భారతీయులదీ బంగారానిదీ ఫెవికాల్ బంధం. విడదీయలేని సంబంధం. బంగారమంటే చాలు ఎందుకోగాని మొహాలు బంగారంలా వెలిగిపోతాయి.మగువలకైతే మరీనూ. సిరిసంపదలున్న చోట బంగారముంటుందో, బంగారమున్నచోట సిరిసంపదలు వర్ధిల్లుతాయో తెలియదు కానీ మనవాళ్లకు మాత్రం బంగారమున్న చోట లక్ష్మి తాండవిస్తుందనేది గట్టి నమ్మకం. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటే సిరి నట్టింట్లో పద్మాసనమేసుకుని కూర్చుంటుదనే బలమైన నమ్మకం.
భారతీయులదీ బంగారానిదీ ఫెవికాల్ బంధం. విడదీయలేని సంబంధం. బంగారమంటే చాలు ఎందుకోగాని మొహాలు బంగారంలా వెలిగిపోతాయి.మగువలకైతే మరీనూ. సిరిసంపదలున్న చోట బంగారముంటుందో, బంగారమున్నచోట సిరిసంపదలు వర్ధిల్లుతాయో తెలియదు కానీ మనవాళ్లకు మాత్రం బంగారమున్న చోట లక్ష్మి తాండవిస్తుందనేది గట్టి నమ్మకం. అక్షయ తృతీయ నాడు బంగారాన్ని కొంటే సిరి నట్టింట్లో పద్మాసనమేసుకుని కూర్చుంటుదనే బలమైన నమ్మకం. ఇన్నేసి నమ్మకాలున్నాయి కాబట్టే అమ్మకాలూ పెరుగుతున్నాయి.
పసిడి దుకాణాలు పసిడికాంతులద్దుకుంటున్నాయి. ఎక్కడ చూసినా అక్షయ తృతీయ హడావుడే కనిపిస్తోంది. గోల్డ్ షాపుల డిస్కౌంట్లు, స్కీములు సరేసరి! అసలు అక్షయ తృతీయ రోజే బంగారాన్ని ఎందుకు కొనాలి? కొంటే ఏమవుతుంది? లక్కు కలిసొస్తుందా? లేక ఇదంతా మార్కెట్ జిమ్మిక్కా? వీటికి సమాధానాలు చెప్పడం కష్టం కానీ...తెలుగువారి పండుగల లిస్ట్‌లో మాత్రం మరో పండుగ వచ్చి చేరింది. అక్షయ తృతీయ. తెలుగువాళ్లకు ఇదో కొత్త పండగ. మహా అయితే ఈ పండగకు ఇరవై ఏళ్ల వయసుంటుందంతే! ఉత్తర భారతీయులకు మాత్రం ఇదో పర్వదినం. బంగారానికి ముడిపెట్టిన పండుగదినం. ఈ రోజు బంగారు వ్యాపారులకు మాత్రం పసిడి పంటే! కొన్న వాళ్లకేమో కానీ వ్యాపారుల ఇంటికి మాత్రం పరుగెత్తుకుంటూ వెళుతుందనేది మాత్రం నిజం..అక్షయ తృతీయ పండుగ వెనుక పెద్ద కథే వుంది. అక్షయమంటే క్షయం లేనిదని అర్థం. జీవితంలో అన్నింటినీ అక్షయం చేసే పర్వదినం కాబట్టే దీనికి అక్షయ తృతీయ అనే పేరు వచ్చింది..ప్రతి ఏడాది వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియనాడు జరుపుకోవడం ఆచారం. సంప్రదాయం..
