రంగుల పండుగను చూసుంటారు. రంగులు చల్లుకోవటాలూ చూసుంటారు. కేవలం పసుపునే తాము నమ్మిన దేవుడిని సమర్పించుకుంటూ, దేవుడికి ఇష్టమైన ఆ పసుపును ఒకరిపై ఒకరు చల్లుకుంటూ జరుపుకునే వేడుకను చూశారా ? చూసి ఉండరు. మహారాష్ర్టలో జరుగుతుందీ ఉత్సవం. ఆ పసుపు పండుగ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం! సోమవారం పవిత్రమైన సోమావతి అమావాస్య. ఉత్తర భారతీయులకు ఇది పవిత్రదినం. శుభప్రదం.. ముఖ్యంగా మహారాష్ట్రీయులు పండుగలా చేసుకుంటారు. ఇక ఖండోబారాయుడి ఆలయం అయితే చెప్పనే అక్కర్లేదు. పుణేకు కేవలం […]

రంగుల పండుగను చూసుంటారు. రంగులు చల్లుకోవటాలూ చూసుంటారు. కేవలం పసుపునే తాము నమ్మిన దేవుడిని సమర్పించుకుంటూ, దేవుడికి ఇష్టమైన ఆ పసుపును ఒకరిపై ఒకరు చల్లుకుంటూ జరుపుకునే వేడుకను చూశారా ? చూసి ఉండరు. మహారాష్ర్టలో జరుగుతుందీ ఉత్సవం. ఆ పసుపు పండుగ విశిష్టత ఏమిటో తెలుసుకుందాం!
సోమవారం పవిత్రమైన సోమావతి అమావాస్య. ఉత్తర భారతీయులకు ఇది పవిత్రదినం. శుభప్రదం.. ముఖ్యంగా మహారాష్ట్రీయులు పండుగలా చేసుకుంటారు. ఇక ఖండోబారాయుడి ఆలయం అయితే చెప్పనే అక్కర్లేదు. పుణేకు కేవలం 40 కిలోమీటర్ల దూరంలో జేజూరి ఉంది. అక్కడ ఖండోబారాయుడి ఆలయం ఉంది. సోమవతి అమావాస్య రోజున ఖండోబారాయుడిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఏడాదికేడాది భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తెలంగాణ, కర్నాటక రాష్ర్టాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో జేజూరికి తరలివెళతారు.

సోమావతి అమావాస్య రోజున జేజూరి పరిసర ప్రాంతాలన్ని ఖండోబా నామస్మరణతో మారుమోగుతాయి.. అంతా పసుపుమయం అవుతుంది.. ఖండోబారాయుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పసుపును చల్లుకుంటూ భక్తులు ఆనందపరవశులవుతారు. అసలు ఆ దృశ్యమే అద్భుతంగా ఉంటుంది.. పసుపు వర్ణ శోభితమయ్యే ఆ ఆలయ ప్రాంగణం నయన మనోహరంగా ఉంటుంది. సోమావతి అమావాస్య రోజున ఖండోబారాయుడి గుడి కొత్త శోభను సంతరించుకుంటుంది. అనాదిగా వస్తున్న సంప్రదాయాన్ని అనుసరించి మొదట ఉత్సవ మూర్తులకు పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తారు. మధ్యాహ్నం ఒంటిగంటకు మూర్తులను జేజూరి గుట్టుమీదకు పల్లకీలో ఊరేగింపుగా తీసుకెళతారు. అనంతరం పల్లకీని దేవాలయం చుట్టూ తిప్పుతారు. సాయంత్రం కర్హా నదిలో ఉత్సవ మూర్తులకు స్నానాదికాలు చేయిస్తారు.

ఖండోబా దేవుడు అచ్చంగా గ్రామీణ ప్రజల దేవుడు.. ఖండోబారాయుడు మహాశివుడిగా భావిస్తారు.. పార్వతి మాత.. గంగామాత సమేతంగా ఖండోబరాయుడు దర్శనమిస్తాడు. జేజూరిలోనే కాదు. ఖండోబారాయుడి ఆలయాలు మహారాష్ర్ట, కర్నాటకలలో పది పన్నెండు ఉన్నాయి..
ధంగార్‌ తెగకు చెందిన ప్రజలు, రైతులు, పశువులకాపర్లు ఖండోబారాయుడిని ఆరాధిస్తారు.. పూజిస్తారు. చతుర్భుజుడైన ఖండోబారాయుడి ఓ చేతిలో పసుపుతో కూడిన ఓ గిన్నె ఉంటుంది.. కొన్నిచోట్ల బ్రాహ్మణ పూజారులే పూజాదికాలు చేస్తుంటారు. సోమవారం అమావాస్య రోజునే భండారా ఫెస్టివల్‌ జరుగుతుంటుంది. సాధారణంగా ఏడాదిలో రెండుసార్లో మూడుసార్లో ఈ సందర్భం వస్తుంది..

