అర్బాజ్ అనే వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడిన ఘటనకు సంబంధించి ఈ ముగ్గురిని వాంటెడ్ లిస్టులో చేర్చారు

గత అర్ధరాత్రి రాత్రి దేశ రాజధాని ఢిల్లీలో ఎన్ కౌంటర్ జరిగింది. ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్ కళాశాల సమీపంలో పోలీసులతో జరిగిన ఎన్‌కౌంటర్ లో హషీమ్ బాబా ముఠాలోని ముగ్గురు సభ్యులు గాయపడ్డారు. వారిని అరెస్టు చేశారు. గోకుల్‌పురి మెట్రో స్టేషన్‌కు సమీపంలో జరిగిన కాల్పుల్లో ఇద్దరు పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన ముఠా సభ్యులైన అలీ అలియాస్ ఫహద్, ఆసిఫ్ అలియాస్ ఖలీద్, అల్సెజాన్ అలియాస్ తోతలను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్చారు.

హషీం ముఠాకు చెందిన ముగ్గురు సభ్యులు మార్చి 9న అర్బాజ్ అనే వ్యక్తిని చంపారు. నిందితులకు సంబంధించి పక్కా సమాచారం అందుకున్న పోలీసులు వారిని పట్టుకునేందుకు గత రాత్రి 1.30 సమయంలో ఈశాన్య ఢిల్లీలోని అంబేద్కర్ కాలేజీ సమీపానికి వెళ్లారు. పోలీసులు వచ్చారని తెలుసుకున్న గ్యాంగ్‌స్టర్లు కాల్పులకు తెగబడ్డారు. అప్రమత్తమైన పోలీసులు ఎదురుకాల్పులు ప్రారంభించారు. దుండగుల కాళ్లలోకి పోలీసుల తూటాలు దూసుకుపోయాయి. వారిని పట్టుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు.

మార్చి 9న జరిగిన కాల్పుల ఘటనలో అర్బాజ్ అనే వ్యక్తి మృతి చెందగా, మరో వ్యక్తి గాయపడిన ఘటనకు సంబంధించి ఈ ముగ్గురిని వాంటెడ్ లిస్టులో చేర్చారు. నార్త్ ఈస్ట్ డిసిపి జాయ్ టిర్కీ మాట్లాడుతూ, "రెండు రోజుల క్రితం శీలంపూర్‌లో కాల్పుల ఘటనలో పాల్గొన్న వ్యక్తుల కదలికలకు సంబంధించి మాకు సమాచారం అందింది. ఈ రోజు 1.30 గంటలకు ఎన్‌కౌంటర్ జరిగింది, మేము వారిని పట్టుకోడానికి ప్రయత్నించాము, కాని వారు కాల్పులు జరిపారు. రెండు వైపుల నుండి దాదాపు 23-24 రౌండ్లు కాల్పులు జరిగాయి. ముగ్గురిపై గతంలోనే కేసులు ఉన్నాయి." అని తెలిపారు.

Updated On 11 March 2024 10:54 PM GMT
Yagnik

Yagnik

Next Story