కార్తీకం. సర్వ మంగళకర మాసం. అద్వైతసిద్ధికి అమరత్వ లబ్దికి అసలైన విలాసం.

కార్తీకం. సర్వ మంగళకర మాసం. అద్వైతసిద్ధికి అమరత్వ లబ్దికి అసలైన విలాసం.భక్త జనకోటికి శుభకరం.హరిహరాదులకు ప్రీతిపాత్రం.మానవాళికి కొంగుబంగారం.ఈ మాసంలో చేసే స్నానం అత్యంత ఆరోగ్యప్రదం.ఇచ్చే దానం పుణ్యఫలప్రదం.చేసే జపం మనో నైర్మల్యకారకం.వ్రతం సంపత్కరం.ఈ మాసంలో వెలిగించే దీపం శుభకరం.స్థితి లయకారులైన లక్ష్మీపతి, గౌరిపతులు ఏకోన్ముఖులై జీవజాలాన్ని ఆదుకునే గొప్ప సమయం. కార్తీక మాసం సర్వ పాపాలను కడిగేస్తుంది. సకల శుభాలను కలిగిస్తుంది. శివకేశవులు అభేదమనే నినాదం. పర్యావరణమే ప్రపంచానికి రక్ష అనే విధానం కార్తీకంలోని నిండుగా అల్లుకున్నాయి.ఆరోగ్య సూత్రాలను పంచివ్వగల దివ్వ సందేశం కూడా అంతర్లీనంగా వుంది. కార్తీకమాసం ప్రతి రోజూ ఓ పర్వదినం.అణువణువునా ఆధ్యాత్మికతత్వం.అందులో అంతర్లీనంగా ఓ అరోగ్యసూత్రం. పండు వెన్నెల కురిపించే పారిజాత వర్షం. వన విహారాలకు, వన భోజనాలకు అనువైన కాలం.

శివకేశవులిద్దరినీ ఏకకాలంలో ఆరాధించి ముక్తిని పొందేందుకు భక్త జనావళికి లభించిన గొప్ప వరం కార్తీకం... చంద్రుడు కృత్తికా నక్షత్రం సమీపాన సంచరిస్తాడు కాబట్టే దీనికి కార్తీక మాసం అని పేరొచ్చింది... దీపావళి మరుసటి రోజు నుంచి అతి పవిత్రమైన కార్తీకమాసం మొదలవుతుంది...ఈ మాసంలో భక్తులంతా శివనామాన్ని స్మరిస్తారు... శివకేశవులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తులు నియమనిష్టలతో చేపట్టే నోములకు ఎంతో ప్రాధాన్యం వుంది... పాడ్యమి... చవితి... పౌర్ణమి... చతుర్దశి...ఏకాదశి...ద్వాదశి తిథుల్లో ఆదిదంపతులైన శివపార్వతుల అనుగ్రహం కోసం మహిళలు పూజలు చేస్తారు..అగ్ని దేవుడు పరమపవిత్రుడు....ఆయన కృత్తికా నక్షత్రానికి అధిదేవత...ఈ నక్షత్రం పూర్ణిమనాటి చంద్రునితో కూడిఉన్న మాసం కార్తీకం... వేద కాలంలో సంవత్సరం కృత్తికా నక్షత్రంతోనే మొదలయ్యేది.. అగ్నికి ఆరుముఖాలుంటాయి... కృత్తికలు కూడా ఆరు నక్షత్రాలు... ఈ కృత్తికలకు ఓ విశిష్టత వుంది... కుమారస్వామిని షణ్ముకుడని కూడా అంటారు.. అంటే ఆరు ముఖాలున్నవాడని అర్థం.. ఆకాశంలోని ఆరు కృత్తికా నక్షత్రాలు మాతృమూర్తులై పాలిస్తే... కుమారస్వామి ఆరు ముఖాలతో తాగాడు... కృత్తికలు పెంచాయి కాబట్టి కుమారస్వామి కార్తీకేయుడయ్యాడు... సోమవారానికి చంద్రుడు అధిపతి. దేవతలలో ప్రథముడైన అగ్ని నక్షత్రాలలో మొదటిదైన కృత్తికను అధిపతిగా ఉం డటం, చంద్రుడు పూర్ణుడై ఈ నక్షత్రం మీద ఉండటం వల్ల మాసంలోని సోమవారాలకు ఓ ప్రత్యేకత...విశిష్టత కలిగాయి.

