వివాహ విషయంలో తల్లితండ్రులు తెలియక కొన్ని తప్పులు చేయుచున్నారు! ఏమిటీ అనగా

వివాహ విషయంలో తల్లితండ్రులు తెలియక కొన్ని తప్పులు చేయుచున్నారు! ఏమిటీ అనగా ఏదైనా అమ్మాయికి, కాని అబ్బాయికి కాని సంబంధం రాగానే ముందు నక్షత్రం ఏమిటని అడిగి, నక్షత్రం చెప్పగానే వెంటనే మా అమ్మాయికి సరిపోదు అండి ఈ నక్షత్రం అని చెప్తున్నారు! కాని అది శుద్ధ తప్పు. రెండు జాతకంలో మధ్య వివాహ పొంతన నిర్ణయించడానికి సుమారు 23 విషయాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది అందులో చివరిలో ఉండే విషయము తారావలము. కాబట్టి ఒక్క నక్షత్రంతోనే జాతకాన్ని నిర్ణయంచి కుదరలేదని నిర్ణయించకూడదు.అందుకని ముందు మీ అబ్బాయికి వేరే అమ్మాయికి సరిపోయే నక్షత్రాలు అన్న లిస్టు రాసుకున్న కాగితాన్ని పక్కన పడేయండి.అసలు ఈ లిస్టు అబ్బాయిల తల్లిదండ్రులకి అవసరం లేదు. ఎందుకంటే వివాహ పొంతన విషయములో నక్షత్రాల పొంతన అన్ని అమ్మాయి నుండే చూడాలి అని శాస్త్ర వచనము. అందుచేత వివాహ పొంతన చేయు సమయంలో వధూ వరుల ఇద్దరి వ్యక్తిగత జాతకాలు పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి .కాని కేవలము నక్షత్ర ఆధారంగా వద్దు అని నిర్ణయం తీసుకోకండి.

జాతకంలో కుజదోషమని భయపడి, ప్రక్కవారిని కూడ భయ పెట్టకూడదు! ఎందుకంటేకుజదోషమునకు జాతకంలో చాలా పరిహారలు ఉన్నవి! అనేక సందర్భాలలో మిగిలిన గ్రహముల PAC వలన కుజదోషం వర్తించదు లేదా పూర్తిగా రద్దుకవింపబడుతుంది. ఈ విషయం తెలియకుండా సప్తంలో కుజుడు అష్టమంలో కుజుడు అని చెప్పి తెలిసి తెలియని శాస్త్ర పరిజ్ఞానంతో, ముఖ్యంగా మిమ్మల్ని అనేక రకాలుగా భయభ్రాంతులను చేసే యూట్యూబ్ వీడియోలు లేదా టీవీలో హోమాలు జపాలు చేయిస్తాము అని వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్లతో ఇచ్చే అడ్వర్టైజ్మెంట్లు చూసి కంగారుపడి మోసపోకండి వేలకు మించిన ధనముతో ఎవర్నో నమ్మి ఆన్లైన్లో పరిహారాలు చేయించుకోకండి. చాలా సందర్భాలలో కుజదోషము రద్దు అవుతుంది అని చెప్పడానికి అనేక శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి

దీనిపై పూర్తి అవగాహన కలగడానికి కేవలము పూర్తి శాస్త్ర పరిజ్ఞానం కలిగి..... ( మీరు ఉన్న ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా చేసుకుని మీ దగ్గర నుండి వేలకు వేలు పూజల రూపంలో దోచుకునే వారి నుండి దూరంగా ఉంటూ) .మీకు నిజాయితీగా సలహా ఇచ్చే శాస్త్రము తెలిసిన పండితులను కలవండి వారి అభిప్రాయం తీసుకోండి. ఇంకా సరిపోలేదు అనుకుంటే అప్పుడు శాస్త్ర ఆధారం చూపించి తెలపమని అడగడం తో పాటు ఇంకొక శాస్త్రము తెలిసిన పండితుని దగ్గరికి వెళ్ళండి... అంతేగాని మా గురువుగారు వద్దన్నారు అని ఒక మాట చెప్పి మంచి మంచి సంబంధాలు ఇరుపక్షముల వాళ్ళు కూడా వదులుకోకండి.

