కేరళలోని ఇడుక్కి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది.
కేరళలోని ఇడుక్కి ఫాస్ట్ ట్రాక్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. కూతురిపై అత్యాచారం చేసిన ఓ తండ్రికి 72 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తూ ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్డు న్యాయమూర్తి లైజుమోల్ షరీఫ్ సంచలన తీర్పు నిచ్చారు. వాగమోన్ గ్రామంలో నాలుగేళ్ల పాటు అత్యాచారం జరిగింది. ఈ నేరం 2012 నుంచి 2016 మధ్య జరగగా.. ఆమె 2020లో ఫిర్యాదు చేసింది. లైంగిక వేధింపుల గురించి ఎవరికైనా చెబితే చంపేస్తాడనే భయంతో బాలిక నేరం గురించి చెప్పలేదని ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. ఆమె తండ్రి ఇప్పటికే ఒక హత్య కేసులో జైలులో ఉన్నాడని.. ఆ భయంతో నేరం గురించి చెప్పలేదంది. తన చదువుకు సహకరించే తన తండ్రి స్నేహితుడి సాయంతో పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. అలాగే తన తండ్రి నుంచి తనకు ఎదురైన చేదు అనుభవాలను పేపర్‌పై రాసుకుని మంచం కింద పెట్టుకోవడం బాలికకు అలవాటుగా ఉందని ఎస్పీపీ తెలిపారు. ఈ పేపర్లు పోలీసులకు దొరికాయి. నేరం రుజువయ్యేందుకు ఇవి సాక్షులుగా పరగణించబడ్డాయి. అయితే దోషి 20 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుంది. అన్ని శిక్షలు ఏకకాలంలో అమలు చేయబడతాయి. కోర్టు దోషికి రూ.1.8 లక్షల జరిమానా విధించింది.