శ్రావణ శుక్ల పంచమి తిథి అనగానే నాగుపాములు(snake) చటుక్కుమని మదిలో మెదలుతాయి.
శ్రావణ శుక్ల పంచమి తిథి అనగానే నాగుపాములు(snake) చటుక్కుమని మదిలో మెదలుతాయి. పంచమి తిథి రోజున చాలా మంది పుట్టలో పాలు పోస్తారు. నాగేంద్రుడిని పూజిస్తారు. కానీ ఈ శ్రావణ మాసంలో వచ్చే ఈ పంచమి తిథిని మాత్రం గరుడ పంచమి(Garuda panchami) అని కూడా అంటారు. నాగులు. గరుడు (అంటే గద్ద) రెండు వైరి జంతువులు. ఒకదానితో ఒకటి అసలు పడవు. అలాంటి రెండింటికి సంబంధించిన రోజుగా పండితులు చెబుతుంటారు. ఇంతకీ దీన్ని నాగుల పంచమి(Nagula panchami) అని పిలవాలా లేక గరుడు పంచమి అనాలా? ఎందుకు ఇలా రెండు రకాలుగా పిలుస్తున్నారు? అంటే పెద్ద కథే ఉంది. కశ్యప ప్రజాపతికి వినత, కద్రువ అనే ఇద్దరు భార్యలు ఉండేవారు. వినతకి గరుత్మంతుడు జన్మించిగా, కద్రువ కడుపున సర్ప జాతి జన్మించింది. అందువల్ల సర్పజాతి జన్మించిన శ్రావణ శుద్ధ పంచమి నాగ పంచమిగా పిలుచుకుంటారు. ఇక ఇదే రోజున వినతకి గరుత్మంతుడు జన్మించాడు కనుక శ్రావణ శుద్ధ పంచమిని గరుడ పంచమిగా కూడా వ్యవహరిస్తున్నాం. అదీగాక ఆయన తన తల్లి వినత దాస్య విముక్తి కోసం ఆయన కనబర్చిన ధైర్య సాహాసాల రీత్యా ఈ పర్యదినానికి, ఆయనకి కూడా ప్రాముఖ్యత వచ్చింది. కావున శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ పంచమిని నాగపంచమిగానూ, గరుడ పంచమిగానూ వ్యవహరిస్తున్నాం. కేవలం శ్రావణంలో వచ్చే పంచమికి మాత్రం నాగేంద్రుడి తోపాటు గరుత్మంతునికి కూడ అత్యంత ప్రాముఖ్యతనిస్తున్నారు. ప్రతి ఏడాది తిరుమలలో కూడా గరుడపంచమి పూజను నిర్వహస్తారు. నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందదాయకంగా వుండేందుకు, స్త్రీలు తమకు పుట్టే సంతానం గరుడునిలాగా బలశాలిగా, మంచి వ్యక్తిత్వం గలవాడిగా ఉండేందుకు పూజిస్తారు.