అనకాపల్లి జిల్లాలో మహిళ శరీర భాగాలు లభ్యం కేసు సంచలనం సృష్టించింది.

అనకాపల్లి జిల్లాలో మహిళ శరీర భాగాలు లభ్యం కేసు సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. తల ఒకచోట.. మొండెం, కాళ్లు, చేతులు మరో చోట లభించాయి. అయితే హత్యగావించబడింది మహిళ కాదు.. దీప అనే ట్రాన్స్ జెండర్‌గా గుర్తించారు పోలీసులు. మొత్తం 8 పోలీసు బృందాలు నిందితుల కోసం, మిగతా శరీర భాగాల కోసం గాలించగా.. ఈరోజు ఉదయం అనకాపల్లి వై జంక్షన్(Anakapalli Y junction) దగ్గర తల, మరో చెయ్యి లభించింది. డెడ్ బాడీ వద్ద లభించిన ఆనవాళ్లు ఆధారంగా దర్యాప్తు చేయగా హత్యకు గురైంది హిజ్రా దీపగా గుర్తించారు. నాలుగేళ్ల క్రితం సర్జరీ చేసుకున్నట్లుగా పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఇంతకీ ఎవరు హత్య చేశారు?, ఎందుకు హత్య చేశారు? అనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కసింకోట మండలం తాళ్లపాలెం బ్రిడ్జి కింద దీప(Deepa) మెడ నుండి నడుము వరకు శరీర భాగాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిన్న బయ్యవరం వద్ద నడుము కింద నుండి రెండు కాళ్లు, ఒక చెయ్యి లభించాయి. ఈరోజు అనకాపల్లి వై జంక్షన్ వద్ద డైట్ కాలేజీ దగ్గర తల, ఒక చెయ్యి దొరికాయి. అయితే తోటి ట్రాన్స్ జెండర్స్‌పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఓ వ్యక్తి, మరొక ట్రాన్స్‌జెండర్‌తో ఓ గదిలో కలిసి దీప అద్దెకు ఉంటోంది. ఈ ఘటనలో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు(CM Chandra Babu) పోలీసులను ఆదేశించారు. అగంతుకులను అదుపులోకి తీసుకున్నట్టు సీఎంకు తెలిపారు. ఈ దారుణానికి పాల్పడిన నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని సీఎం ఆదేశించారు.
