చిత్తూరు జిల్లాలో(Chittoor District) వెలిసిన వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల సత్యదేవుడుగా భక్తుల కొంగుబంగారమయ్యాడు. ఇప్పుడా విఘ్ననాయకుడు వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నాడు. స్వయంభూగా వెలసిన కాణిపాకం వినాయక క్షేత్రం గురించి తెలుసుకుందాం!
చిత్తూరు జిల్లాలో(Chittoor District) వెలిసిన వరసిద్ధి వినాయకుడు సత్యప్రమాణాల సత్యదేవుడుగా భక్తుల కొంగుబంగారమయ్యాడు. ఇప్పుడా విఘ్ననాయకుడు వార్షిక బ్రహ్మోత్సవాలకు సిద్ధమవుతున్నాడు. స్వయంభూగా వెలసిన కాణిపాకం వినాయక క్షేత్రం గురించి తెలుసుకుందాం!
గణనాథుడు స్వయంగా వెలిసిన క్షేత్రం కాణిపాకం(Kanipakam). ఆయన కోరిన వరాలిచ్చే వరసిద్ధుడు. సత్య ప్రమాణాల దేవుడు. చిత్తూరు నగరానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఐరాల(Aira) మండల పరిధిలో, బహుదానది(Bahudhanadhi) తీరంలో ఉందీ క్షేత్రం. ఒకప్పుడు దీనిని విహారపురి(Vihapuri) అని పిలిచేవారు. దివ్యాంగులైన ముగ్గురు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకునేవారు. ఓ రోజున పొలాలకు నీళ్లు పెడదామనుకుంటే బావిలో నీళ్లు అడుగంటిపోయాయట! పూడిక తీయడానికి గడ్డపారతో తవ్వగానే పెచ్చురేగి రక్తం స్రవించడం మొదలయ్యిందట! ఆ జల స్పర్శతో ముగ్గురి అంగవైకల్యం తొలగిపోయిందట! ఆ తర్వాత మరింతగా తవ్వి చూడటంతో స్వామివారి మూర్తి బయటపడిందట! అయితే ఎంత తవ్వినా తుది లభించలేదట. దీంతో ఆ మూర్తికి లెక్కలేనన్ని కొబ్బరికాయలు కొట్టి, నైవేద్యాన్ని సమర్పించుకుని, మంగళహారతులు ఇచ్చారట! అలా కొట్టిన కొబ్బరికాయల నీళ్లు ఎకరం మేర పారాయట! దీనిని కాణి అంటారు. కాలక్రమంలో కాణిపారకమే కాణిపాకం అయ్యింది.
ఆలయ నిర్మాణం ఎప్పుడు జరిగిందనేదానిపై స్పష్టత లేదు. కానీ ప్రాచీనమైన ఆలయమే ఇది! స్వామి చుట్టూ జలం ఉంటుంది. ప్రస్తుతం మనకు మోకాళ్లు, ఉదరం కనిపిస్తాయి.. గత పాతికేళ్లలో ఆలయ రూపురేఖలు ఎంతో మారాయి. ఎంతో అభివృద్ధి చెందింది. భక్తుల సంఖ్య కూడా ఏటికేడు పెరుగుతోంది. ఆదాయం కోట్లకు చేరింది. ప్రతి ఏటా ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. వినాయకచవితితో మొదలయ్యే ఈ ఉత్సవాలు 21 రోజులపాటు కొనసాగుతాయి. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయన్నది భక్తుల నమ్మకం. అందుకే కర్ణాటక, తమిళనాడు, కేరళ, మహారాష్ట్రల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో వస్తారు. మిగతా ఆలయాల కంటే భిన్నంగా ఇక్కడ బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తారు. 14 గ్రామాలకు చెందిన 21 కులస్తులు ఉభయదారులుగా ఇందులో పాలుపంచుకుంటారు. ఒక్కో రోజు ఒక్కో సామాజికవర్గానికి చెందిన ఉభయదారుల మీదుగా ఉత్సవ కార్యక్రమాలను జరిపిస్తారు.. ఉత్సవాల్లో అత్యంత ముఖ్యమైనది రథోత్సవం. స్వామి ఆసీనులైన రథాన్ని లాగేందుకు భక్తజనం పోటీపడతారు. తెప్పోత్సవం, పుష్పపల్లికి వంటి ఉత్సవాలకు కూడా భక్తులు భారీగా తరలివస్తారు. బ్రహ్మోత్సవాల చివరి రోజున లడ్డు వేలంపాట జరుగుతుంది.
ఇక్కడి వినాయకుడిని సత్యప్రమాణాల దేవుడంటారు. భక్తులు ఎక్కువగా ప్రమాణాల నిమిత్తం వస్తారు. నిందారోపణలు మోపేవారు, మోపబడేవారు కలిసి వచ్చి ప్రమాణాలు చేస్తారు. తప్పుడు ప్రమాణాలు చేసిన వారు ఆరు నెలల కాలంలోనే తగిన శిక్ష అనుభవిస్తారట! బ్రిటిష్‌కాలం నుంచి 1954 వరకు ఎలాంటి కేసుకైనా కాణిపాకంలో ప్రమాణం చేసిన ఆరు నెలల తర్వాత చోటుచేసుకునే పరిణామాలకు అనుగుణంగానే కోర్టు తీర్పు ఇచ్చేదట! ఇంత ప్రాధాన్యం సంతరించుకున్న ఈ ప్రమాణాలకు ఇక్కడి ఆలయ అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రత్యేక సమయాన్ని కేటాయించారు. సాయంత్రం నాలుగున్నర నుంచి అయిదున్నర వరకు ప్రమాణాలు చేసుకోవచ్చు. ఈ గంటపాటు సామాన్యభక్తులకు దర్శనాలు ఉండవు.