భాద్రపద మాసపు కృష్ణపక్షాన్ని మహాలయ పక్షంం(Mahalaya Paksh) అంటారు.

భాద్రపద మాసపు కృష్ణపక్షాన్ని మహాలయ పక్షంం(Mahalaya Paksh) అంటారు. ఇది పితృకార్యాలకు విశేషం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య(Badhrapada amavasya) వరకు ఉన్న రోజులను మహాలయపక్షాలని అంటారు. భాద్రపదంలో వచ్చే అమావాస్యను మహాలయ అమావాస్యగా పేర్కొంటారు. ఏడాదికి 12 అమావాస్యలుంటాయి. కానీ, భాద్రపద అమావాస్యకు ఎంతో విశిష్ఠత ఉన్నది. ఈ ఏడాది ఈ నెల 18 నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమవుతున్నాయి. అక్టోబర్‌ 2వ తేదీతో ముగుస్తాయి. ఈ మహాలయ పక్షంలో ఉదయం ఇంటి ప్రధాన ద్వారం ఎదుట లోపల నిలబడి చేతులను జోడించి పితృ దేవతలను సర్మించుకోవాలి. అలా చేయడం వల్ల ఆయుః ఆరోగ్యం, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పితృపక్షం పాటించడానికి తాను అశక్తుడనని, తనను మన్నించి, మీ దీవెనలు అందించాలని మనఃపూర్వకంగా ప్రార్థన చేయాలి. అలా చేసిన వారికి శుభ ఫలితాలు ఉంటాయి. మహాలయ పక్షాలు పితృదేవతలకు శ్రాద్ధ కర్మలు నిర్వహించేందుకు అత్యంత శ్రేష్ఠమైనవి. ఈ పక్షం రోజుల్లో పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను తప్పనిసరిగా శాస్త్రోక్తంగా నిర్వహించాలి.

తమ పితృదేవతలు ఏ తిథిరోజైతే కన్నుమూశారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. ఒకవేళ తిథి రోజున వీలు కాకపోయినా అమావాస్య రోజున పిండ ప్రధానాలు చేయడం శ్రేయస్కరం. తండ్రి జీవించి.. తల్లిని కోల్పోయిన వారు ఈ పక్షంలో పితృపక్షాల్లో నవమి రోజున తర్పణలు, శ్రాద్ధ విధులను ఆచరించాల్సి ఉంటుంది. తలిదండ్రులు ఇద్దరూ లేనివారు మహాలయ పక్షంలో తప్పనిసరిగా పితృకర్మలు చేయాలి. పక్షం రోజుల్లో చేయలేని వారు కనీసం పితృ అమావాస్య రోజైనా తర్పణలు చేయాలి. మరణించిన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి, వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షాల ముఖ్య ఉద్దేశం. వీరుడు, శూరుడు, దానగుణశీలుడు అయిన కర్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో చనిపోతాడు. మరణానంతరం ఆయన స్వర్గానికి వెళతాడు. దారి మధ్యలో కర్ణుడికి ఆకలి వేసింది. అక్కడ ఆయనకు ఓ పండ్ల చెట్టు కనిపించింది. చెట్టుకు ఉన్న ఓ పండును కోసి తిందామనుకున్నాడు. కానీ ఆ పండు కాస్తా బంగారంగా మారిపోయింది. మరో పండు కోసి తినబోయాడు. అది కూడా బంగారంగా మారింది. మూడో సారి అలాగే జరిగింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా పండు బంగారంగా మారిపోయేది.

చివరకు మంచినీటితో కడుపు నింపుకుందామనుకున్నాడు. సెలయేరు దగ్గరకు వెళ్లి దోసిటిలోకి నీరు తీసుకున్నాడు. ఆశ్చర్యంగా అది కూడా బంగారంగా మారిపోయింది. స్వర్గలోకం వెళ్లినా కర్ణుడికి ఈ సమస్య తీరలేదు. ఆకలి దప్పులతో అలమటించసాగాడు. తను చేసిన తప్పిదమేమిటో తెలియక తల్లడిల్లాడు. అప్పుడు అశరీరవాణి ఇలా పలికింది. 'కర్ణా .. నువ్వు దానకర్ణుడిగా విశేషమైన పేరు సంపాదించావు. అడిగినవారికి లేదనకుండా దానం చేశావు. కానీ నువ్వు చేసిన దానాలన్ని డబ్బు రూపేణో, బంగారం, వెండి రూపేణో ఉన్నాయి. ఒక్కరికి కూడా అన్నంపెట్టి ఆకలి తీర్చలేదు. అందుకే నీకు ఈ దుస్థితి వచ్చింది' అని చెప్పింది. దాంతో కర్ణుడు తన పితృదేవుడు సూర్యుడిని ప్రాధేయపడ్డాడు. తనను భూమి మీదకు పంపాలని కోరాడు. సూర్యుడి వినతి మేరకు కర్ణుడిని ఇంద్రుడు భూమ్మీదకు పంపిస్తాడు. భూలోకానికి వెళ్లి అన్నార్తులకు అన్నం పెట్టి, మాతాపితరులకు తర్పణలు వదిలి వెంటనే తిరిగి రావాలని చెప్పాడు. ఈ క్రమంలోనే కర్ణుడు భాద్రపద బహుళ పాడ్యమి రోజున భూమిపైకి వచ్చాడు. పేదలు, బంధుమిత్రులు అందరికీ అన్నం పెట్టాడు. పితృ దేవతలకు తర్పణలు వదిలాడు. మళ్లీ అమావాస్య రోజున స్వర్గానికి చేరుకున్నాడు. ఎప్పుడైతే కర్ణుడు అన్న సంతర్పణలు , పితృ తర్పణాలు చేశాడో ఆ సమయంలోనే ఆయన ఆకలి తీరిపోయింది. కర్ణుడు భూమిపైకి వచ్చి తిరిగి వెళ్లిన పక్షం రోజులనే మహాలయ పక్షమనే పేరు వచ్చింది. ఈ పక్షంలో వచ్చే చివరి రోజే అమావాస్యగా పిలుస్తారు. ప్రతి ఒక్కరు కుటుంబంలో మరణించిన వ్యక్తులు, స్నేహితులు, గురువులు, పితృదేవతలందరికీ తిల శ్రాద్ధం సమర్పించాలి. అది కర్తవ్యం కూడా!

Eha Tv

Eha Tv

Next Story