కొడుకుపై కత్తితో దాడి చేసిన తండ్రి
తనపై అలిగి వెళ్లిపోయిన భార్యను తిరిగి ఇంటికి రావాలంటే కన్న కొడుకునే చంపేందుకు ప్రయత్నించాడో ఓ దుర్మార్గపు తండ్రి. ఈ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్‌లో చోటు చేసుకుంది. కరన్‌కోట్ ఎస్సై విఠల్‌రెడ్డి వెల్లడించిన ప్రకారం.. కర్ణాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లా మల్కోడ్ గ్రామానికి చెందిన హన్మంత్‌కు తాండూరు మండలం మల్కాపూర్‌కు చెందిన శరణమ్మతో 17 సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కొడుకులు ఉన్నారు. ముగ్గురు కొడుకులు అరవింద్, ధర్మ, కార్తీక్. ఐదు ఏళ్లుగా మల్కాపూర్‌లో నివాసముంటున్నారు. నాపరాతి గనిలో కార్మికుడిగా పనిచేస్తున్నాడు. హన్మంత్ రెండేళ్ల నుంచి భార్య శరణమ్మను వేధిస్తున్నాడు. ఇది భరించలేక ఆమె రెండు నెలల క్రితం ఇద్దరు కొడుకులు ధర్మ, కార్తీక్‌లతో పాటు వెళ్లిపోయింది. కర్ణాటక రాష్ట్రం బీదర్ సమీపంలోని బాల్కి గ్రామంలో ఉంటున్న సోదరి ఇంటికి వెళ్లింది. అయితే పెద్ద కుమారుడు అరవింద్ తండ్రి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో మల్కాపూర్‌లో ఉంటున్న శరణమ్మ సోదరుడు నాగప్ప ఆదివారం మృతి చెందాడు. విషయం తెలియడంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు శరణమ్మ గ్రామానికి వచ్చింది. అయితే భార్య అక్కడికి వచ్చిన విషయం తెలుసుకున్న హన్మంత్ అంత్యక్రియల వద్దకు వెళ్లాడు. భార్య శరణమ్మతో మాట్లాడేందుకు ప్రయత్నించాడు కానీ ఆమె మాట్లాడలేదు. అంత్యక్రియలు అయిన తర్వాత శరణమ్మ మళ్లీ కర్ణాటక వెళ్లిపోయింది. దీంతో ఎలాగైనా భార్యను తన ఇంటికి రప్పించాలనుకున్న హన్మంత్ పెద్ద కొడుకును చంపేందుకు ప్లాన్ వేశాడు. రాత్రి 9 గంటల సమయంలో ఇంట్లో ఉన్న పెద్ద కుమారుడు అరవింద్‌పై కత్తితో మెడ, చేతులపై దాడి చేశాడు. గాయాలు భరించలేక అరవింద్ కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్నవారు తలుపులు పగలగొట్టి అరవింద్‌ను కాపాడాడు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు బాలుడిని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అరవింద్ ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వెల్లడించారు. నిందితుడు హన్మంత్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.