అదేవిధంగా కుజదోషం ఉన్నవారికి ఉన్నవారితో, లేనివారికి లేనివారితో చేస్తే కూడా ఈ దోషం పూర్తిగా తొలగిపోతుంది.

మీ అవగాహన కోసము తెలియజేస్తున్నాను... మొత్తము ఉన్న 12 రాశులలో ఆరు రాశులలో కుజుడు ఉండడం వల్ల దోషము ఏర్పడుతుంది. అంటే సగము రాశులలో ఉంటే దోషము అంటే ప్రతి ఇద్దరిలోనూ ఒకరికి కుజదోషం ఉంటుంది కాబట్టి దీనిని ఒక చిన్న విషయముగా భావించి అతిగా భూతద్దంలో చూడకుండా కొంచెం విజ్ఞత ప్రదర్శించి ఆలోచించండి. ముఖ్యంగా 1992 నుండి 98 వరకు పుట్టిన పిల్లలలో అప్పటి గ్రహ సంచారము వలన కుజదోషం ఉన్నవారే ఎక్కుగా ఉన్నారు! కాబట్టి కేవలము అన్నీ బాగుండి ఈ ఒక్క విషయం దగ్గర సంబంధాలు వదులుకోకండి.

ఇంకొక గుర్తు పెట్టుకోవాల్సిన విషయము ...వివాహ పొంతనలో అమ్మాయి జాతకమే ముఖ్యం ...అమ్మాయి నక్షత్రాన్ని బట్టే తారాబలం చూడాలి! అబ్బాయి నక్షత్రానికి నైధన తార, మరియు కొన్ని నవకములలో మాత్రమే విపత్ మరియు ప్రత్యక్ తార కాకూడదు. ఇంకా అసలు విషయానికి వస్తే జాతకంలో కూడ పూర్తి 100% కుదిరే జాతకాలు ఏవి ఉండవు!

మనకు ప్రధానంగా చెప్పబడిన కొన్ని దోషములు లేకుండా ఉంటూ కుటుంబ సంతాన మాంగల్య ఆరోగ్య స్థానములు బలంగా ఉంటే మిగిలిన జాతకం ఎలా ఉన్నా తప్పనిసరిగా ముందుకు వెళ్లొచ్చు .

ఎక్కడో ఉండే తీవ్రమైన దోషాలకు తప్ప చాలా వరకు అన్ని రకముల దోషములకు దైవారాధనతో కూడిన పరిహారములు ఉంటాయి . వాటిని సాధారణ ఖర్చుతో వివాహము ముందుగానే వివాహము తరువాత దంపతుల చేతగాని ఈ పరిహార క్రియలు చేయించి దోషణ వృత్తి చేసుకోవచ్చు . అంతేగాని అన్ని బాగుండాలి అసలు ఏ రకమైన దోషము ఉండకూడదు అలాంటి మనిషి కావాలి అనుకుంటే అలాంటి జాతకం ఉన్న మనిషి మీకు ఈ జన్మకు దొరకరు. కాబట్టి తల్లిదండ్రులు కొంచెం విజ్ఞతతో వ్యవహరించాలి.