ఉత్సవం రోజున ఆ ప్రాంతం పసుపు వర్ణాన్ని సంతరించుకుంటుంది. పది రూపాయలకు అక్కడ బోలెడంత పసుపు దొరుకుతుంది. రోజంతా జరిగే ఉత్సవాలకు ఆ మాత్రం సరిపోతుంది. పసుపు గాల్లోకి విసిరిన ప్రతీసారి భక్తిపూర్వకంగా జై మల్హర్‌ అంటూ నినదిస్తారు భక్తులు. పసుపును ప్రియంగా భావిస్తాడు కాబట్టే ఖండోబా ఆలయానికి సోన్యాచి జేజూరి అని కూడా అంటారు. ఖండోబారాయుడు పసుపుకు ప్రతీక. కేవలం పసుపు చల్లుకోవడానికే పరిమితమవ్వరు భక్తులు. పాటలు పాడతారు. నృత్యాలు చేస్తారు. పొర్లుడు దండాలు పెడతారు. ఆ దేవుడిని వేడుకోవడంలో వ్యక్తిగత స్వార్థమేమి ఉండదు. ఊరంతా బాగుండాలని, ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని ప్రతీ ఒక్కరు ప్రార్థిస్తారు. పల్లకీలో ఉత్సవమూర్తిని ఊరేగిస్తున్నప్పుడు, స్నానాదికాలు చేయించడానికి కర్హా నదికి తీసుకువస్తున్న సమయంలో వేలాదిమంది భక్తులు పోగవుతారు. పల్లకీని తాకేందుకు ఉత్సాహపడతారు. అంతమంది ఉన్నా ఎంతో క్రమశిక్షణ పాటిస్తారు. ఇప్పటి వరకు చిన్నపాటి తొక్కిసలాట కూడా జరగలేదు..

కొండపైన ఉన్న ఆలయం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయ ముఖ ద్వారంలో నాలుగు దీపస్తంభాలు ఉంటాయి. ఆ దీపస్తంభాలు కూడా మొత్తం పసుపురంగును సంతరించుకుంటాయి.. ఆలయంలో చాలామంది ప్రార్థనల్లో మునిగితేలుతుంటారు. కొందరే విశ్రాంతి తీసుకుంటారు. కొందరు మాత్రం తాము చేసిన పాపాలకు నిష్కృతిగా దేవుడి ముందు తమను తాము కొరడాతో కొట్టుకుంటారు.. మొత్తానికి సోమావతి అమావాస్య రోజున ఆలయంలో ఒక ఉత్సాహపూరిత వాతావరణం ఉంటుంది..
ఖండోబారాయుడు అచ్చమైన మాంసాహారి దేవుడు. మరే ఇతర హిందూ దేవాలయాల్లో కనిపించని ఓ వింత ఇక్కడ కనిపిస్తుంది. అదే ఆలయ ప్రాంగణంలో మాంసపు దుకాణం. ఖండోబాదేవుడు అందరికీ ఆరాధనీయుడే! ముస్లింలు కూడా ఖండోబారాయుడిని పూజిస్తారు. చాలామంది భక్తులు ఖండోబాను మాంసాహారిగానే పరిగణిస్తారు. అందుకే మేకమాంసాన్ని నైవేద్యంగా సమర్పించుకుంటారు. ఖండోబా దేవుడి మూలవిరాట్‌కు చేసే వస్త్రాలంకరణలో కూడా వైరుధ్యం కనిపిస్తుంది.. కొన్ని సార్లు మరాఠా సంప్రదాయాన్ని అనుసరిస్తారు.. కొన్నిసార్లు ముస్లిం పఠాన్‌ వేషంలో ఆయన దర్శనమిస్తాడు.

చాలామందికి ఖండోబా కులదైవం.. కొత్తగా పెళ్లయిన దంపతులు తప్పనిసరిగా ఇక్కడికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు తీసుకుంటారు. సంతానం లేనివారు కూడా ఇక్కడికి వచ్చి మొక్కుకొని వెళతారు.. ఖండోబాను సంతానదేవుడిగా భావిస్తారు భక్తులు. ఏడాది పొడవునా ఆలయాన్ని సందర్శించవచ్చు కానీ.. భందార ఫెస్టివల్‌ అప్పుడు వెళితేనే బాగుంటుంది. జేజూరిలో రెండు ఖండోబా ఆలయాలు ఉన్నాయి.. కొండపైన ఓ ప్రాచీన ఆలయం ఉంది.. . ఆ ఆలయానికి వెళ్లడం చాలా కష్టం.. అందుకే కొత్తగా ఓ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయాన్ని గాడ్‌కోట్‌గా పిలుచుకుంటారు.. కోటను పోలినట్టుగా ఉంటుంది నిర్మాణశైలి... ఆలయానికి చేరుకోవడానికి 450 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది.. ఇక్కడే భందార ఉత్సవం జరుగుతుంటుంది.. భందార ఉత్సవాన్ని దర్శించుకోవడం నిజంగానే ఓ మధురానుభూతి. మర్చిపోలేని జ్ఞాపకం.

Updated On 20 Feb 2023 6:21 AM GMT
Ehatv

Ehatv

Next Story