వైశాఖ మాసస్య చయా తృతీయా. నవమ్యసా కార్తీక శుక్లపక్షో. నభస్య మాసన్య తమిస్రపక్షో. త్రయోదశే పంచదశీచమాఘే అనేది పురాణ సూక్తం. వైశాఖ శుద్ద తృతీయ నాడు కృత యుగం. కార్తీక శుక్ల నవమి రోజున త్రేతాయుగం. భాద్రపద బహుళ త్రయోదశినాడు ద్వాపరయుగం. మాఘ బహుళ అమావాస్య నాడు కలియుగం ప్రారంభమయ్యాయి. ఆ లెక్కన కృతయుగ ఆరంభమే అక్షయ తృతీయన్నమాట. ఉదయాన్నే అభ్యంగన స్నానం చేసి గోధుమలు, శనగలు, పెరుగన్నం దానం చేస్తే సకల పాపాలు తొలిగిపోతాయట! గొడుగు, పాదరక్షలు, భూమి, బంగారం, వస్త్రాలు దానం చేస్తే శివసాయుజ్యం లభిస్తుందని విశ్వాసం. ఈ రోజున ప్రత్యేకంగా చేసే దాన ధర్మాలు పితృదేవతలకు చేసే పూజలు అక్షయ పుణ్య ఫలితాలిస్తాయని శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకు చెప్పాడంటారు. బదరీనాథ్ క్షేత్రంలోని బదరీనారాయణ స్వామి ఆలయాన్ని అక్షయ తృతీయ రోజే తెరుస్తారు. అక్షయ తృతీయ అంటే అపరిమితమైన ఆనంద ఐశ్వర్యాలను ప్రసాదించే తృతీయ తిథి అని అర్థం. ఈ రోజున ప్రత్యేకంగా శ్రీ మహాలక్ష్మిదేవిని పూజించడం సంప్రదాయం. ఈ రోజున బంగారం కొని ఇంటికి తెచ్చుకుంటే ఏడాదంతా సిరిసంపదలతో వర్ధిల్లుతారని నమ్మకం. ఈ నమ్మకమే బంగారం వ్యాపారస్తులకు కొంగు బంగారమైంది...
పురాణ కాలం నుంచి అక్షయ తృతీయ ప్రస్తావన వుంది. నరసింహస్వామి ప్రహ్లాదుడిని అనుగ్రహించిన రోజు ఇదే! మహా విష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించింది ఇదే రోజున! ఈ రోజునే దివిజ గంగ భువికి దిగింది. శ్రీకృష్ణుడు తన బాల్య మిత్రుడు కుచేలుడిని కలుసుకున్నది కూడా ఇదే రోజు. వ్యాస మహర్షి మహాభారతాన్ని వినాయకుడి సాయంతో రాయడం మొదలుపెట్టిన రోజు కూడా ఇదే! సూర్య భగవానుడు అజ్ఞాతవాసంలో ఉన్న పాండవులకు అక్షయ పాత్రను ఇచ్చిన శుభ దినం ఇవాళే! పరమశివుడిని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సకల సంపదలకు సంరక్షకుడిగా నియమింపబడింది ఇదే రోజున! ఆది శంకరాచార్యులు కనకధారస్తవంను చెప్పింది ఇదే రోజున! ఇంకా అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన రోజు. దుశ్శాసనుడి బారి నుంచి ద్రౌపదిని కృష్ణ పరమాత్ముడు రక్షించిన రోజు... ఇలా అక్షయ తృతీయకు ఇన్ని ఘనతలున్నాయి. అన్నట్టు సింహాద్రి అప్పన్న చందనోత్సవం జరిగేది కూడా ఈ రోజునే! ఈ పండుగ రోజున పుష్పమో, ఫలమో భగవంతుడికి అర్పించినా, దైవనామస్మరణ చేసినా ఆఖరికి నమస్కారం చేసినా అక్షయమైన సంపద, పుణ్యం లభిస్తాయని ప్రతీతి. అంతే తప్ప బంగారాన్ని తప్పనిసరిగా కొనాలని ఏ పురాణమూ చెప్పలేదు. అక్షయ తృతీయనాడు గురు రాఘవేంద్రుని భక్తులు ఆ స్వామిని ఆరాధించి బంగారాన్ని సమర్పిస్తారు. కొందరు ముత్యాల శంఖాన్ని పూజిస్తారు. ఇంకొందరు పాదరస లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ ప్రసన్నం చేసుకుంటారు. కొన్ని ప్రాంతాల వారు కుబేరుడిని ఆరాధిస్తారు. దుర్గను కొలుస్తారు. ఈ రోజున ఏకాక్షీ నారికేళాన్ని పూజించేవారు కూడా వున్నారు. ఇవన్నీ పురాణ కథలు. ఎక్కడా పసిడిని కొనాలని లేదు. ఎప్పుడు మొదలైందో తెలియదు కానీ ఈ ట్రెండ్ మాత్రం స్వల్ప సమయంలోనే పాపులరైంది...