కార్తీక పౌర్ణమి(Karthika pournami) నాడు వెలిగించే దీపం(Deepam) మన కోసం కాదు.

కార్తీక పౌర్ణమి(Karthika pournami) నాడు వెలిగించే దీపం(Deepam) మన కోసం కాదు. లోకానికి మేలు చేసే ప్రతి ఒక్కరి బాగు కోసం వెలిగించే దీపం! మనలోని చీకట్లను తొలగించడానికి పెట్టిన దీపం.. అందుకే దీపం జ్యోతి పరబ్రహ్మ...దీపం సర్వ తమోపహమ్‌ అన్నారు.. మనో వికాసానికి..ఆనందానికి.. సుఖ శాంతులకు.. సద్గుణానికి దీపం ప్రతీక.. అది మనలోని అజ్ఞానాన్ని రూపుమాపుతుంది. మనమంతా దీపారాధన చేసేది అందుకే! మనమే కాదు.


ప్రపంచంలో చాలా మంది కార్తీక పున్నమి రోజున దీపాలు వెలిగిస్తారు..

జైనులకు( Jain pilgrimage) ఇది అత్యంత పవిత్రమైన రోజు! శరద్‌ పున్నమి రోజున పాలిటానలోని జైన క్షేత్రానికి భక్తులు పోటెత్తుతారు. శత్రుంజయ కొండలపై ఉన్న ఈ క్షేత్రాన్ని సందర్శించుకునేందుకు దేశం నలుమూల నుంచి జైనులు వస్తారు..దాదాపు 216 కిలోమీటర్ల దూరం కాలినడకన వెళతారు.. ఈ యాత్రను శత్రుంజయ తీర్థయాత్ర అంటారు.. జైనుల మొదటి తీర్థంకరుడైన ఆదినాదను దర్శించి తరిస్తారు. జైనుల పంచక్షేత్రాలలో శత్రుంజయ పర్వతాలపై వెలిసిన ఈ క్షేత్రం కూడా ఒకటి! ఈ ప్రాంతంలో మొత్తం 863 ఆలయాలున్నాయి.. సిక్కులకూ కార్తీక పౌర్ణమి విశేషమైనదే.


సిక్కుల మత గురువు గురు నానక్ పుట్టినరోజు(Guru Nanak birthday) ఇది. మామూలుగానే విశిష్ట దినంగా భావించే కార్తీక పౌర్ణమి గురు నానక్ జన్మదినం కూడా అవ్వడంతో పంజాబీలు(Punjab devotees) ఈ రోజును మహా పర్వదినంగా భావిస్తారు. గురునానక్ జయంతిని పంజాబీలు గురుపూరబ్‌గా(Guru purab) పిల్చుకుంటారు ..ఇక అమృత్‌సర్‌లోని గోల్డెన్‌ టెంపుల్‌ అయితే విద్యుద్దీపాలతో వెలిగిపోతుంది.. పవిత్ర గ్రంథం గురుగ్రంథ్‌ను సిక్కు గురువులు.. భక్తులు ఆలయం నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా బయటకు తీసుకొస్తారు.. దీన్ని గురునానక్‌ ప్రకాశ్‌ ఉత్సవ్‌ అంటారు. భారతదేశంలోనే కాదు. బౌద్ధాన్ని ఆచరించే చాలా దేశాల్లో దీపారాధన ఉంది. శారదరాత్రుల పూజలున్నాయి. శరత్‌చంద్రజ్యోత్న్సలలో వేడుకలు చేసే ఆచారాలున్నాయి.. కార్తీకపున్నమిలో దీపాలు వెలిగించి...ఆ దీపాలను ఆరాధించి.


నీళ్లలో వదిలే సంప్రదాయం ఉంది. మరీ ముఖ్యంగా థాయ్‌లాండ్‌లో కార్తీకపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. సంధ్య చీకట్లు ముసురుకున్నాక నదీనదాలను, సరస్సులను, తటాకాలలో దీపాలను వదులుతారు.. ఆకాశంలోని తారల ప్రతిబింబాలేమో అన్నట్టుగా ఉంటుందా దృశ్యం. ఈ వేడుకను లోయ్‌ క్రతోంగ్‌(Loi Krathong) అంటారు.. సరిగ్గా కార్తీకమాసపు పున్నమి రాత్రే ఈ పండుగ జరుగుతుంది.. థాయ్‌లాండ్‌లో(Thailand) ఇది ప్రధాన పండుగ. అక్కడ పురుషులు కూడా దీపాలను నీళ్లలో వదులుతారు. ఇలా చేయడం వల్ల కష్టాలన్ని తీరతాయన్నది వారి నమ్మకం. ఇక యువతీయువకులైతే ఆకాశంలో లాంతర్లను ఎగురవేస్తారు.. పున్నమి వెలుగులతో పాటు ఈ లాంతర్ల కాంతులూ నిర్మలాకాశానికి నిగారింపు తెస్తాయి.


