ఆంధ్రప్రదేశ్ రోడ్లు నెత్తురోడాయి. అన్నమయ్య జిల్లాలో.. కాకినాడ జిల్లా పత్తిపాడు హైవేపై

ఆంధ్రప్రదేశ్ రోడ్లు నెత్తురోడాయి. అన్నమయ్య జిల్లాలో మదనపల్లి-బెంగళూరు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వెళుతున్న స్పార్పియో వాహనం తొలుత బైక్ పై వెళుతున్న చంద్ర, సుబ్రహ్మణం అనే ఇద్దరు పాడి రైతులను ఢీకొట్టింది. దాంతో ఆ రైతులు ఇద్దరూ ఘటన స్థలంలోనే మరణించారు. అనంతరం స్పార్పియో వాహనం ఎదురుగా వస్తున్న ఓ లారీని ఢీకొట్టడంతో స్పార్పియోలోని ముగ్గురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. మదనపల్లి మండలం బార్లపల్లె వద్ద ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. స్పార్పియో వాహనంలో మృతి చెందిన వ్యక్తులను విక్రమ్, శ్రీను, తిలక్ గా గుర్తించారు. స్పార్పియోలోని ఇద్దరు వ్యక్తులకు గాయాలు కాగా, వారిని మదనపల్లి ఆసుపత్రికి తరలించారు. స్పార్పియో డ్రైవర్ మద్యం మత్తులో డ్రైవింగ్ చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రమాదంలో మరణించిన ఐదుగురు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

కాకినాడ జిల్లా పత్తిపాడు హైవేపై ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పాదాలమ్మ తల్లి గుడి వద్ద ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు రోడ్డు పక్కన లారీ ఆపి టైర్ మార్చుతున్న నలుగురు వ్యక్తుల పైనుంచి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు లారీ డ్రైవర్లు, ఒక క్లీనర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కాడినాడ-చిన్నంపేట హైవేపై ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన తర్వాత డ్రైవర్ బస్సును ఆపకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. స్థానికులు సమాచారం అందించడంతో రాజమండ్రి సమీపంలోని మొమ్మూరు వద్ద పోలీసులు బస్సును గుర్తించి ఆపారు. నిందిత డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మృతులను దాసరి ప్రసాద్, దాసరి కిషోర్, నాగయ్య, రాజులుగా గుర్తించారు. ముగ్గురు వ్యక్తులు బాపట్ల జిల్లా నక్కబొక్కలపాలెంకు చెందినవారని, ఒకరు ప్రత్తిపాడుకు చెందినవారని పోలీసులు తెలిపారు.

Updated On 25 Feb 2024 10:28 PM GMT
Yagnik

Yagnik

Next Story