ఇది ఓ ప్రేమికుడి(Lover) విషాదగాధ.. ప్రేమించిన అమ్మాయిని జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకున్నాడు.
ఇది ఓ ప్రేమికుడి(Lover) విషాదగాధ.. ప్రేమించిన అమ్మాయిని జీవిత భాగస్వామిని చేసుకోవాలనుకున్నాడు. ఆమె కోసం పెద్దలను కూడా ఎదురించాడు. గుడిలో పెళ్లి(Lover Marriage) చేసుకున్నాడు. ఇక తన జీవితం ఆనందమయం కాబోతున్నదని ఆనందించాడు. అంతలోనే ఊహించని మలుపు. పెద్దలను కాదని పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి అదే పెద్దలకు భయపడింది. మాట మార్చింది. ప్రేమించిన వాడితో కలిసి ఉంటానని చెప్పడానికి ధైర్యం సరిపోలేదామెకు! తనను బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని చెప్పింది. దాంతో ఆ యువకుడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆమె లేని జీవితం వృధా అనుకున్నాడో, అమ్మాయి మాట మార్చినందుకు ఆవేదన చెందాడో తెలియదు కానీ ఒంటిపై పెట్రోల్(Petrol) పోసుకుని ఆత్మహత్య(Suicide) చేసుకున్నాడు. అనంతపురం(Ananthapur) సమీపంలోని కల్యాణదుర్గంలో ఈ విషాద సంఘటన జరిగింది. వాసుదత్త అనే యువకుడు ఇంటి దగ్గర ఉండే ఓ యువతిని ప్రేమించాడు. ఆమె కూడా అతడిని గాఢంగా ప్రేమించింది. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. పెద్దలు మాత్రం పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరూ పెన్న అహోబిలం వెళ్లి రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ఇంతలోనే తమ కూతురు కనిపించడం లేదని యువతి తల్లిదండ్రులు పోలీసులకు కంప్లయింట్ చేశారు. పోలీసు స్టేషన్‌కు వచ్చిన ఆ అమ్మాయి పెద్దలను చూసి మాట మార్చేసింది. వాసుదత్త కొంత కాలంగా తనను ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని చెప్పింది. తనకు ఇష్టం లేదని చెప్పినా బలవంతంగా తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నాడని తెలిపింది. పోలీసులు వాసుదత్తకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించిన అమ్మాయి మోసం చేయడంతో ఆ అబ్బాయి తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. మంగళవారం ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ వాసుదత్త కన్నుమూశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.