ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై సంవత్సరం కావస్తోంది. హమాస్‌ను నిర్మూలించాలనే ఇజ్రాయెల్ సంకల్పం గాజా ప్రజలకు భారంగా మారింది

ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధం ప్రారంభమై సంవత్సరం కావస్తోంది. హమాస్‌ను నిర్మూలించాలనే ఇజ్రాయెల్ సంకల్పం గాజా ప్రజలకు భారంగా మారింది. హమాస్ కూడా తన కార్యకలాపాలు విరమించుకోవడం లేదు. ఇలాంటి ప‌రిస్థితుల‌లో ఇజ్రాయెల్ సైన్యం దక్షిణ గాజాపై జరిపిన దాడిలో ముగ్గురు టాప్ హమాస్ కమాండర్లను హతమార్చినట్లు ప్రకటించింది. ఇజ్రాయెల్ సైన్యం చేసిన ఈ దాడి గురించి గాజాలోని ఆరోగ్య అధికారులు తెలియజేశారు. ఖాన్ యూనిస్‌లోని మవాసి ప్రాంతంలో నిరాశ్రయులైన పాలస్తీనియన్లు రద్దీగా ఉండే డేరా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయని వారు తెలిపారు. ఈ దాడిలో 19 మంది మరణించగా.. ఎక్కువ‌ మంది శిథిలాలలో చిక్కుకున్నారని. చాలా మంది గాయపడ్డారని వెల్ల‌డించారు.

ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో ఫుటేజీలో అనేక గుడారాలు మంటల్లో కాలిపోవ‌డం చూడవచ్చు. ఇదే సమయంలో పలుచోట్ల పెద్దపెద్ద గుంతలు దర్శనమిస్తున్నాయి. ఇజ్రాయెల్ సైన్యం దాడికి సంబంధించి ఒక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ ప్రకటనలో ఇంటెలిజెన్స్ సమాచారం ఆధారంగా ఖాన్ యునిస్‌పై దాడి చేసినట్లు ఐడిఎఫ్ తెలిపింది. ఈ దాడుల్లో గాజా లోని హమాస్ వైమానిక విభాగం అధిపతి సమర్ ఇస్మాయిల్ ఖాదర్ అబు డక్కా, హమాస్ మిలటరీ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌లోని తనిఖీ విభాగం అధిపతి ఒసామా తబేష్, సీనియర్ హమాస్ ఉగ్రవాది అయ్మాన్ మబౌ హతమయ్యారని ఇజ్రాయెల్ సైన్యం తన ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 7, 2023న దక్షిణ ఇజ్రాయెల్‌పై హమాస్ దాడిలో ఈ ముగ్గురు ఉగ్రవాదులు ప్రత్యక్షంగా పాల్గొన్నారని సైన్యం తెలిపింది. ఇది మాత్రమే కాదు. వారు ఇటీవల ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ మరియు ఇజ్రాయెల్‌పై ఉగ్రవాద కార్యకలాపాలకు ప్లాన్ చేస్తున్నారని వెల్ల‌డించింది.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story