కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ఊహించని ట్విస్ట్

కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ లైంగిక దౌర్జన్యం కేసులో ఊహించని ట్విస్ట్ నెలకొంది. పోలీసులమని చెప్పుకుంటూ కొందరు తనను బలవంతంగా రేవణ్ణపై కేసు పెట్టించారని ఓ మహిళ ఆరోపించింది. మహిళ ఆరోపణల విషయాన్ని జాతీయ మహిళా కమిషన్ ప్రకటించింది. కేసును దర్యాప్తు చేస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం బాధితులను బెదిరిస్తోందని జేడీఎస్ రాష్ట్ర ప్రెసిడెంట్ హెచ్ డీ కుమారస్వామి ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలగా ఫిర్యాదులు చేయకపోతే తప్పుడు కేసులు పెడతామంటూ సిట్ ఆఫీసర్లు బాధితులపై బెదిరింపులకు దిగుతున్నారని ఆరోపించారు. బాధితుల ప్రైవేటు వీడియోలను ఇలా అందరికీ పంచడాన్ని మీరు సమర్థిస్తున్నారా? అని రెవెన్యూ మంత్రి కృష్ణ బైరి గౌడను కుమారస్వామి ప్రశ్నించారు. తాను ప్రజ్వల్‌ను సమర్థించట్లేదని.. ప్రతి ఒక్కరూ చట్టాన్ని గౌరవించాల్సిందే.. దోషులకు శిక్ష పడాల్సిందేనన్నారు.

ప్రత్యేక దర్యాప్తు బృందం సమర్థవంతంగా కేసును దర్యాప్తు చేస్తోందని కర్ణాటక హోం మంత్రి జి.పరమేశ్వర అన్నారు. జేడీఎస్ ఆరోపణలపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం లేదన్నారు. సిట్‌పై ఏదైనా అభ్యంతరాలు ఉంటే కేసు పెట్టాలని సూచించారు. జేడీఎస్ నేత ప్రజ్వల్ రేవణ్ణ కు సంబంధించిన వీడియోలు పలు మీడియా సంస్థల్లోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్ అవ్వడంతో కర్ణాటకలో రాజకీయ దుమారం నెలకొంది.

Updated On 9 May 2024 9:36 PM GMT
Yagnik

Yagnik

Next Story