ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ కిరాతకుడు మొత్తం కుటుంబాన్నే చంపిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
ఖమ్మం జిల్లా తల్లాడ మండలం గోపాలపేటలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఆస్తి కోసం ఓ కిరాతకుడు మొత్తం కుటుంబాన్నే చంపిన ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంట్లో శవాల కుప్ప కనిపించడంతో స్థానికులు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారు. కన్నతల్లితో సహా ఇద్దరు కన్న బిడ్డలను చిత్రహింసలకు గురిచేసి హత్య చేసిన ఘటన పలువురిని కంటతడి పెట్టించింది. ఈ ఘటన శనివారంఉదయం వెలుగుచూసింది.
పదకొండేళ్ల క్రితం పిట్టల వెంకటేశ్వర్లుతో దుర్గకు వివాహం జరిగింది. వీరికి నీరజ(10), ఝాన్సీ(6) ఇద్దరు కూతుర్లు ఉన్నారు. గత రెండేళ్ల క్రితం భార్య దుర్గను భర్త వెంకటేశ్వర్లు అతి దారుణంగా హత్య చేశాడు. దుర్గ మరణాంతరం మనవరాల్లు నీరజ, ఝాన్సీ నానమ్మ పిచ్చమ్మ వద్దే ఆశ్రయం పొందుతున్నారు. దుర్గ మరణాంతరం భర్త వెంకటేశ్వర్లు మరొక మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు.
ఈ క్రమంలోనే జల్సాలకు బానిసైన వెంకటేశ్వర్లుకు.. తన తల్లి పిచ్చమ్మ నివాసం ఉంటున్న ఇంటిపై కన్ను పడింది. దీంతో ఎలాగైనా సరే ఆ ఇంటిని స్వాధీనం చేసుకోవాలనుకున్నాడు. ఆ ఇంటి కోసం వెంకటేశ్వర్లు తల్లితో గొడవపడ్డాడు. తల్లి ఆ ఇంటిని వెంకటేశ్వర్లుకు ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆగ్రహానికి లోనైనా వెంకటేశ్వర్లు నిన్న అర్దరాత్రి సమయంలో గోపాలపేటలోని ఇంటికి చేరుకుని.. గడిపెట్టి పిచ్చమ్మ, నీరజ, ఝాన్సీలను హత్య చేసినట్లుగా సమాచారం. ఉదయం స్థానికులు తలుపు తెరిచి చూడగా గదిలో మృతదేహాలు కనిపించడంతో భయభ్రాంతులకు గురై వెంటనే పోలీసులకు సమాచారాన్ని అందించారు.
హత్య అనంతరం వెంకటేశ్వర్లు పరారయ్యాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.