మనీలాండరింగ్ కేసులో మీ పేరు ఉన్నదని ఓ యువతిని బెదిరించారు కేటుగాళ్లు.
మనీలాండరింగ్ కేసులో మీ పేరు ఉన్నదని ఓ యువతిని బెదిరించారు కేటుగాళ్లు. ఆమెను భయపెట్టి 1.78 లక్షల రూపాయలు కొట్టేశారు. ఈ సంఘటన ముంబాయిలో జరిగింది. ఇంట్లో అయితే ఇబ్బంది అవుతుందని చెప్పిహోటల్ రూమ్‌లో ఆల్‌లైన్ విచారణకు రావాల్సిందిగా బెదిరించారు. బాడీ చెకప్ పేరుతో ఆమె బట్టలు విప్పించి నగ్నంగా కూర్చొబెట్టారు. ముంబాయిలోని బోరివాలి ఈస్ట్‌కు చెందిన ఓ యువతికి నవంబర్ 19వ తేదీన ఓ కాల్ వచ్చింది. ఢిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి ఫోన్ చేస్తున్నామంటూ కేటుగాళ్లు ఆమె పేరు, ఇతర వివరాలు చెప్పారు. ప్రస్తుతం జైలులో ఉన్న జెట్ ఎయిర్ వేస్ ఫౌండర్ నరేశ్ గోయెల్ కేసులో మీ పేరు కూడా ఉందని భయపెట్టారు. మనీలాండరింగ్ కేసు నమోదైందంటూ ఆ యువతిని బెదిరించారు. ఆపై వాట్సాప్ వీడియో కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని, విచారణకు సహకరించాలని కోరారు. ఇంట్లో ఇబ్బంది కలుగుతుందని చెప్పి ఏదైనా హోటల్ లో రూమ్ తీసుకోవాలని సూచించారు. అప్పటికే బెదిరిపోయిన ఆ యువతి వారు చెప్పినట్టుగానే చేసింది. హోటల్ రూమ్ లో బాడీ చెకప్ చేయాలని యువతి దుస్తులు విప్పించారు. ఆపై సెక్యూరిటీ వెరిఫికేషన్ కోసమంటూ 1.78 లక్షల రూపాయలను తమ ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. వివరాలన్నీ మరోమారు పరిశీలించిన తర్వాత మళ్లీ ఫోన్ చేస్తామని చెప్పి కాల్ కట్ చేశారు. తాను మోసపోయానని తెలుసుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని, ఇలాంటి ఫోన్ కాల్స్ కు భయపడకుండా సైబర్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.