పరమేశ్వరుడికి సోమవారం ఎంతో ప్రీతికరమైనది... కార్తీక సోమవారాలలో శైవులు నియమ నిష్టలతో ఆ నీలకంఠుడిని ఆరాధిస్తారు.. సూర్యోదయానికి ముందే బ్రహ్మ మూహుర్తంలో అభ్యంగన స్నానమాచరించి భక్తి ప్రపంచంలో మునిగిపోతారు...లోకరక్షకుడైన సూర్యభగవానుడు కార్తీక మాసపు వేకువ వేళల్లో తులారాశిలో సంచరిస్తాడు... ఈ సమయంలో నదీస్నానం చాలా మంచిది.. మన:కారకుడైన చంద్రుని ప్రభావం దేహంపైన...మనస్సుపైనా వుంటుంది... దీన్ని నివారించడానికి ప్రతి సోమవారం లయకారకుడైన శివుడిని ధ్యానించాలని పెద్దలు చెబుతారు...ముఖ్యంగా చన్నీటి స్నానం ఆరోగ్యానికి మంచిదంటారు...ఈ నెల రోజులు భక్తులు సాత్వికాహారం పరిమితంగా తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేకూరుతుంది. శివుడికి ఇష్టమైన సోమవారం ఉదయాన్నే నిద్రలేని స్నానాది కార్యక్రమాలను ముగించుకుని మొదట దీపారాధన చేయాలి...ఆ తర్వాత శివుడికి రుద్రాభిషేకం చేయాలి.. ఇలా చేసిన వారు సిరిసంపదలతో..సుఖ సౌఖ్యాలతో..ఆనందోత్సాహాలతో వర్ధిల్లుతారని శివపురాణం చెబుతోంది...ఈ మాసంలో తప్పనిసరిగా పాటించాల్సిన కొన్ని విధులున్నాయి... పగలంతా ఉపవాసం వుండి నక్షత్ర దర్శనం చేసుకుని భోజనం చేయడం...దీన్ని నక్తం అంటారు.. ఇలా వుండలేనివారు ఛాయనక్తంగా వుంటారు.. దీనివల్ల జీర్ణ కోశం శుభ్రపడుతుంది.. నెలంతా కాకపోయినా ప్రతి సోమవారం చేస్తే మంచిది..తులసి..మారేడు పత్రాలతో శివుని పూజించడం...ఉసిరికాయను వేరు వేరు రూపాలుగా తినడం శ్రేయస్కరం.. ఇవన్నీ ఔషధ గుణాలు కలిగినవే.

సంధ్య చీకట్లు ముసురుకోగానే.... ఆకాశ దీపాలను అమర్చడం సంప్రదాయం... కార్తీక శుద్ధ విదియ నాడు భగినీ హస్తభోజనం చేయడం ఆచారం... మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు పాల సముద్రంలో ఆదిశేషుని పానుపుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు.. ఈ నాలుగు నెలలకూ చాతుర్మాసాలని పేరు. పాల సముద్రాన్ని చిలుకుతున్న సమయంలో ఎన్నో అపురూప వస్తువులు లభిస్తాయి.. వాటన్నింటిని పొందిన దేవతలు కాలకూట విషం రాగానే పారిపోయారు.. అప్పుడు పార్వతీదేవి తన పరమేశ్వరుడిని గరళాన్ని మింగాల్సిందిగా ప్రార్థిస్తుంది... అలా జగద్రక్షణగావిస్తుంది.. అమ్మవారు ఆయనను ప్రేరేపించిందని చెప్పడానికి సంకేతంగా జ్వాలతోరణం పేరిట కార్తీక పౌర్ణమి నాడు గడ్డిని తోరణాలుగా చేసి శివాలయంలో మంట వేస్తారు. పార్వతీదేవి విగ్రహాన్ని మూడు సార్లు ఆ మంట కింద తిప్పుతారు.

