శబరిమలలో కేవలం మగవారికి మాత్రమే ప్రవేశం ! మరి కేవలం అతివలకు మాత్రమే ప్రవేశం కల్పించే ఆలయం లేదా ? అంటే, ఎందుకు లేదు ఉంది. అది కూడా కేరళలోనే ఉంది. తిరువనంతపురానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆట్టుక్కాల్ అమ్మవారి దేవాలయానికి ఈ విశిష్టత ఉంది.. అతివల శబరిమలగా పేరొందిన ఈ ఆలయాన్ని ఓసారి సందర్శిద్దాం.. ఇప్పుడే ఎందుకు సందర్శించాలంటే మంగళవారం ఆ గుడిలో ఒక గొప్ప వేడుక జరగనుంది కాబట్టి! ఆట్టుక్కాల్ అమ్మవారి […]
శబరిమలలో కేవలం మగవారికి మాత్రమే ప్రవేశం ! మరి కేవలం అతివలకు మాత్రమే ప్రవేశం కల్పించే ఆలయం లేదా ? అంటే, ఎందుకు లేదు ఉంది. అది కూడా కేరళలోనే ఉంది. తిరువనంతపురానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆట్టుక్కాల్ అమ్మవారి దేవాలయానికి ఈ విశిష్టత ఉంది.. అతివల శబరిమలగా పేరొందిన ఈ ఆలయాన్ని ఓసారి సందర్శిద్దాం..
ఇప్పుడే ఎందుకు సందర్శించాలంటే మంగళవారం ఆ గుడిలో ఒక గొప్ప వేడుక జరగనుంది కాబట్టి!
ఆట్టుక్కాల్ అమ్మవారి దేవాలయంలో కేవలం మహిళలకు మాత్రమే ప్రవేశం. ప్రతిరోజూ ఈ ఆలయం అతివలతో సందడిగా ఉంటుంది. ఇక పొంగల ఉత్సవం రోజున అంతకు వెయ్యి రెట్లు సందడిగా ఉంటుంది.. ఈసారి మార్చి ఏడున ఈ వేడుక జరగబోతున్నది. ఎంతో వైభవోపేతంగా జరిగే ఈ ఉత్సవంలో లక్షలాది మంది భక్తురాళ్లు పాల్గొంటారు. అమ్మవారికి నైవేద్యాన్ని సమర్పించుకుంటారు.. నైవేద్యాన్ని ఇంట్లో వండి తీసుకురారు. అప్పటికప్పుడు అక్కడికక్కడ వండి అమ్మవారికి నివేదిస్తారు. పొంగల పండుగలో ఇది కూడా ఓ ప్రత్యేకత! పొంగల ఉత్సవం ఎప్పుడు, ఏ సమయంలో నిర్వహించాలన్నది ఆలయ పూజారులు నిర్ణయిస్తారు. ఆ విషయాన్ని ముందుగానే భక్తురాళ్లకు చెబుతారు. ఈసారి ఎక్కువ సంఖ్యలో మహిళలు పాల్గొంటారని ఆలయ అధికారులు అంటున్నారు. కారణం గత మూడేళ్లుగా కరోనా కారణంగా కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఇప్పుడే ఆంక్షలు లేవు.
