దొంగతనానికి వచ్చిన అతడు వచ్చిన పని చూసుకోకుండా నిద్రపోయిన
దొంగతనానికి వచ్చిన అతడు వచ్చిన పని చూసుకోకుండా నిద్రపోయిన ఘటన లక్నోలో చోటు చేసుకుంది. ఒక వైద్యుడి నివాసంలోకి చొరబడిన దొంగ, విపరీతమైన మత్తులో నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచి చూసేసరికి చుట్టుపక్కల పోలీసులను చూసి షాక్ అయ్యాడు. ఈ సంఘటన ఘాజీపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందిరా నగర్ సెక్టార్-20లో జరిగింది.
ఆ దొంగ టార్గెట్ చేసిన ఇల్లు లక్నోలోని ఇందిరా నగర్ సెక్టార్-20లో సునీల్ పాండేకి చెందినది. బల్‌రాంపూర్ హాస్పిటల్‌లో పనిచేస్తున్న పాండే ప్రస్తుతం వారణాసిలో ఉంటున్నారు. ఈ ఇల్లు ఖాళీగా ఉంది. ఉదయం పాండే ఇంటి తలుపు తెరిచి ఉండడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. ఘాజీపూర్ పోలీసులను పిలిచారు. పోలీసులు అక్కడికి వచ్చి చూస్తే ఓ దొంగ నిద్రపోతూ కనిపించాడు. అతడిని కపిల్ అని గుర్తించారు. అతడిని అరెస్ట్ చేసి ఐపీసీ సెక్షన్ 379ఏ కింద దొంగతనం కింద కేసు నమోదు చేశారు. తదుపరి చట్టపరమైన చర్యలు కొనసాగుతున్నాయని ఘాజీపూర్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ (SHO), వికాస్ రాయ్ తెలిపారు.
ఇంట్లోని చాలా వస్తువులను దొంగ దోచుకోడానికి ప్రయత్నించాడు. అలమారాలు పగులగొట్టాడు.. నగదుతో సహా ప్రతిదీ తీసుకున్నారు. దొంగ వాష్‌బేసిన్, గ్యాస్ సిలిండర్, నీటి పంపును కూడా దొంగిలించడానికి ప్రయత్నించాడని అధికారి తెలిపారు. అంతేకాకుండా బ్యాటరీని కూడా కొట్టేయాలని చేసిన ప్రయత్నమే అతడు మత్తులోకి జారుకునేలా చేసిందని అంటున్నారు. బ్యాటరీని తొలగించే ప్రయత్నంలో అతను మత్తులో కుప్పకూలిపోయి నిద్రపోయాడని అధికారి తెలిపారు.