11.6 లక్షల కోట్ల నికర విలువతో గౌతమ్ అదానీ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచారు.

11.6 లక్షల కోట్ల నికర విలువతో గౌతమ్ అదానీ హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో ముఖేష్ అంబానీని వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచారు. నివేదిక ప్రకారం.. గత ఏడాది భారతదేశంలో ప్రతి ఐదు రోజులకు ఒకరు బిలియనీర్ అయ్యారు. హురున్ నివేదిక జూలై 31, 2024 వరకు మాత్ర‌మే సంపదను లెక్కించింది. ఈ జాబితాలో తొలిసారిగా షారుక్ ఖాన్ చోటు దక్కించుకున్నాడు. ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌లో అతని వాటా విలువ పెరగడమే దీనికి ప్రధాన కారణం.

హురున్ ఇండియా వ్యవస్థాపకుడు అనస్ రెహ్మాన్ జునైద్ మాట్లాడుతూ.. 'ఆసియా సంపద సృష్టి ఇంజిన్‌గా భారతదేశం ఎదుగుతోందన్నారు. చైనాలో బిలియనీర్ల సంఖ్య 25% క్షీణించగా.. భారత్‌లో 29% పెరిగి రికార్డు స్థాయిలో 334 బిలియనీర్లకు చేరుకుందని వెల్ల‌డించారు.

భారతదేశంలోని టాప్‌-10 ధనవంతులు వీరే..

1. 11,61,800 కోట్ల నికర విలువతో హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో గౌతమ్ అదానీ అగ్రస్థానంలో ఉన్నారు.

2. 2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో ముఖేష్ అంబానీ రెండవ అగ్రస్థానంలో నిలిచారు. ఆయన నికర విలువ రూ.10,14,700 కోట్లు.

3. హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ శివ్ నాడార్ మూడవ స్థానంలో నిలిచారు. ఆయన సంపద రూ.3,14,000 కోట్లు.

4. వ్యాక్సిన్ తయారీదారు సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు చెందిన సైరస్ ఎస్ పూనావాలా నాల్గవ స్థానంలో ఉన్నారు. ఆయన నికర విలువ రూ.2,89,800 కోట్లు.

5. సన్ ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీస్‌కు చెందిన దిలీప్ షాంఘ్వీ భారతదేశంలోని అత్యంత ధనవంతుల జాబితాలో ఐదవ స్థానంలో ఉన్నారు. ఆయన నికర విలువ రూ.2,49,900 కోట్లు.

6. 2,35,200 కోట్ల నికర విలువతో ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన కుమార్ మంగళం బిర్లా ఆరో స్థానంలో ఉంది.

7. గోపీచంద్ హిందూజా అండ్ ఫ్యామిలీ ఆఫ్ హిందుజా గ్రూప్ ఏడో స్థానంలో ఉంది. వారి నికర ఆస్తుల విలువ రూ.1,92,700 కోట్లు.

8. అవెన్యూ సూపర్‌మార్ట్స్‌కి చెందిన రాధాకృష్ణ దమానీ & ఫ్యామిలీ ఎనిమిదో స్థానంలో ఉంది. వారి నికర ఆస్తుల విలువ రూ.1,90,900 కోట్లు.

9. తొమ్మిదో స్థానంలో విప్రోకు చెందిన అజీమ్ ప్రేమ్‌జీ అండ్ ఫ్యామిలీ రూ.1,90,700 కోట్లతో ఉన్నారు.

10. 1,62,800 కోట్ల నికర విలువతో బజాజ్ ఆటోకు చెందిన నీరజ్ బజాజ్ అండ్ ఫ్యామిలీ పదో స్థానంలో ఉంది.

2024 హురున్ ఇండియా రిచ్ లిస్ట్‌లో అతి పిన్న వయస్కుడు 21 ఏళ్ల కైవల్య వోహ్రా.. $5 బిలియన్ల క్విక్ కామర్స్ స్టార్టప్ Zepto వ్యవస్థాపకుడు. జెప్టో సహ వ్యవస్థాపకుడు 22 ఏళ్ల ఆదిత్ పాలిచా ఈ జాబితాలో రెండవ అతి పిన్న వయస్కుడైన బిలియనీర్.

Sreedhar Rao

Sreedhar Rao

Next Story