ముహూర్త సమయానికి చాలా ముందుగానే మహిళలు ఆలయ ప్రాంగణానికి చేరుకుంటారు. ఆలయ ప్రాంగణంలో చోటు దొరకని వాళ్లు బయట ఆలయ పూజారుల అనౌన్స్‌మెంట్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ముందుగానే అక్కడి ప్రదేశాన్ని శుభ్రపరచుకుని, చక్కటి రంగవల్లికతో తీర్చి దిద్దుకుంటారు. ఇటుకలతో పొయ్యిని పేర్చుకుంటారు. కొత్త కుండ, కొత్త బియ్యం, బెల్లం, పాలు, ఎండుకొబ్బరి.. ఆకులతో ఉన్న కొబ్బరి మట్ట, పూజసామాగ్రిని తమ వెంట తెచ్చుకుంటారు. కొత్త కుండకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందంగా అలంకరిస్తారు. ఆలయ పూజారుల అనుమతి రాగానే మహిళలు పొయ్యిని వెలిగిస్తారు. బెల్లం పొంగల్ తయారీలో నిమగ్నమవుతారు. పొంగల్ తయారైన తర్వాత దాన్ని ఓ అరటి ఆకులో పెట్టి నైవేద్యానికి సిద్ధం చేస్తారు. ఈ సమయంలో అమ్మవారిని స్తుతిస్తూ పాటలు పాడతారు. అర్చకులు వచ్చి మహిళలు భక్తితో సమర్పించిన నైవేద్యాన్ని సంప్రోక్షిస్తారు. అమ్మవారికి నివేదిస్తారు. ఆ తర్వాత మహిళలంతా భక్తితో ప్రసాదాన్ని స్వీకరించి అమ్మవారికి పూజలు చేస్తారు. ఒక్క కేరళీయులే ఈ వేడుకను జరుపుకోరు. ఇతర ప్రాంతాల నుంచి కూడా ఎంతో మంది వస్తారు.అమ్మవారికి నైవేద్యం అర్పించి, ఆమె కరుణాకటాక్షాల కోసం ప్రార్థనలు చేస్తారు. ప్రతి రోజు ఉదయం నాలుగున్నరకే సుప్రభాత స్తోత్రంతో ఆలయ తలుపులు తెరుచుకుంటాయి. నిర్మాల్య దర్శనం, అభిషేకాలు, గణపతి హోమం, దీపారాధన, చందనాభిషేకం, పతిరాడి పూజ, ఉష్:పూజ, ఉచ్చ:పూజ, అతళ పూజ ఇవన్నీ యథావిధిగా జరుగుతాయి. ఇక ఆర్జిత సేవలలో ముఖ్యమైనవి ములక్కప్పు, చందనాభిషేకం. ఈ సేవలను అమ్మవారికి జరిపించాలంటే కనీసం పాతిక సంవత్సరాలైనా ఎదురుచూడాలి. మూడోది పొంగలి నైవేద్యం. ఈ సేవకు మాత్రం మహిళలందరూ అర్హులే! అందరికీ స్వాగతమే! మలయాళ పంచాంగమైన కొల్ల వర్షంలోని మకరంలో పది రోజుల పాటు ఉత్సవాలు జరుగుతాయి. లక్షలాది మంది మహిళలు భక్తిశ్రద్ధలతో సమర్పించుకునే పొంగలి నైవేద్యాన్ని అమ్మవారే స్వయంగా కోరుకున్నారట!
ఆ గాథ తెలుసుకునే ముందు ఆలయ స్థలపురాణాన్ని తెలుసుకుందాం! ఇప్పుడైతే తిరువనంతపురంలో ఈ ఆలయం ఉంది కానీ ఆట్టుక్కాల్ పట్టణం ఒకప్పుడు చిన్న గ్రామం. కొన్ని వందల ఏళ్ల కిందట ఈ ప్రాంతాన్ని మల్లవీట్టిల్ వంశస్తులు పాలిస్తుండేవారు. ఓనాడు వంశపెద్ద సమీపంలోని కిళ్లినదిలో స్నానం చేస్తుండగా ఓ చిన్నారి నది దాటించమని అడిగిందట! ముద్దులొలికే ఆ పాపను చూసి ముచ్చటపడిన ఆ పెద్దాయన ఆ పాపను ఇంటికి తీసుకెళ్లారట! కుటుంబసభ్యులంతా ఆ చిన్నారిని అక్కున చేర్చుకున్నారట! రాత్రి భోజనాల తర్వాత ఆమె ఎవరికీ కనిపించలేదట! రాత్రి కలలో పెద్దాయనకు కనిపించి, దగ్గరున్న తోటలో ఎక్కడ మూడు గీతలు కనిపిస్తాయో అక్కడ గుడి కట్టమని చెప్పిందట! తెల్లారి తోటలో కలయతిరిగిన పెద్దాయనకు ఓ చోట మూడు గీతలు కనిపించాయట! అక్కడో ఆలయాన్ని నిర్మించారట! ఆ బాలిక ఎవరో కాదు. పాండ్యరాజును శపించి మధురైను తన కోపాగ్నితో భస్మం చేసిన కణ్ణగి అట! అట్టుక్కాల భగవతి తమిళ ఆడపడచు కావడం వల్ల ఈ ఆలయం కేరళ ఆలయాలకు భిన్నంగా ఉంటుంది. వివిధ శిల్పాలతో, ఎత్తయిన గోపురాలతో ఉంటుంది.. ఆలయంలో గానం చేసే తొట్టెంపట్టు ప్రార్థన గీతంలో వినిపించేది కన్నగి జీవితగాధే!