కార్తీక మాసపు సోమవారాలలో వనభోజనం చేస్తారు.. ఉసిరిచెట్టు కింద భోజనం చేయడం శుభప్రదమనేది అనాదిగా వస్తూ వున్న నమ్మకం.. సోమవారాలలో శివుడిని అర్చించి... ఆ తర్వాత అన్నాదానం చేయాలి... అతిథి సత్కారాల తర్వాతే దీక్షపూనిన వ్యక్తి భుజించాలి... ఇలా చేయడం వల్ల సర్వ పాపాలు నశిస్తాయి... శివానుగ్రహం లభిస్తుంది..

కార్తీక మాసంలో దేవాలయాలకు కొత్త శోభ వస్తుంది... దీపాలతో దేదీప్యమానమవుతాయి.. ప్రతి ఇంటి ముంగిట దీపం వెలుగుతూ వుంటుంది.. వ్రతానంతరం వదిలిన దీపాలతో నదులు... కోనేట్లు వెలుగులను సంతరించుకుంటాయి.. ఆకాశంలోని నక్షత్రాలు నీళ్లలో దిగాయేమో అన్న భ్రమ కలుగుతుంది.. ఈ మాసంలో పుణ్యనదులలో స్నానం చేస్తే పుణ్యలోకాలు సంప్రాప్తిస్తాయి.. కార్తీక మాసంలో గంగానది నదులన్నింటిలో వుంటుందంటారు. కార్తీక శుద్ధ ఏకాదశికి ఎంతో వైశిష్ట్యం వుంది.. శ్రీమహాలక్ష్మికి వివాహం జరిగిన రోజుగా దీన్ని భావిస్తారు..కొన్ని ప్రాంతాలలో ఉత్థాన ఏకాదశిగా పిలుస్తుంటారు.. ఈ రోజున ఉపవాసం వుండి మరుసటి రోజున ద్వాదశి పారాయణం చేస్తే ఎంతో మంచిది... ఈ పవిత్ర మాసంలో ద్వాదశ జ్యోతిర్లింగాలుగా వున్న శివుడు అత్యంత వైభవోపేతంగా పూజలందుకుంటాడు.. పార్వతీసమేత పరమేశ్వరునికి భస్మలేపనం..బిల్వ పత్రాలు...అవిసే పూలతో పూజలు చేస్తే కైలాస ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. కార్తీక పౌర్ణమి గొప్పదనం గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది..పున్నమి రోజు నమక..చమక...మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే ఆ బోళా శంకరుడు ఇట్టే ప్రసన్నుడవుతాడు.. ఇక అమ్మాయిలు తులసికోటలో తులసి మొక్కతో పాటు కాయలతో వున్న ఉసిరికొమ్మను పెట్టి తులసి పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని వుంచి పూజిస్తే సలక్షణమైన వ్యక్తి భర్తగా వస్తాడని ప్రతీతి... ఈ రోజున ఉసిరికదానం చేస్తే దారిద్ర్యం తొలగిపోతుందనీ... లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే సకల ఐశ్వర్యాలు కలుగుతాయని నమ్మకం.. దీపారాధనే కాదు... ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుంది. కార్తీక పౌర్ణమి రోజున నోము నోచుకునే ఇంట కేదారేశ్వరునికి మర్రిచెట్టు ఊడలను తోరణాలుగా ...మర్రిపండ్లను బూరెలుగా... మర్రి ఆకులను విస్తర్లుగా పెట్టి పూజలు చేయడం ఆనాదిగా వస్తూ వున్న సంప్రదాయం.. ఇంటిల్లిపాది కఠోర ఉపవాసాలుండి శివుడిని ధ్యానిస్తారు... పవిత్ర మనసులతో పరిశుభ్రమైన నీరు...ఆవుపాలు... చెరుకు... కొబ్బరికాయలు... తమలపాకులు... పువ్వులతో పూజలు చేసి కర్పూర నీరాజనం చేస్తారు.. తర్వాత నక్షత్ర దర్శనం చేసుకుని స్వామికి నివేదించిన వాటినే ప్రసాదంగా తీసుకుంటారు..

