'భగిని' అంటే... చెల్లెలు లేదా అక్క ఎవరైనా కావచ్చు. 'హస్త భోజనం' అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే.. సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట.

'భగిని' అంటే... చెల్లెలు లేదా అక్క ఎవరైనా కావచ్చు. 'హస్త భోజనం' అంటే... చేతి భోజనము అని అర్ధం. అంటే.. సోదరి చేతి వంట సోదరుడు తినడం అన్నమాట. ఇందులో కొత్త విషయం ఏముందని మీరు అడగచ్చు. సాధారణంగా వివాహమైన చెల్లెలు, అక్క ఇంటిలో తల్లిదండ్రులుగానీ, అన్నదమ్ములుగానీ భోజనం చేయడానికి ఇష్టపడరు. కారణం తినకూడదని కాదు. ఆడపిల్ల రుణం ఉంచుకోవడం పుట్టింటి వారికి ఇష్టం ఉండదు. శుభ సందర్భాలలో, శుభకార్యాలలో వచ్చి భుజించినా తప్పులేదు కానీ, ఊరికే వచ్చి తినడం మర్యాద కాదని మన సంప్రదాయం. కార్తిక శుద్ధ విదియనాడు మాత్రం వివాహం అయిన సోదరి ఇంటిలో సోదరుడు భుజించి తీరాలని శాస్త్రం నిర్ణయించింది. దీనికి ఓ కథ కూడా ఉంది. ఆ కథ ఏమిటంటే..

అయిదు రోజుల పండుగ దీపావళి పండుగలో ,దీపావళి, ధన త్రయోదశి, నరక చతుర్దశి, బలి పాడ్యమి, ఐదవ రోజు పండుగ (యమ ద్వితీయ) ‘భగినీ హస్త భోజనం‘. ఇది అన్నా, చెల్లెళ్ల పండుగ. సాధారణంగా అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల పండుగ అంటే ఠక్కున గుర్తుకొచ్చేది రక్షా బంధన్ పండుగ. అంతటి ప్రాముఖ్యత కలిగినది కార్తీకమాసంలో వచ్చే దీపావళి పండుగలో చివిరి భాగమైన భగినీ హస్త భోజనం పండుగ. కార్తీక శుద్ధ విదియను యమ ద్వితీయ అని అంటారు. ఆనాడు ‘భగినీ హస్త భోజనం’ అనగా ఎంతటి చక్రవర్తి అయిన ఆనాడు సోదరి ఇంటికి వెళ్ళి ఆమె వండిన పదార్థాలను ఆమె చేత పెట్టించుకుని భుజించి ఆమెకు ధనకనక వస్తు వాహనాలను ఇచ్చి సత్కరించి ఆశీస్సులు అందించాలి.

యమునా నది తన అన్న అయిన యమధర్మరాజును పన్నెండేళ్ళ పాటు ప్రతి రోజు భోజనానికి ఆహ్వానిస్తే తాను నరకాన్ని విడిచివస్తే పాపులకు శిక్ష ఎవ్వరు వేయాలని సందేహించెను. సోదరి కోసం ఒక రోజు పాపులకు సెలవు ఇవ్వమని ప్రార్థించగా కార్తీక శుద్ధ విదియ నాడు యమధర్మరాజు యమున ఆహ్వానాన్ని మన్నించి వెళ్ళాడు. ఆమె సంతోషంతో ప్రేమతో వండిన పదార్థాలను ఆరగించిన యమధర్మరాజు ఆమెకు సకల సంపదలు కానుకగా ఇచ్చి వరం కోరుకోమనగా కార్తీక శుద్ధ విదియ నాడు సోదరి చేతి వంటను భుజించిన వారికి నరక లోక ప్రాప్తి కలగకుండా, సోదరుడికి ఆతిథ్యం ఇచ్చిన ఆడపడుచుకు సకల సంపదలు కలగాలని యమున కోరింది. సోదరి లేకున్నా బంధువులలో ఎవరినైనా సోదరిగా భావించాలి. ఈ విధంగా సోదర ప్రేమను, అనుబంధమును, ఆత్మీయతను పంచాలనేది ఈ పండగలోని పరమార్థం.

ఉత్తరాదిన చాలా ప్రాంతాల్లో జరుపుకునే పండుగ కాగా దక్షిణాదిన కూడా ఈ పండుగ పలువురు జరుపుకుంటున్నారు. మహారాష్ట్రలో ఈ పండుగను ‘భయ్యా-దుజ్’ అని పిలుస్తారు, నేపాల్ ప్రాంతంలో ఈ పండుగను ‘భాయి-టికా’ అని పిలుస్తారు. పంజాబ్ ప్రాతంలో ఈ పండుగను ‘టిక్కా’ అంటారు. ప్రాంతం ఏదైనా పిలిచే పేరేదైనా ఈ పండుగ వెనుకున్న ఉద్దేశం మాత్రం ఒక్కటే.

ehatv

ehatv

Next Story