మనలాగే వారు కూడా అరటి దొప్పల్లో దీపాలను వదులుతారు.. అవి దొరకకపోతే ఆకులతో దొప్పలు చేసి వాటిలో దీపాలు పెట్టి నీళ్లలో వదులుతారు.. లోయ్‌ అంటే తేలియాడే తెప్ప అని అర్థం.. క్రతోంగ్‌ అంటే దీపం! ఇక దీపానికి ప్రత్యేకమైన అలంకరణ చేస్తారు.. అందుకోసం రంగురంగుల పూలను సేకరిస్తారు.. అలంకరణ పూర్తయ్యాక అగరొత్తులు వెలిగిస్తారు.. అందరికంటే భిన్నంగా... అందరిని ఆకట్టుకునే రీతిలో లోయ్‌క్రతోంగ్‌ను తీర్చిదిద్దిన వారికి ప్రత్యేక బహుమతులు కూడా ఇస్తారు. బుద్ధభగవానుడిని, నదీనదాలను పూజించడమే ఈ పండుగ పరమార్థం. ఈ దీపోత్సవానికి కొన్ని వందల ఏళ్ల చరిత్ర ఉంది.


ఈ రోజున ప్రతి ఇల్లూ దీపకాంతులతో వెలిగిపోతుంటుంది. ప్రతి ఆలయమూ దేదీప్యమానంగా శోభిల్లుతుంటుంది. రహదారులు, తోటలు, కార్యాలయాల భవనాలు ఒక్కటేమిటి సమస్తమూ లాంతర్లతో కాంతులీనుతుంటాయి.. వెన్నెల కాంతులతో విద్యుద్దీపాలు పోటీపడతాయి. అన్నింటికంటే ఆకట్టుకునే అంశం మరోటి ఉంది.. అది క్రతోంగ్‌ పరేడ్‌.. దీపాలతోనూ.. రంగురంగుల పూలతో.. రకరకాల దీపాలతో అలంకరించిన శకటాల ఊరేగింపే క్రతోంగ్‌ పరేడ్‌.. శకటాల ముందు సంప్రదాయ నృత్యాలు.. జనపదాల ఆలాపనలు...సాంస్కృతిక కార్యక్రమాలు అదనపు ఆకర్షణలు.


థాయ్‌లాండ్‌లో సుప్రసిద్ధమైన వాట్‌ఫానతావో ఆలయం రంగురంగుల లాంతర్లతో అందంగా ముస్తాబవుతుంది.. అక్కడ జరిగే వేడుకలను తిలకించడానికి దేశదేశాల నుంచి పర్యాటకులు వస్తారు.. ఇదీ థాయ్‌లాండ్‌ కార్తీకపున్నమి వైభవం! శరదృతువులో వచ్చే పౌర్ణిమకు ఏదో ఓ ప్రత్యేకత ఉంది! అందుకే కాబోలు వియత్నాంలోనూ ఈ రుతువులో వచ్చే పున్నమి రోజున పెద్ద వేడుక చేసుకుంటారు.. ఇంచుమించు థాయ్‌లాండ్‌లో జరుపుకునే లోయ్‌ క్రతోంగ్‌లాగే ఉంటుందీ ఉత్సవం.. ఈ వెలుగుల పండుగను హొయ్‌ ఆన్‌ అని పిలుచుకుంటారు.


సాయంత్రం అయ్యిందో లేదో వీధులన్నీ దీపాలతో వెలుగులు నింపుకుంటాయి.. నగరంలో ఆ రోజున మోటార్‌ వాహనాలు తిరగవు.. ఎక్కడ చూసినా మొహాలు వెలిగిపోతున్న జనమే! స్వేచ్ఛగా తిరుగుతూ యామిని పూర్ణచంద్రిక శోభను ఆస్వాదిస్తారు. లాంతర్‌ పోటీలు సరేసరి! రంగురంగులతో కాంతులీనుతున్న లాంతర్లు ఆకాశంలో విహరిస్తాయి.. ఆటపాటల సంగతి చెప్పనే అక్కర్లేదు! హొయ్‌ ఆన్‌ అనేది ఓ వియత్నాంలోని ఓ ప్రాచీన నగరం.. ఈ ఉత్సవం రోజున వేలాది మంది ఈ నగరానికి వచ్చేస్తారు.. ఓ మధురానుభూతిని కలిగించే ఉత్సవంలో పాలుపంచుకుంటారు. ఆ చరిత్రాత్మక నగరం కొత్త శోభను సంతరించుకుంటుంది..


Eha Tv

Eha Tv

Next Story