పూర్వం నైమిశారణ్యంలో శౌనకాది మహర్షులతో కలిసి ఆశ్రమం నిర్మించుకున్న ఆదిగురువు సూత మహర్షి కార్తీక వ్రత మహత్మ్యాన్ని...దాన్ని అనుసరించే విధానాన్ని రుషులకు బోధించాడు. పార్వతీదేవి కూడా ఇలాంటి వ్రతం కోసం ఈశ్వరుడిని ప్రార్థించిందట! బ్రహ్మదేవుడు నారదమునికి... మహా విష్ణువు లక్ష్మీదేవికి ఈ వ్రత విధానం గురించి విపులంగా చెప్పారు. స్కంధ పురాణంలో కూడా ఈ వ్రత వివరణ వుంది.. కార్తీక పౌర్ణమి రోజు రాత్రి పన్నెండు గంటలకు పాలలో చంద్రుడిని చూసి ఆ పాలను తాగితే ఆరోగ్యమంటారు..

కార్తీకంలో దీపారాధన ముఖ్యమైన అంశం... తమిళనాడులోని అరుణాచలంలో కార్తీక మాస వేడుకలు ఘనంగా జరుగుతాయి.. కొండపై నెయ్యితో వెలిగించిన జ్యోతి చాలా రోజుల వరకు వెలుగుతూ వుంటుంది... ఈ మాసంలో స్ర్తీలు దీపాన్ని దానంగా ఇస్తారు. దీని వల్ల వారికి ఎనలేని కీర్తిసౌభాగ్యాలు కలుగుతాయని భావిస్తారు. ఈ విధంగా ఈ మాసమంతా నిత్యదీపారాధనలతో వెలుగుతో నిండి ఉంటుంది. ఈ దీపాలు మనిషిలోని అజ్ఞానమునే చీకటిని తొలగించి జ్ఞానమనే వెలుగును నింపుతాయి.

కార్తీక పూర్ణిమనాడు సముద్ర స్నానం విశేష ఫలదాయకం... మహిళలు కార్తీక చలిమిళ్లు అనే నోము నోచుకుంటారు.. దీనివల్ల అయిదోతనం... సంతానయోగం కలుగుతాయి.. . కార్తీక బహుళ ఏకాదశిని హరిబోధినీ ఏకాదశి అంటారు.. అంబరీషుడు వ్రత సమాప్తి చేసింది ఈ ఏకాదశినాడే అంటారు. ఈ పున్నమి రోజే త్రిపురాసుడనే రాక్షసుడిని శివుడు సంహరించాడు కాబట్టి దీన్ని త్రిపుర పూర్ణిమ అని కూడా అంటారు.. ఇక అమృతం కోసం దేవతలు...దానవులు క్షీరసాగరాన్ని చిలకడం మొదలు పెట్టిన రోజు కాబట్టే ఈ మాస శుక్లపక్ష ద్వాదశికి చిలుకు ద్వాదశి అని పేరు.. బందా ద్వాదశి...క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు.. బృంద అంటే తులసి.

కార్తీక మాసంలో కమలాక్షుడైన శ్రీహరిని కమతాలతో పూజించే వారి ఇంట కమలవాసినియైన మహాలక్ష్మి స్థిరంగా వుంటుందట! శ్రీహరిని తులసీదళాలతో...జాజిపూలతో పూజించిన వారికి పునర్జన్మ వుండదట!

Eha Tv

Eha Tv

Next Story