ఈ రోజు పెద్ద శేష వాహనంపై మలయప్ప స్వామి
తిరుమలలో(tirumala) ఈ రోజు నాగుల చవితి(nagula chavthi) పర్వదినం సందర్భంగా పెద్దశేష వాహనంపై(pedha shesha vahanam) రాత్రి 7 నుండి 9 గంటలవరకు శ్రీ మలయప్పస్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దర్శనమివ్వనున్నారు. సర్పరాజైన ఆదిశేషువు జగన్నాథునికి నివాస భూమిగా, తల్పంగా, సింహాసనంగా స్వామివారికి విశేష సేవలందించినట్లు పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి సహస్రనామాలతో శేషసాయి, శేషస్తుత్యం, శేషాద్రి నిలయం అంటూ నిత్య పూజలు అందుకుంటున్నారు. అటు రామావతారంలో లక్ష్మణుడిగా, కృష్ణావతారంలో బలరామునిగా స్వామివారికి అత్యంత సన్నిహితునిగా వ్యవహరించే ఆదిశేషువు శ్రీ వైకుంఠంలోని నిత్యసూరులలో ఆద్యుడు. ఈ విధంగా స్వామివారు, దాసభక్తికి మారురూపంగా నిలిచే తన ప్రియ భక్తుడైన శ్రీ ఆదిశేషుడిపై ఉభయదేవేరులతో కూడి తిరువీధులలో విహరిస్తూ భక్తులకు అభయమివ్వడమే కాకుండా శరణాగతి ప్రపత్తిని కూడా సాక్షాత్కరింపచేస్తాడు. అందుకే బ్రహ్మోత్సవ వాహన సేవలలో కూడా తొలి ప్రాధాన్యత ఆదిశేషునికే ఆ భగవంతుడు ప్రసాదించాడు.