ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం నాడు బస్సు కాలువలో పడిపోవడంతో

ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాలో మంగళవారం నాడు బస్సు కాలువలో పడిపోవడంతో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసు ఉన్నతాధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. బాధితులు తీవ్రంగా గాయపడి ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దుర్గ్‌లోని ఒక ప్రైవేట్ డిస్టిలరీ కంపెనీకి చెందిన కార్మికులు ఇంటికి తిరిగి వస్తుండగా ఖాప్రి సమీపంలో బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటన మంగళవారం రాత్రి 8.30 గంటలకు కుమ్హారి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని కేడియా వద్ద చోటుచేసుకుంది.

దుర్గ్ కలెక్టర్ రిచా ప్రకాష్ చౌదరి సంఘటన వివరాలను పంచుకుంటూ.. కార్మికులతో నిండిన బస్సు దుర్గ్‌లోని కాలువలో పడటంతో 12 మంది ప్రయాణికులు మరణించారని.. 14 మంది తీవ్రంగా గాయపడ్డారని తెలిపారు. క్షతగాత్రులలో 12 మందిని ఎయిమ్స్ (రాయ్‌పూర్)కు తరలించామని, మిగిలిన ఇద్దరు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ కూడా విచారం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన సంతాపాన్ని తెలియజేస్తూ, “ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌లో జరిగిన బస్సు ప్రమాదం చాలా బాధాకరమైన విషయం. ఇందులో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా సానుభూతిని తెలియజేస్తున్నాను. దీనితో పాటు, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణ, స్థానిక అధికారులు బాధితులకు అన్ని విధాలుగా సహాయం చేయడంలో నిమగ్నమై ఉంది." అని తెలిపారు ప్రధాని మోదీ.

Updated On 9 April 2024 8:41 PM GMT
Yagnik

Yagnik

Next Story