ఆ కృష్ణాలయంలో మిరపకాయలు, వేరుశనగనూనె నిషేధం...ఎందుకంటే!
మన దేశంలో శ్రీకృష్ణభగవానుడి(Krishna) ఆలయాల వేలసంఖ్యలోనే ఉంటాయి.. అందులో సుప్రసిద్ధమైనవి మాత్రం పదుల సంఖ్యలో ఉంటాయి.. వాటిల్లో చెన్నై(Chennai) నగరంలోని ట్రిప్లికేన్‌లో ఉన్న ప్రాచీన పార్థసారథి ఆలయం(Parthasarathy temple) ఒకటి..! పార్థసారథి అంటే శ్రీకృష్ణుడే! ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఈ ఆలయం 108 వైష్ణవ దివ్యక్షేత్రాలలో ఒకటి! బ్రహ్మాండ పురాణంలో ఈ క్షేత్రాన్ని తిరువల్లిక్కేణిగా ప్రస్తావించారు.
అయితే బ్రిటిష్‌వారికి నోరు తిరగక ట్రిప్లికేన్ అని పేరు పెట్టారు. ఆలయ స్థలపురాణం ఎన్నో విషయాలను చెబుతుంది.. సుమతి అనే మహారాజుకు ఇచ్చిన మాట ప్రకారం వెంకటేశ్వరస్వామినే పార్థసారథిగా వెలిశారట! మరో కథ ప్రకారం సంతానం కోసం రామానుజాచార్యుల తల్లిదండ్రులు ఈ ఆలయాన్ని సందర్శించి పార్థసారథిని వేడుకున్నారట! అప్పుడు రామానుజాచార్యులు జన్మించారట!
పార్థసారథి విగ్రహానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి.. కురుక్షేత్ర సంగ్రామంలో భీష్ముడు వదిలిన అస్త్రాలు శ్రీకృష్ణుడికి తగిలాయట! అందుకే స్వామి ముఖంపై మచ్చలు ఏర్పడ్డాయట! పైగా పార్థసారథికి మీసాలు కూడా ఉంటాయి.. చేతిలో సుదర్శన చక్రం కూడా ఉండదు.. సాధారణంగా ఉత్సవమూర్తులను పంచలోహాలతో తయారు చేస్తారు.. ఇక్కడ ఉన్న ఉత్సవమూర్తి మాత్రం దారుశిల్పం! ఈ ఆలయానికి రెండు ధ్వజస్తంభాలు ఉన్నాయి.. ఒకటేమి గర్భగుడికి ఎదురుగా ఉంటుంది.. మరొకటి నరసింహస్వామి ఆలయానికి ఎదురుగా ఉంటుంది.
ఈ క్షేత్రంలో కృష్ణుడు తన పట్టమహిషి రుక్మిణిదేవి, అన్న బలరాముడు, సాత్యకిలతో ఉంటారు. కృష్ణుడి కొడుకు ప్రద్యుమ్నుడు, మనమడు అనిరుద్ధుడిని కూడా ఇక్కడ చూడొచ్చు. ఇలా శ్రీ కృష్ణుడు సకుటుంబ సపరివారంగా కొలువై ఉండటాన్ని మనం కేవలం ఇక్కడ మాత్రమే చూడగలం. అదేవిధంగా ఇక్కడ శ్రీ కృష్ణుడు వివిధ రూపాల్లో దర్శనమిస్తారు.
శ్రీరంగనాథ రూపం (శయనించిన స్థితిలో), చక్రవర్తి తిరుమగన్ (నిలుచున్న), గజేంద్రవరదన్ (పయనించే స్థితిలో) అళగియశింగర్ (కూర్చొన్న స్థితిలో)కనిపిస్తాడు. సాధారణంగా ఒక క్షేత్రంలో ఒకే స్థితిలో విగ్రహాలను చూస్తాం. అయితే ఈ క్షేత్రంలో మాత్రమే స్వామివారు ఇలా విభిన్న స్థితిలో కనిపిస్తారు. ఇక మూలవిరాట్టు విగ్రహం కూడా విభిన్నమే.
ఇక్కడ ఉన్నట్లు స్వామివారి విగ్రహం మనకు మరెక్కడా కనిపించదు. ద్రావిడ ఆలయ నిర్మాణశైలిలో ఆలయ గోపురం.. మండపాలను నిర్మించారు. ఆలయ పుష్కరిణిని తిరు అల్లిక్కేణి అంటారు.. అల్లి అంటే కలువపువ్వు.. పుష్కరిణిలో కలువపూలు ఎక్కువ! మైలాపూర్‌కు దగ్గరగా ఉండటం వల్ల మయిలై తిరువ్లిక్కేణి అని కూడా అంటారు.. ఇక ఈ క్షేత్రానికి కూడా చాలా పేర్లు ఉన్నాయి.. కొందరు బృందారణ్య క్షేత్రమంటారు.
మరికొందరు వేంకట్‌కృష్ణన్ ఆలయం అని పిలుచుకుంటారు.. ఈ ఆలయంలో వేరుశనగనూనె.. మిరపకాయలు నిషిద్ధం.. వీటితో తయారు చేసిన ఆహారపదార్థాలను కూడా స్వామివారికి నైవేద్యంగా కానీ భక్తులకు ప్రసాదంగాకానీ ఇవ్వరు. స్వామివారికి చక్కర పొంగలి, దధ్యోజనాన్ని నైవేద్యంగా పెడతారు.