భూవివాద విషయమై ఓ మాజీ సైనికుడు తన ఇంట్లో నరమేధం సృష్టించాడు.
హర్యానా రాష్ట్రం నారాయణగఢ్‌లో ఆదివారం రాత్రి భూవివాద విషయమై ఓ మాజీ సైనికుడు తన ఇంట్లో నరమేధం సృష్టించాడు. నిందితుడు తన సోదరుడు, కోడలు, వారి పిల్లలు, తల్లిని హత్య చేశాడు. మృతుల్లో ఆరు నెలల పాప కూడా ఉంది. హత్యాకాండ తర్వాత నిందితుడు అందరి మృతదేహాలను తగలబెట్టడానికి ప్రయత్నించారు. మృతులను హరీష్ (35), అతని భార్య సోనియా (32), తల్లి సరోపి (65), కుమార్తె యాషిక (5), కుమారుడు మయాంక్ (6 నెలలు)గా గుర్తించారు. గాయపడిన తండ్రి ఓం ప్రకాష్.. నారాయణగఢ్ సివిల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నారాయణగఢ్ పోలీసులు మృతదేహాలను కంటోన్మెంట్ సివిల్ ఆసుపత్రి మార్చురీలో ఉంచారు.
హత్య గురించి సమాచారం అందుకున్న అంబాలా పోలీసు సూపరింటెండెంట్ సురేంద్ర సింగ్ భౌరియా రాత్రి 3 గంటలకు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు ప్రారంభించారు. అలాగే హంతకుడిని పట్టుకునేందుకు బృందాలను ఏర్పాటు చేశారు.
అన్నదమ్ములిద్దరికీ రెండెకరాల భూమి ఉన్నట్లు సమాచారం. ఈ భూమి విషయమై కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. దీంతో నిందితుడు సోదరుడిపై పగ పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే అతడు తన సోదరుడు, తల్లితో పాటు వారి పిల్లలను హత్య చేశాడు.