పొంగల్ వేడుక విషయానికి వస్తే ఆలయం నిర్మించిన తొలినాళ్లలో ఓ రోజు కొందరు మహిళలు పొలం పనులు చేసుకుంటుంటే నదిలో కాళ్లను ఉంచి ఆడుకుంటున్న ఓ మహిళ కనిపించిందట! ఆమె వారిని పిలిచి ఆకలిగా ఉందని ఏదైనా ఉంటే పెట్టమని అడిగిందట! ఆమె తేజోమయ రూపాన్ని చూసిన మహిళలు తాము తెచ్చుకున్న ఆహారం కాకుండా అప్పటికప్పుడు బియ్యం, పాలు, బెల్లంతో మట్టికుండలో పాయసం వండారట! అయితే వండిన తర్వాత ఆ మహిళ కనిపించలేదట! వచ్చింది ఎవరో కాదనీ, భగవతి అమ్మవారేనని తెలుసుకున్న మహిళలు అప్పట్నుంచి ఆ రోజున పాయసం వండి సమర్పించుకోసాగారట! అది ఆనవాయితీగా మారింది! అమ్మవారు కాళ్లు కడుక్కున్న ప్రదేశం కావడం వల్ల అట్టుక్కాల్ అన్న పేరు వచ్చిందంటారు.
ఉత్సవాలలో మొదటి తొమ్మిది రోజులు వివిధ రకాల పూజలు, అభిషేకాలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు చాలా గ్రాండ్‌గా జరుగుతాయి. పదో రోజున తెల్లవారక ముందే ఆలయానికి దారి తీసే రహదారులన్ని మహిళలతో కిక్కిరిసిపోతాయి. ఒక్క రహదారులేమిటి ఎక్కడ జాగా దొరికితే అక్కడ పొయ్యి పెట్టేసుకుని పొంగలి వండేస్తారు. సాయంత్రం అమ్మవారు స్వయంగా వచ్చి అందరి నైవేద్యాలను ఆరగిస్తారన్నది భక్తురాళ్ల విశ్వాసం. 20 ఏళ్ల కిందట అత్యధికంగా పదిహేను లక్షల మంది మహిళలు పొంగల వేడుకలో పాల్గొన్నారు. అందుకే ఈ ఉత్సవం గిన్నిస్ రికార్డులలో చోటు చేసుకుంది. విశాలమైన ఆవరణలో నిర్మించిన ఈ ఆలయంలో అణువణువూ ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడుతుంది. గర్భాలయంలో రెండు భగవతి అమ్మవారి విగ్రహాలు ఉంటాయి. అందమైన అలంకరణలతో కనిపించే పెద్ద విగ్రహాన్ని ప్రతిష్టించింది వీట్టిల్ వంశస్తులు. పనస చెట్టు కాండంతో అమ్మవారి మూర్తిని మలిచారు. రెండోది పంచలోహ విగ్రహం.
అనంతపద్మనాభ స్వామి ఆలయానికి జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉంటుందీ ఆలయం.. తిరువనంతపురం వెళ్లినవాళ్లు చూసి తీరాల్సిన దివ్య క్షేత్రమిది!