వివాహేతర సంబంధాల కారణంగా చాలా కుటుంబాలు నాశనమవుతాయి.

వివాహేతర సంబంధాల కారణంగా చాలా కుటుంబాలు నాశనమవుతాయి. అలాంటి వ్యవహారాలు తరచుగా విషాదకరమైన పరిణామాలకు దారితీస్తాయి. ఓ 50 ఏళ్ల వివాహిత పొరుగింటి వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ వ్యవహారం బయటపడడంతో మహిళ భర్త, కొడుకు పక్కింటి వ్యక్తిని హత్య చేశారు. ఎవరికీ అనుమానం రాకుండా చాలా పక్కాగా హత్యకు ప్లాన్ చేశారు.కానీ చివరకు అసలు విషయం వెలుగులోకి రావడంతో నిందితులను అరెస్ట్ చేశారు.
ఈ ఘటన కేరళలోని అలప్పుజలో చోటుచేసుకుంది. కుంజుమోన్ అనే 54 ఏళ్ల వ్యక్తి, అతని 50 ఏళ్ల భార్య ఆశమ్మ ఉంటున్నారు. వీరికి కిరణ్ అనే 28 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. 53 ఏళ్ల దినేశన్ ఆశమ్మతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. మొదట్లో ఈ వ్యవహారం గోప్యంగానే సాగినప్పటికీ కాలక్రమేణా ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలిసింది. దీంతో ఈ వ్యవహారానికి స్వస్తి చెప్పాలని ఆశమ్మకు పదే పదే సూచించగా, దినేశన్‌ను దూరంగా ఉండమని హెచ్చరించినా వారిద్దరూ వినలేదు. ఓ దశలో కిరణ్, దినేశన్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. చివరికి కిరణ్, కుంజుమోన్‌లు దినేశన్‌ను హత్య చేయాలని నిర్ణయించుకున్నారు. వారు పక్కా ప్రణాళికను రూపొందించి, హత్యను యాక్సిడెంట్‌గా చూపించే ప్రయత్నం చేశారు. ఇంటి పెరట్లోంచి ఆశమ్మ ఇంట్లోకి దినేశన్ తరచూ దొంగచాటుగా వచ్చేవాడు. ఈ విషయం తెలుసుకున్న కుంజుమోన్, కిరణ్ ఇంటి వెనుక భాగంలో విద్యుత్ తీగను ఏర్పాటు చేసి లైవ్ పవర్ సోర్స్‌కు కనెక్ట్ చేశారు. ఆ దారిలో దినేశన్ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా ప్రమాదవశాత్తు లైవ్ వైర్‌కు తగిలి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఫిబ్రవరి 8న సాయంత్రం 6:30 గంటల ప్రాంతంలో దినేశన్ మృతదేహం అతని ఇంటి సమీపంలోని వరి పొలంలో పడి ఉంది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇది ప్రమాదంలో జరిగిన మరణం కాదని పోలీసులు అనుమానించి విచారణ చేపట్టారు. దశల వారీగా నిజానిజాలు బట్టబయలు చేయడంతో పాటు వ్యూహాత్మకంగా విచారించిన పోలీసులు నిందితులను పట్టుకోవడంలో సఫలమయ్యారు. విచారణ అనంతరం కిరణ్, కుంజుమోన్, ఆశమ్మలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
