మహాభారతంలో ఆయన రారాజు. కురు సార్వభౌముడు, మానధనుడు, సుయోధనుడు, కురుక్షితిపతి, కౌరవాగ్రజుడు..

మహాభారతంలో ఆయన రారాజు. కురు సార్వభౌముడు, మానధనుడు, సుయోధనుడు, కురుక్షితిపతి, కౌరవాగ్రజుడు.. ఆయనే దుర్యోధనుడు. భారతంలో ఆయన ప్రతి నాయకుడు. ఆయనలో ఎన్ని వైవిధ్యాలు ఉన్నా, ప్రతినాయకుడే! కురుక్షేత్ర సంగ్రామానికి ఆయనే కారకుడనే భావన చాలా మందిలో ఉంది. మనకు దుర్యోధనుడంటే చాలా మంది దృష్టిలో విలన్‌.. కానీ కొందరికి ఆయన హీరో! ఆయనను భగవంతుడిగా భావిస్తూ కొలుస్తారు. ఆయనకు ఆలయం కూడా కట్టారు. దుర్యోధనుడి సోదరులను, సోదరి దుస్సలను కొలుస్తారు. శకునిని ఆరాధిస్తారు. కర్ణుడుని కూడా భక్తితో మొక్కుతారు. కేరళలోని కొల్లాం జిల్లా పెరువాజి పెరువురితి మలనాడ గ్రామ ప్రజలు దుర్యోధనుడి భక్తులు . అక్కడ ఆయన పేరిట ఓ ఆలయం ఉంది. నేటికీ, అందులో నిత్యపూజలు జరుగుతుంటాయి. దుర్యోధనుడి ఆలయానికి ఓ స్థలపురాణం కూడా ఉంది. మాయాజూదంలో ఓడిన పాండవులు 12 ఏళ్లు అరణ్యవాసం చేస్తారు. తర్వాత ఏడాది పాటు అజ్ఞాతవాసం చేయాలి. అప్పుడు వారిని ఎవరైనా కనిపెడితే మాత్రం మళ్లీ 12 ఏళ్లు వనవాసం చేయాల్సి ఉంటుంది. అజ్ఞాతవాసంలో ఉన్న పాండవుల ఆచూకి కోసం కౌరవులు చాలా ప్రయత్నాలు చేస్తారు. వేగులను అన్నిచోట్లకు పంపుతారు. ఎవరి వల్ల కాకపోవడంతో దుర్యోధనుడే స్వయంగా అన్వేషణ మొదలుపెడతాడు. దేశమంతా తిరుగుతాడు. అలా వెతుకుతూ వెతుకుతూ కేరళ ప్రాంతంలోని మలనాడకు వస్తాడు. అప్పుడా ప్రాంతాన్ని కురువ కులానికి చెందిన అప్పోప్పన్‌ పాలిస్తుంటాడు. మలనాడకు చేరుకున్న దుర్యోధనుడు విపరీతమైన దాహం వేస్తుంది. అప్పుడు ఓ వృద్ధురాలు రారాజుకు తాటిచెట్టు నుంచి తీసిన నీటిని ఇస్తుంది. తన దప్పికను తీర్చిన ఆ వృద్ధురాలిని దుర్యోధనుడు ఆప్యాయంగా ఆలింగనం చేసుకుంటాడు. సార్వభౌముడు కుల వివక్ష చూపకుండా తమను అక్కున చేర్చుకోవడంతో మలనాడ ప్రజలు మురిసిపోతారు. దుర్యోధనుడి పట్ల వారిలో భక్తి ప్రపత్తులు ఏర్పడతాయి. సుయోధనుడికి భోజన సత్కారాలు చేస్తారు. వారి ఆతిథ్యానికి కురురాజు ముగ్ధుడవుతాడు. ఆ రాత్రి అక్కడే కొండమీద ఉన్న శివాలయంలో జపం చేసి, మలనాడ ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. మరునాడు అక్కడి నుంచి బయలుదేరే ముందు తాను మళ్లీ శుక్రవారం వస్తానని, ఒకవేళ రాకపోతే తాను మరణించానని భావించి, అంతిమ సంస్కారాలు చేయండి అని చెప్పి వెళతాడు. దుర్యోధనుడు ఎంతకీ రాకపోవడంతో ఆయన స్వర్గస్తుడయ్యాడనే నిర్ణయానికి వస్తారు మలనాడ ప్రజలు. దుర్యోధనుడి పేరిట అంతిమ సంస్కారాలు జరుపుతారు. దుర్యోధనుడు ధ్యానం చేసిన కొండపై ఆయనకు ఓ ఆలయం నిర్మించారు.

దుర్యోధనుడికే కాదు ఆయన 99 మంది సోదరులకు, సోదరి దుస్సలకు, ప్రియ మిత్రుడు కర్ణుడికీ ఆలయాలు కట్టించారు. శకునికి కూడా ఆలయం నిర్మించారు ఇక్కడి ప్రజలు. విశేషమేమిటంటే కౌరవుల ఆలయాల్లో విగ్రహాలు ఉండవు. కేవలం రాతి మంటపమే ఉంటుంది. అక్కడ కూర్చుని దుర్యోధనుడి పరివారాన్ని ఆరాధిస్తుంటారు మలనాడ ప్రజలు. తమ పూర్వీకులకు దుర్యోధనుడు భూమి ఇచ్చాడని నమ్ముతారు. ఆయన అనుగ్రహంతో పొందిన ఆస్తికి సంబంధించిన పన్నును ఆలయానికి చెల్లిస్తూ ఉన్నారు. కురవ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కౌరవులు తమ వాళ్లేనని విశ్వసిస్తారు. ప్రతి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ రోజు మలనాడ చుట్టుపక్కల ప్రజలు కూడా ఈ ఆలయానికి వచ్చి సుయోధనుడి అనుగ్రహం పొందుతుంటారు. మలయాళీ మీన మాసంలో (మార్చి-ఏప్రిల్‌) ఆలయ వార్షికోత్సవం నిర్వహిస్తారు. ఆ రోజు కేరళ నలుమూలల నుంచి లక్షలాదిగా భక్తులు మలనాడ చేరుకుంటారు. తమ మొక్కులు చెల్లించుకుంటారు

ehatv

ehatv

Next Story