"గృహ హింస లేదా భార్య బాధితుల సమస్యలు మరియు కుటుంబ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పెళ్లయిన పురుషుల ఆత్మహత్యల సమస్యపై పరిశోధన చేయడానికి భారత లా కమిషన్ కు సిఫార్సును జారీ చేయండి.
గృహ హింస అంటే.. మహిళలకు మాత్రమే అని ఇప్పటివరకు తెలుసు .. మరి వారి సమస్యలు గోడు వినేందుకు.. వాటిని పరిష్కరించేందుకు మహిళా కమిషన్ ఉంది. అయితే పురుషులు కూడా ఇదే బాటే పట్టారు. కొన్ని చోట్ల భార్య బాధితుల సంఘాలను చూసాం ..వాటిలో మగాళ్ల కష్టాలు ఎంత వరకు సాల్వ్ అవుతున్నాయో తెలియదు కానీ ఇప్పుడు భార్య బాధితులు గగ్గోలు పెడుతున్నారు. భార్యలతో భరించలేకపోతున్నాం.. గృహ హింస తట్టుకోలేక పోతున్నాం. మా సమస్యలు వినేందుకు... వాటిని పరిష్కరించేందుకు.. ఒక పురుష కమిషన్ ఏర్పాటు చేయండి" అంటూ సుప్రీం గడప తొక్కారు. అంతేకాదు భార్యల బాధలు తట్టుకోలేక వివాహిత పురుషుల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
అయితే ఈ అంశంపైనా పరిశోధన చేసి 'నేషనల్ కమిషన్ ఫర్ మెన్' లేదా అలాంటి మరి ఏదయినా ఫోరమ్ ను ఏర్పాటు చేయడానికి అవసరమైన నివేదికను రూపొందించాలని పిటిషన్లో కోరారు. మహేష్ కుమార్ తివారీ అనే న్యాయవాది ఈ పిటిషన్ ను దాఖలు చేశారు. గృహ హింస బాధితులు లేదా కుటుంబ సమస్యల సమస్యల కారణంగా ఒత్తిడికి గురవుతున్న వారి ఫిర్యాదులను పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు సరైన మార్గదర్శకాలు జారీ చేయాలంటూ కేంద్రానికి ఆదేశాలు జారీ చేయాలని పిటిషన్లో కోరారు.
"గృహ హింస లేదా భార్య బాధితుల సమస్యలు మరియు కుటుంబ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న పెళ్లయిన పురుషుల ఆత్మహత్యల సమస్యపై పరిశోధన చేయడానికి భారత లా కమిషన్ కు సిఫార్సును జారీ చేయండి. ఇలాంటి ఫోరమ్ ను ఏర్పాటు చేయడానికి అవసరమైన నివేదికను రూపొందించండి. "పురుషుల కోసం జాతీయ కమిషన్" లేదా ఏదైనా ఫోరమ్ ను ఏర్పాటు చేయాలంటూ " అని పిటిషన్లో కోరారు.
కుటుంబ సమస్యతో సతమతవుతున్న పురుషుల ఫిర్యాదులను స్వీకరించి... ఆత్మహత్యలను నివారించేందుకు వారి సమస్యలు పరిష్కరించాలని పిటిషనర్ కోరారు. ఇలాంటి సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి జిల్లా స్థాయిలో నోడల్ అధికారిని నియమించాలని అభ్యర్థించారు. కుటుంబ సమస్యలు వివాహ సంబంధిత సమస్యల కారణంగా దేశంలో పురుషుల ఆత్మహత్యల నిష్పత్తి వేగంగా పెరుగుతోందని తెలిపారు.
ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఏడాది సుమారు 8 లక్షల మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పిటిషనర్ తెలిపారు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అందించిన డేటా ప్రకారం 2021 సంవత్సరంలో భారతదేశంలో 1,64,033 మంది ఆత్మహత్య చేసుకున్నారని . "లక్ష జనాభాలో ఆత్మహత్యల రేటు 12గా ఉందని ఇది 1967 నుంచి ఆత్మహత్యల మరణాల రేటు అత్యధికం అని పిటిషనర్ వివరించారు.