దోభి పారాగ్లైడింగ్ సైట్‌లో అన్ని పారాగ్లైడింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిషేధించారు
హిమాచల్ ప్రదేశ్‌లోని కులు జిల్లా మనాలి సమీపంలోని దోభి గ్రామంలో పారాగ్లైడింగ్ చేస్తుండగా తెలంగాణకు చెందిన మహిళ ప్రాణాలు కోల్పోయింది. 26 ఏళ్ల పర్యాటకురాలు ఆకాశం నుండి ఓ ఇంటి స్లాబ్‌పై పడి మరణించింది. తెలంగాణాలోని సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు చెందిన నవ్య, టెన్డం ఫ్లైట్‌లో టేకాఫ్ అయిన నిమిషాలకే పారాగ్లైడింగ్ హార్నెస్ ఊడిపోవడంతో కింద పడిపోయిందని పోలీసు అధికారి తెలిపారు. ప్రమాదానికి కారణమైన పారాగ్లైడింగ్ పైలట్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఘటనపై కులూ పర్యాటక శాఖ అధికారిణి సునైనా శర్మ స్పందిస్తూ మానవ తప్పిదం కారణంగానే ఈ ప్రమాదం జరిగుండొచ్చని అన్నారు. పారాగ్లైడింగ్ చేసిన ప్రదేశం, ఇందుకు వాడిన పరికరాలు, పైలట్‌కు అనుమతి ఉందన్నారు. ఘటన జరిగిన సమయంలో వాతావరణ సమస్యలు ఏవీ లేవని.. ఘటన నేపథ్యంలో అక్కడ పారాగ్లైడింగ్‌ను సస్పెండ్ చేసినట్టు తెలిపారు. కాగా, ప్రమాదానికి బాధ్యుడైన పైలట్‌పై ఐపీసీ 336, 334 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సేఫ్టీ బెల్ట్‌ను తనిఖీ చేయకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది.
దోభి పారాగ్లైడింగ్ సైట్‌లో అన్ని పారాగ్లైడింగ్ కార్యకలాపాలు తాత్కాలికంగా నిషేధించారు. సంఘటనపై విచారణకు ఆదేశించినట్లు జిల్లా అధికారులు తెలిపారు. కులు జిల్లాలోని ప్రముఖ పారాగ్లైడింగ్ స్పాట్‌లలో దోభి ఒకటి. ఈ ప్రాంతంలో గతంలో కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. డిసెంబర్ 24, 2022న, మహారాష్ట్రకు చెందిన 30 ఏళ్ల టూరిస్ట్ సూరజ్ షా మరణించాడు. జూన్ 15, 2022 న, అంబాలా నివాసి ఆదిత్య శర్మ, అతని పైలట్ క్రిషన్ గోపాల్ కూడా పారాగ్లైడింగ్ ప్రమాదంలో మరణించారు.