మరణంపై దర్యాప్తు చేయాలని 27 రోజుల తర్వాత టీనేజర్ మృతదేహాన్ని సమాధి నుండి బయటకు తీసిన ఘటన వెలుగు చూసింది
మరణంపై దర్యాప్తు చేయాలని 27 రోజుల తర్వాత టీనేజర్ మృతదేహాన్ని సమాధి నుండి బయటకు తీసిన ఘటన వెలుగు చూసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్‌పూర్‌లోని సిల్హెటా ముండేరా లాంగ్రా కూడలిలో నివాసం ఉంటున్న దిలీప్.. 13 ఏళ్ల కుమారుడు మరణించగా మృతదేహాన్ని 27 రోజుల తర్వాత సమాధి నుంచి బయటకు తీశారు. జులై 2న మెడికల్ స్టోర్ నిర్వాహకుడు ఇంజక్షన్ వేయడంతో ఆరోగ్యం క్షీణించింది. దీంతో అతడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. కుటుంబ సభ్యులు యువకుడి మృతదేహాన్ని గ్రామ బయట పొలం దగ్గర పూడ్చిపెట్టారు. కొన్ని రోజుల తర్వాత దిలీప్.. మెడికల్ స్టోర్ నిర్వాహకుడి నిర్లక్ష్యంపై కేసు పెట్టాడు. దీంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించాలని డీఎం ఆదేశాలు జారీ చేశారు.
జూలై 2న దీపక్‌కి జ్వరం వచ్చింది. తండ్రి దిలీప్ అతన్ని చికిత్స కోసం లాంగ్రా కూడలిలో ఉన్న మెడికల్ దుకాణానికి తీసుకెళ్లాడు. రాజీ జగదీష్‌పూర్ ప్రాంతానికి చెందిన మెడికల్ స్టోర్ ఆపరేటర్ జితేంద్ర శర్మ, సచిన్‌లు అతనికి క్యాప్సూల్స్, మాత్రలు వేసి ఇంజక్షన్ ఇచ్చారు. దీంతో అతని శరీరంలోని ఎడమ భాగం పక్షవాతానికి గురైంది. అతని ఆరోగ్యం బాగా క్షీణించడంతో, మెడికల్ స్టోర్ నిర్వాహకుడు దీపక్‌ను నగరంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చాడు. దీపక్ కుటుంబానికి రూ.18 వేలు ఇచ్చి.. ఆపై చికిత్స తీసుకోమని చెప్పాడు. ఆ తర్వాత యువకుడు మృతి చెందాడు.
దీపక్ తండ్రి ఫిర్యాదు మేరకు మెడికల్ స్టోర్ నిర్వాహకుల సోదరులిద్దరిపై కేసు నమోదు చేశారు. నీటి ఎద్దడి కారణంగా మృతదేహాన్ని బయటకు తీయడంలో జాప్యం జరుగుతోందని నాయబ్ తహసీల్దార్ నీరూ సింగ్ తెలిపారు. పోస్టుమార్టం రిపోర్టు వచ్చిన తర్వాత మృతికి గల కారణాలు తేలనుందని వెల్లడించారు.