఉదయాన్నే జరుగుతాయి. కానీ సంకష్ఠి చతుర్థి పూజ మాత్రం సాయంకాలం వేళలో జరుపుకోవాలి. ఈ పవిత్రమైన వినాయక విగ్రహాన్ని లేదా ఫొటోకు పువ్వులతో అలంకరించి, పిండి వంటలు, ప్రసాదం, మోదకాన్ని బొజ్జ గణపయ్యకు సమర్పించాలి. పూజా సమయంలో ఈ వ్రతానికి సంబంధించిన కథను భక్తి శ్రద్ధలతో చదవాలి. అదే విధంగా వినాయక మంత్రాలు, స్తోత్రాలు తప్పనిసరిగా పఠించాలి. సూర్యాస్తమయం వరకూ పూజ చేసిన వినాయకుడిని కదపరాదు. సూర్యుడు అస్తమించిన తరువాత స్నానం చేసి దీపం వెలిగించి తిరిగి వినాయకుడికి లఘువుగా పూజ చేయాలి. నియమం పూర్తయిన తరువాత వినాయకుడికి కట్టిన ముడుపు బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించాలి .
సంకష్ఠ చతుర్థి పూజ ముగిసిన తర్వాత చంద్రుడి దర్శనం చేసుకోవాలి. ఆ తర్వాతే ఉపవాసాన్ని విరమించాలి. అంతకంటే ముందు చంద్రుడికి నైవేద్యంగా గంధం, నీరు, బియ్యం, పువ్వులు సమర్పించాలి. చతుర్థి పర్వదినాన పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు పాలు, పండ్లను తీసుకోవచ్చు. ఈ పవిత్రమైన రోజున పొరపాటున కూడా మాంసాహారం, మద్యం వంటి వాటి జోలికి వెళ్లొద్దు. సంకష్ఠి చతుర్థి రోజున వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఎదురయ్యే కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది. సంకట హర చతుర్థి అంటేనే కష్టాలు, అడ్డంకులు ను తొలగించేది అని అర్థం. అందుకే ఈ పవిత్రమైన రోజున వ్రతం ఆచరిస్తే ఎంతో పుణ్యఫలం దక్కుతుందని చాలా మంది నమ్ముతారు.