గ్యాంగ్‌స్టర్లు, అవినీతి రాజకీయ నాయకులు జైలుకెళ్లి వచ్చేటప్పుడు మామూలుగా రారు! అక్కడికేదో గొప్పపని చేసి జైలుకు వెళ్లినట్టు బిల్డప్పులిచ్చుకుంటారు.
Harshad Patankar: జైలు నుంచి వచ్చాడు.. ఓవరాక్షన్ చేశాడు.. మళ్లీ జైలుకెళ్లాడు!
గ్యాంగ్‌స్టర్లు, అవినీతి రాజకీయ నాయకులు జైలుకెళ్లి వచ్చేటప్పుడు మామూలుగా రారు! అక్కడికేదో గొప్పపని చేసి జైలుకు వెళ్లినట్టు బిల్డప్పులిచ్చుకుంటారు. వందీమాగధులతో జేజేలు కొట్టించుకుంటూ ఊరేగింపుగా వస్తారు. ఇలాగే ఓ గ్యాంగ్‌స్టర్ జైలు నుంచి విడుదలయ్యాడు. నేరుగా ఇంటికెళ్లకుండా కాసింత అతిచేశాడు. అతగాడి ఓవరాక్షన్ చూసిన పోలీసులు అతడిని మళ్లీ జైల్లోకి తోశారు. ఈ ఘటన మహారాష్ట్రలో(maharasta) జరిగింది. నాసిక్‌కు (nashik)చెందిన గ్యాంగ్‌స్టర్ హర్షద్ పాటంకర్(Harshad Patankar) జులై 23వ తేదీన జైలు నుంచి విడుదలయ్యాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మద్దతుదారులు అతడికి ఘన స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున కారు, బైక్ ర్యాలీలు తీశారు. సంబరాలు చేసుకుంటూ.. పబ్లిక్‌కు అంతరాయం కలిగిస్తూ ఇంటికి తీసుకెళ్లారు. ఇదంతా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. ఎలాంటి అనుమతులు లేకుండా ర్యాలీ చేసి ప్రజలను ఇబ్బందులకు గురి చేసినందుకు పాటంకర్, అతని ఆరుగురు మద్దతుదారులను తిరిగి అరెస్ట్ చేసి జైలుకు పంపించారు.హర్షద్ పాటంకర్ పేరు మోసిన గ్యాంగ్‌స్టర్. ప్రమాదకర కార్యకలాపాల నిరోధక చట్టం కింద అతడిని జైల్లో తోశారు. ఇతడిపై హత్యాయత్నం, దొంగతనంతో పాటు అనేక కేసులు ఉన్నాయి.