మేడ్చల్ మండలం అత్వెల్లి గ్రామంలో సోమవారం ఓ పుర్రె కలకలం రేపింది
మేడ్చల్ మండలం అత్వెల్లి గ్రామంలో సోమవారం ఓ పుర్రె కలకలం రేపింది. గ్రామ శివార్లలోని అటవీ ప్రాంతంలో స్థానికులు పుర్రెను గుర్తించారు. ఆ స్థలాన్ని స్థానికులు క్షుణ్ణంగా పరిశీలించగా.. పాత చెప్పు, ఎరుపు అంచుతో ఉన్న పసుపు చీర, తెల్లటి బ్యాగ్, ఎరుపు జాకెట్టు కూడా కనుగొన్నారు. దీంతో కంగారుపడిన వారు భయంతో వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు.
వెంటనే ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించిన పోలీసులు.. పుర్రె మహిళది అని, ఆరు నెలల క్రితం హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు పోలీసులు ఫోరెన్సిక్ నిపుణుల సాయం కోరారు.
మహిళను హత్య చేసి మృతదేహాన్ని అడవిలో పడేసి ఉంటారని పోలీసు అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా పుర్రె, ఇతర వస్తువులు బయటపడ్డాయి. కేసు నమోదు చేసి మృతురాలిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఘటనా స్థలంలో దొరికిన మృతురాలి దుస్తుల వివరాలతో ఎవరైన మిస్సై ఉంటే మహిళ కుటుంబ సభ్యులు తమను సంప్రదించవచ్చని పోలీసులు అంటున్నారు. దీని ద్వారా పోలీసులు తమ బంధుత్వాన్ని నిర్ధారించుకోవడానికి DNA టెస్టుకు వెళ్లేందుకు వీలు ఉంటుంది.