ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో 23 ఏళ్ల వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నలుగురు వ్యక్తులు లైంగిక వేధింపులకు పాల్పడిన కొన్ని గంటల తర్వాత అతడు తన తనువు చాలించాడని పోలీసు అధికారులు తెలిపారు. బాధితుడికి సోషల్ మీడియా ద్వారా నిందితుల్లో ఒకరికి పరిచయం అయింది.. ఆ పరిచయమే ఇంతటి దారుణానికి కారణమైందని పోలీసు సూపరింటెండెంట్ (నార్త్) జితేంద్ర కుమార్ శ్రీవాస్తవ తెలిపారు. బాధితుడికి కరణ్ (అలియాస్ అశుతోష్ మిశ్రా)తో నెల రోజుల క్రితం ఆన్‌లైన్‌లో స్నేహం మొదలైంది. ఆ తర్వాత కరణ్ బాధితుడిని చిలువాటల్‌లోని తన ఇంటికి ఆహ్వానించాడు. గురువారం నాడు కరణ్ బాధితుడిని రైల్ విహార్‌లోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. అతడితో మరో ముగ్గురు సహచరులు చేరారు. నలుగురు వ్యక్తులు కలిసి బాధితుడిని బంధించారు. ఆ తర్వాత లైంగికంగా వేధించారు, బెల్టుతో కొట్టారు. ఈ ఘటనను మొత్తం రికార్డ్ చేసి, డబ్బు చెల్లించకపోతే ఆన్‌లైన్‌లో పోస్ట్ చేస్తానని బెదిరించారు.