Accident : ట్రక్కును ఢీకొట్టిన ఆయిల్ ట్యాంకర్.. 48 మంది దుర్మరణం
ఆదివారం పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాలో ఆయిల్ ట్యాంకర్.. ట్రక్కును ఢీకొట్టడంతో పేలుడు సంభవించింది.
ఆదివారం పశ్చిమ ఆఫ్రికా దేశం నైజీరియాలో ఆయిల్ ట్యాంకర్.. ట్రక్కును ఢీకొట్టడంతో పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు 48 మంది మరణించారు. దాదాపు 50 పశువులు సజీవ దహనమయ్యాయి. నైజర్ స్టేట్ ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ జనరల్ అబ్దుల్లాహి బాబా-అరబ్ మాట్లాడుతూ.. ఉత్తర-మధ్య నైజర్ రాష్ట్రంలోని అగాయ్ ప్రాంతంలో పశువులను తీసుకెళ్తున్న ట్రక్కు ఆయిల్ ట్యాంకర్‌ను ఢీకొట్టింది. పేలుడు తర్వాత సుమారు 50 పశువులు సజీవ దహనమయ్యాయి. ప్రమాద స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
బాబా-అరబ్ సంఘటనా స్థలం నుండి 30 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు మొదట ధృవీకరించారు. తరువాత మరో 18 మృతదేహాలను కనుగొన్నట్లు తెలియజేశారు. మృతులను సామూహికంగా ఖననం చేసినట్లు తెలిపారు.
ప్రమాదం తర్వాత ప్రజలలో పెరుగుతున్న ఆగ్రహాన్ని చూసిన నైజర్ రాష్ట్ర గవర్నర్ మహమ్మద్ బాగో బాధిత ప్రాంత నివాసితులను శాంతించాలని పిలుపునిచ్చారు. రోడ్డు ప్రయాణీకులు నిత్యం అప్రమత్తంగా ఉండాలని.. ట్రాఫిక్ నిబంధనలు పాటించి ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ కల్పించాలన్నారు.
నైజీరియాలో వస్తువులను రవాణా చేయడానికి సమర్థవంతమైన రైల్వే వ్యవస్థ లేదు. దీని కారణంగా ఆఫ్రికాలోని అత్యధిక జనాభా కలిగిన నైజీరియా దేశంలో ప్రాణాంతక ట్రక్కు ప్రమాదాలు సర్వసాధారణం. నైజీరియాలోని ఫెడరల్ రోడ్ సేఫ్టీ కార్ప్స్ ప్రకారం.. 2020లోనే 1,531 గ్యాసోలిన్ ట్యాంకర్ ప్రమాదాలు జరిగాయి. ఇందులో 535 మంది మరణించగా.. 1,142 మంది గాయపడ్డారు.