అనుమానం.. అందమైన దాంపత్య జీవితాన్ని సర్వ నాశనం చేస్తుంది.

అనుమానం.. అందమైన దాంపత్య జీవితాన్ని సర్వ నాశనం చేస్తుంది. ప్రాణాలను సైతం బలి తీసుకుంటుంది. గురుమూర్తి, వెంకట మాధవి విషయంలోనూ ఇదే జరిగింది. పోలీసులను సైతం షాక్ కు గురిచేసిన మీర్పేట్ మర్డర్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. యావత్ దేశంలోనూ తీవ్ర సంచలనమైంది.
ఒక మనిషి.. అందులోనూ తాళి కట్టిన భార్యను ఇంత క్రూరంగా హత్య చేస్తాడా అని అందరూ నివ్వెరపోయేలా చేసింది ఈ క్రైమ్ స్టోరీ.. అసలు గురుమూర్తి తన భార్యను ఎందుకు చంపాడు..? ఎలా చంపాడు..? ఇంత రాక్షసంగా ఎలా మారాడో ఇప్పుడు తెలుసుకుందాం..
సంక్రాంతి పండుగ.. తెలుగు లోగిళ్లలో ఎంతో ఆనందంగా జరుపుకునే పండుగ. కానీ గురుమూర్తి భార్య వెంకట మాధవికి అది కాళరాత్రి అయ్యింది. కట్టుకున్న భర్త కసాయిగా మారాడు. వెంకట మాధవిని అత్యంత కిరాతకంగా హతమార్చాడు.
జనవరి 14న భార్య మాధవి, పిల్లల్ని తీసుకుని గురుమూర్తి బంధువుల ఇంటికి వెళ్లాడు. జనవరి 15వ తేదీ పిల్లల్ని బంధువుల ఇంటిలో వదిలి భార్య వెంకట మాధవితో కలిసి రాత్రి 10.40 గంటలకు మీర్పేట్ చేరుకున్నాడు.
జనవరి 16 ఉదయం 8 గంటలు.. గురుమూర్తి, అతడి భార్య వెంకట మాధవి మధ్య గొడవ జరిగింది. భార్య తలను గోడకేసి కొట్టాడు గురుమూర్తి. తలకు తీవ్ర గాయం కావడంతో వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిన వెంకట మాధవి గొంతు నులిమి చంపేశాడు గురుమూర్తి.
జనవరి 16 ఉదయం 10 గంటలు.. విగతజీవిగా పడి ఉన్న భార్య మృతదేహాన్ని కత్తితో ముక్కలు ముక్కలుగా నరికేశాడు. ఆ తర్వాత వాటర్ హీటర్ లో నీళ్లు మరిగించి వెంకట మాధవి శరీర భాగాలను ఉడకబెట్టాడు. అంతటితో ఆగలేదు. ఉడికించిన మాంసం ముద్దలను స్టవ్ పై పెట్టి కాల్చాడు. కాల్చిన భార్య శరీర భాగాలు, ఎముకలను రోకలి బండతో దంచి పొడిగా చేశాడు.
వెంకట మాధవి శరీర భాగాలను కాల్చుతున్నప్పుడు దుర్వాసన వచ్చింది. దీంతో పక్కింటి వాళ్లు గురుమూర్తిని ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ కదా.. తలకాయ కూర తెచ్చాను అని సమాధానం ఇచ్చాడు గురుమూర్తి.
భార్య శరీర భాగాలను కాల్చి, దంచి, పొడిగా చేసిన గురుమూర్తి.. ఆ పొడిని ప్లాస్టిక్ బకెట్ లో నింపి జిల్లెలగూడ చెరువులో పోశాడు. అనంతరం ఇంటికి వెళ్లి హత్యకు సంబంధించిన ఆనవాళ్లు ఏమీ లేకుండా చేశాడు. అనంతరం బంధువుల ఇంటికి వెళ్లి పిల్లలను తీసుకొచ్చాడు.
పోలీసుల విచారణలో గురుమూర్తి ఈ షాకింగ్ విషయాలు చెప్పాడు. భార్య వెంకటమాధవిని ఎలా చంపాడో, ఆ తర్వాత మృతదేహాన్ని మాయం చేసేందుకు ఎంత క్రూరంగా వ్యవహరించాడో విని పోలీసులకే దిమ్మ తిరిగిపోయింది. అంతేకాదు.. భార్యను హత్య చేశానన్న పశ్చాతాపం కూడా గురుమూర్తులో లేకపోవడం.. వీడసలు మనిషేనా లేక మానవ మృగమా అని పోలీసులు విస్తుపోయారు.
వెంకటమాధవి హత్యకు కొన్ని రోజుల ముందు.. బంధువుల ఇంట్లో జరిగిన వేడుకలో అత్తమామలు తనతో వ్యవహరించిన తీరును గురుమూర్తి తీవ్ర అవమానకరంగా భావించాడు. దానిని మనసులో ఉంచుకుని అవకాశం దొరికినప్పుడల్లా మాధవితో తరుచూ గొడవపడేవాడు. ఈ క్రమంలోనే వెంకటమాధవిని గురుమూర్తి హత్య చేశాడు. భార్య
మీర్పేట్ మర్డర్ కేసు పోలీసులకు సవాల్ గా మారింది. అత్యాధునిక ‘బ్లూ రేస్ టెక్నాలజీ’తో ఇంట్లోని మాంసం, రక్తం ఆనవాళ్లను పోలీసులు గుర్తించారు. గురుమూర్తే అసలు నేరస్తుడని నిర్థారణకు వచ్చారు.
ఈ కేసులో స్టవ్, కత్తి, రోలర్, రోలర్ స్టోన్, బకెట్, వాటర్ హీటర్, రూమ్ ఫ్రెషనర్, యాసిడ్ బాటిల్, డోర్ మ్యాట్, స్క్రాప్ బకెట్, సర్ఫ్ ప్యాకెట్, బ్లాక్ కలర్ షర్ట్, మృతురాలి డ్రెస్, రెండు మొబైల్ ఫోన్లు సహా మొత్తం 16 వస్తువులను సీజ్ చేసినట్లు రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు తెలిపారు.
అయితే.. గురుమూర్తి ఒక్కడే ఈ హత్య చేశాడా లేక మరెవరైనా సహాయం చేశారా అనే కోణంలో పోలీసులు విచారించిన సమయంలో కథ మరో మలుపు తిరిగింది. గురుమూర్తికి అతడి తల్లి సుబ్బలక్ష్మమ్మ, సోదరి సుజాత, సోదరుడు కిరణ్ సహాయం చేసినట్లు పోలీసులు నిర్థారించారు.
గురుమూర్తి మెతక స్వభావి అని.. అయితే ఇంత రాక్షసంగా ఎలా మారాడో అని కుటుంబ సభ్యులు, బంధువులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఆర్మీలో 15 ఏళ్లు పనిచేసిన గురుమూర్తి ఇంత దారుణంగా ప్రవర్తిస్తాడని ఎవరూ ఊహించలేదు.
