మార్చి 12 బుధవారం ఆహోబిలం శ్రీ నరసింహస్వామి కల్యాణం సందర్భంగా...

పాల్గుణ శుద్ధ పంచమి నుండి పౌర్ణమి వరకు ఆహోబిలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి వారికి కళ్యాణోత్సవం ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఎక్కడైనా భగవంతుడి కళ్యాణం జరిగితే భక్తులే భగవంతుడి వద్దకు వెళుతుంటారు. కానీ నా పెళ్ళికి రండి అంటూ దైవమే భక్తుల వద్దకు వెళ్లే సందర్భం మాత్రం ఒకే ఒక్కచోట ఉంటుంది. అది అహోబిల లక్ష్మీనరసింహ స్వామికే ప్రత్యేకం. అహోబిలం క్షేత్రంలో కొలువైన జ్వాలా నరసింహస్వామి. ప్రహ్లాదవరద స్వాములు పల్లకిలో కొలువై గ్రామాలకు వెళ్లి భక్తులకు తమ దర్శన భాగ్యం కల్పిస్తుంటారు. ఈ ప్రత్యేకమైన వరాన్ని కర్నూలు జిల్లాలోని 33 గ్రామాల ప్రజలు అందుకుంటున్నారు.

ఇందులో భాగంగానే పార్వేట పేరిట ఆలయాన్ని, ఆప్తులను విడిచి భక్తుల చెంతకు పయనమవుతారు స్వామి. పరి అంటే గుర్రం. గుర్రంపై వేటాడడాన్ని పార్వేట అంటారు. ఈ సంప్రదాయం చాలా వైష్ణవ క్షేత్రాల్లో ఉంటుంది. ఇది ఒక్కరోజు మాత్రమే కొనసాగుతుంది. కానీ అహోబిలంలో మాత్రం ఈ ఉత్సవం పేరిట ఏకంగా 45 రోజుల పాటు స్వామిని ప్రజల మధ్యనే ఉంచుతారు. ఎగువ అహోబిలంలోని జ్వాలా నరసింహ స్వామి, దిగువ అహోబిలంలో ఉన్న ప్రహ్లాద వరద స్వామి ఇద్దరినీ ఒకే పల్లకిలో ఉంచి ఈ ఉత్సవాన్ని జరపడం అనవాయితీ. ఈ కార్యక్రమానికి ముందు 45 రోజుల పాటు స్వామివార్లకు సరిపడా ఆహారాన్ని అందించే "అన్న కూటోత్సవం" నిర్వహిస్తారు.

ఆ తర్వాత దాదాపు 45 రోజులపాటు ప్రజల మధ్యనే రాత్రనక, పగలనక గడుపుతూ వారి కష్టసుఖాలను తెలుసుకుంటూ, తన కల్యాణోత్సవానికి రమ్మని భక్తులను ఆహ్వానిస్తారు స్వామి. కార్యక్రమం పూర్తి చేసుకుని అలసి సొలసి అహోబిలం చేరిన స్వామివార్లకు బడలిక తొలగేలా పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం 81 కలశాలతో తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత పాల్గుణ శుద్ధ పంచమినుంచి పౌర్ణమి వరకు స్వామివార్లకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కులమతాలకు అతీతంగా స్వామి ఉత్సవాలు జరుగుతాయి. స్వామి పరిణయమాడిన చెంచులక్ష్మిని స్థానిక చెంచులు తమ ఆడపడుచుగా భావిస్తారు. నరసింహ స్వామిని ఓబులేసుగా పిలుస్తారు. పార్వేట ఉత్సవాల్లో వీరే ముందుడి పల్లకిని ఆహ్వానించి, నడిపిస్తారు. స్వామి తమ గ్రామానికి వచ్చిన రోజునే సంక్రాంతిగా భావించి పండగ చేసుకుంటారు.

శ్రీవైష్ణవ సాంప్రదాయంలో పరమ పవిత్రంగా భావించే 108 దివ్యక్షేత్రాలలో ఒకటి అహోబిల నవనారసింహ క్షేత్రం. నల్లమల అడవులలో ఉన్న ఈ క్షేత్రం భక్తి ప్రపత్తులకేకాదు ప్రకృతి రామణీయతకు కూడా ఆలవాలం. ఈ క్షేత్రం గురించి బ్రహ్మాండ పురాణంలో సమగ్రంగా వివరించారు.

రాక్షస రాజైన హిరణ్యకశిపుని రాజ్యం ఇది. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడడానికి హరి స్తంభంనుండి నరసింహుని రూపంలో వెలువడి హిరణ్యకశిపుని వధించింది ఇక్కడే. నరసింహస్వామి ఆవిర్భవించి హిరణ్యకశిపుని తన గోళ్ళతో చీల్చి చంపినప్పుడు ఆయన బలాన్ని, శక్తిని దేవతలు అహో బలం.. ఆహో బలం.. అని ప్రశంసించారు గనుక ఈ స్థలానికి వారు కీర్తించినట్లు అహోబలం అని పేరు వచ్చింది. ఎగువ అహోబిలంలో ప్రహ్లాదుని తపస్సుకి మెచ్చి నరసింహస్వామి బిలంలో స్వయంభువుగా వెలిశాడు గనుక అహో బిలం అన్నారు. ఈ క్షేత్రంలో స్వామీ తొమ్మిది ప్రదేశాలలో తొమ్మిది రూపాలలో ఆవిర్భవించారు. అందుచేతనే ఈ క్షేత్రం నవ నారసింహ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

బ్రహ్మోత్సవాలలో భాగంగా నిర్వహించే స్వామివారి కల్యాణం తిలకించడానికి పెద్ద ఎత్తున భక్తులు అహోబిలం చేరుకుంటారు. కల్యాణోత్సవాల్లో మెరిసిపోతున్న స్వామి అమ్మవార్లను చూసి భక్తులు పరవశులవుతారు. అసంఖ్యాకంగా తరలివచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తారు.

ehatv

ehatv

Next Story