బాధితురాలు అనిత ఈ భయానక సంఘటన గురించి గుర్తు చేసుకుని
ఉత్తరప్రదేశ్‌లోని బుదౌన్‌లో, పుట్టబోయే బిడ్డ ఆడ మగ అని తనిఖీ చేయడానికి తన 8 నెలల గర్భిణీ భార్య కడుపు తెరిచినందుకు ఒక వ్యక్తికి జీవిత ఖైదు విధించబడింది. ఈ కేసు సెప్టెంబర్ 19, 2020 నాటిది. ఐదుగురు కుమార్తెల తండ్రి పన్నాలాల్, కొడుకు పుట్టాలని ఎంతగానో తాపత్రయపడ్డాడు. అయితే ఇక పుట్టబోయే బిడ్డ ఎవరో తెలుసుకుందామని తన ఎనిమిది నెలల గర్భిణీ భార్య అనితపై దాడి చేశాడు. అనితకు, కడుపులో ఉన్న బిడ్డకు తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు పన్నాలాల్ చేసిన ఈ దారుణ ఘటన అప్పట్లో సంచలనమైంది.
బాధితురాలు అనిత ఈ భయానక సంఘటన గురించి గుర్తు చేసుకుని వణికిపోయింది. తన భర్త చేసిన దారుణం గురించి తలచుకుంటేనే భయం వేస్తోందని చెప్పుకొచ్చింది. ఈ ఘటన జరిగాక తాను స్పృహ తప్పి పడిపోయానని.. ఆ తర్వాత అతడు అక్కడి నుండి పారిపోయాడని ఆమె తెలిపింది. నేరం తీవ్రతను గుర్తించిన కోర్టు పన్నాలాల్‌కు జీవిత ఖైదు విధించడంతో పాటు మొత్తం రూ. 50,000 జరిమానా విధించినట్లు అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ గవర్నమెంట్ కౌన్సెల్ (క్రిమినల్), మునేంద్ర ప్రతాప్ సింగ్ చెప్పారు. పన్నా లాల్ కు జీవితఖైదు విధించడంపై అనిత ఆనందాన్ని వ్యక్తం చేసింది. కోర్టు సరైన శిక్ష విధించిందంటూ తీర్పును స్వాగతించింది.