2021లో హర్యానాలోని పానిపట్‌లో పథకం వేసి భర్తను హత్య చేసినందుకు ఓ మహిళను, ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్టు చేశారు. అక్టోబరు 5, 2021న బాధితుడు వినోద్ బరాదాను పంజాబ్-రిజిస్టర్డ్ వాహనం ఢీకొట్టింది. అతను ప్రమాదం నుండి బయటపడ్డాడు కానీ అతని రెండు కాళ్లు విరిగిపోయాయి. రెండు నెలల తర్వాత డిసెంబర్ 15, 2021న.. వినోద్ బరాదాను పానిపట్‌లోని అతని ఇంట్లోనే కాల్చి చంపారు. వినోద్ భార్య నిధి తన ప్రేమికుడు సుమిత్‌తో కలిసి భర్త హత్యకు కుట్ర పన్నినట్లు విచారణలో తేలింది. మొదట యాక్సిడెంట్ చేయగా వినోద్ ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే ఆ తర్వాత అతనిని కాల్చి చంపారు.

2021 డిసెంబర్‌లో వినోద్ మేనమామ వీరేంద్ర ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది. వినోద్ ప్రమాదానికి గురైన తర్వాత డ్రైవర్ దేవ్ సునర్‌పై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులకు చెప్పారు. పదిహేను రోజుల తర్వాత, భటిండా నివాసి దేవ్ సునర్ సెటిల్‌మెంట్ కోసం వినోద్‌ను సంప్రదించగా, అందుకు అతను నిరాకరించాడు. దీంతో దేవ్ సునర్ అతడిని బెదిరించాడు. డిసెంబర్ 15, 2021న, దేవ్ సునర్, పిస్టల్ తీసుకుని వినోద్ ఇంట్లోకి ప్రవేశించి వినోద్ నడుము మరియు తలపై కాల్చాడు. వినోద్‌ను ఆసుపత్రికి తరలించగా, అతను చనిపోయినట్లు నిర్ధారించారు. దేవ్ సునర్ ను పానిపట్ జైలుకు తరలించారు. ఈ కేసు కోర్టులో విచారణలో ఉందని పోలీసు అధికారి తెలిపారు. ఇటీవల ఆస్ట్రేలియాలో ఉంటున్న వినోద్ బరాదా సోదరుడు అనుమానం వ్యక్తం చేస్తూ వాట్సాప్ ద్వారా సందేశం పంపాడు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న అధికారి.. మళ్లీ విచారణకు ఓ బృందాన్ని నియమించారు. ఈ బృందం కేసు ఫైల్‌ను మళ్లీ పరిశీలించి, దర్యాప్తును పునఃప్రారంభించేందుకు కోర్టు నుంచి అనుమతి పొందింది.
వినోద్ భార్య నిధితో తరచూ మాట్లాడే సుమిత్ అనే వ్యక్తితో దేవ్ సునర్ సంప్రదింపులు జరుపుతున్నట్లు గుర్తించారు. జూన్ 7న, పోలీసులు సుమిత్‌ను అరెస్టు చేశారు. విచారణలో, అతను వినోద్ ప్రమాదానికి పథకం వేసినట్లు, తరువాత అతనిని కాల్చి చంపినట్లు ఒప్పుకున్నాడు. 2021లో తాను ట్రైనర్‌గా ఉన్న జిమ్‌లో నిధిని కలిశానని, తక్కువ సమయంలోనే తాము స్నేహితులయ్యామని సుమిత్ తెలిపాడు. వినోద్ వారి మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకుని మందలించాడు. దీంతో సుమిత్, నిధి మొదట యాక్సిడెంట్ చేసి వినోద్ హత్యకు ప్లాన్ చేశారు.
సుమిత్ దేవ్ సునర్‌కు రూ.10 లక్షలు ఇస్తానని, హత్య చేసేందుకు, జైలు నుండి బయటకు తీసుకుని రావడానికి అయ్యే ఖర్చులన్నీ భరిస్తానని హామీ ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. దేవ్ సునర్‌కు పంజాబ్-రిజిస్టర్డ్ లోడింగ్ పికప్ ట్రక్ ఇచ్చారు, దానితో అతను అక్టోబర్‌లో వినోద్‌ను ఢీకొన్నాడు. వినోద్ ప్రాణాలతో బయటపడడంతో అతడిని కాల్చిచంపేందుకు పథకం పన్నారు. యాక్సిడెంట్ కేసులో దేవ్ సునర్ జైలు నుండి బెయిల్ పై బయటకు వచ్చాడు. ఎలాగోలా తుపాకీని సంపాదించాడు.. క్షమాపణలు కోరడానికంటూ వినోద్ ఇంటికి వచ్చాడు. చివరికి డిసెంబర్ 15, 2021న దేవ్ సునర్ ఇంట్లోకి ప్రవేశించి వినోద్‌పై కాల్పులు జరిపాడు. సుమిత్.. దేవ్ సునర్ కేసు, కుటుంబ ఖర్చులకు ఆర్థిక సహాయం చేస్తున్నాడు. నిధి, సుమిత్‌లను కోర్టులో హాజరుపరిచి, జ్యుడీషియల్ కస్టడీకి పంపారు.


Eha Tv

Eha Tv

Next Story