అందువలన జాతక పొంతన ఇప్పటి రోజుల్లో కనీసం 50% కుదిరిన చాలు, అదికూడా నక్షత్రం కుదిరిన, కుదరక పోయిన, ఇంపార్టెంట్ కాదు... పైన చెప్పిన విధంగా జాతకంలో, సౌభాగ్య స్థానం, సంతాన్న స్థానం, కుటుంబ స్థానం, తిండికి, గుడ్డకు లోటు లేని జాతకం అమ్మాయి జాతక రీత్యా అబ్బాయికి అభివృద్ధి ఉందా! లేదా! జరుగుతున్న దశ బలంగా ఉందా! లేదా, గృహ యోగం, చూస్తే అవి బాగుంటే చాలు, పంచాంగం లో బిందువులు, గణాలు, లేక జంతువులు, పులి మేక అని ఇటువంటి చిన్న విషయాలు కుదరలేదు అని, దగ్గరకు వచ్చిన సంబంధములు దయచేసి క్యాన్సిల్ చేసుకోవద్దు! చిన్న చిన్న పాయింట్స్! కుదరకపోయిన ఫరవాలేదు ఎందుకంటే వాటికీ 5% ఫలితం తప్ప ఉండదు! శాస్త్రము పై పూర్తి అవగాహన లేని వారి అభిప్రాయాన్ని బట్టి జాతకాలు బాగాలేవని క్యాన్సిల్ చేసుకోవద్దు!

ఇలా కాకుండా కొంతమంది జ్యోతిష్కులు ఎలా ఉంటారు అంటే వారికి తెలిసిన శాస్త్ర పరిజ్ఞానము అంతా మీ ముందు ప్రదర్శించాలి అని చెప్పి ప్రాముఖ్యత కలిగిన విషయాలు చెప్పకుండా ప్రాముఖ్యం లేని చిన్న చిన్న దోషాలని పెద్దవిగా చూపిస్తూ పరిహారాలు అంటూ మిమ్మల్ని భయపెట్టి కుదరలేదు అని చెప్పి మీ ద్వారా అనేక రూపాల్లో డబ్బులు రాబట్టుకోవాలని చూస్తారు అంతేతప్ప వారికి అమ్మాయి లేక అబ్బాయి వయస్సు మిగిలిన విషయాలు దృష్టిలో పెట్టుకొని సంబంధము కలుపుదాము అన్న ఆలోచన ఏమాత్రం ఉండదు.దయచేసి ఇటువంటి వాళ్ళకి దూరంగా ఉండండి. శాస్త్ర అనుభవం ఉన్నవారి దగ్గిరకు వెళ్లి గట్టి నిర్ణయం తీసుకోండి.

ఇక్కడ 100 అబద్దాలు ఆడి ఒకపెళ్ళి చేయమన్నారు! కాని మనం అబద్దాలు అడక్కరలేదు ఎందుకంటే తల్లి తండ్రులకు కావాల్సింది ఏమిటి వాళ్లిద్దరూ సుఖంగా ఉండాలి! ఉంటే తల్లి తండ్రులు సుఖంగా ఉంటారు.మీరు నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి అలోచించి మంచి నిర్ణయం తీసుకొని, వివాహాలు చేయండి! తెల్సి తెలియని విజ్ఞానంతో వివాహాలు చెడగొట్టుకోవద్దు! కాబట్టి, తల్లి తండ్రులు పైన చెప్పిన విషయాలు దృష్టిలో పెట్టుకుని, ఆలోచించి పిల్లల వివాహల విషయంలో తగు నిర్ణయం తీసుకొని వారికి సంబంధాలు కుదురుచి తొందరగా వారికి వివాహం అయ్యేట్టు చూడండి.

అలాగే ప్రస్తుత సమాజ పరిస్థితులలో వివాహనంతరo చిన్న సమస్యలు వచ్చిన అవ్వి పెద్దవి కాకుండా మొదటిలోనే పరిష్కరించి చిలికి, చిలికి గాలివాన కాకుండా సర్థిచెప్పి పరిష్కరించాల్సిన బాధ్యత కూడ పెద్దలమీదే ఉన్నదన్న మాట మరువక పిల్లలకి మంచి జీవితం, మంచి లైఫ్ పార్టనర్ ని ఇచ్చే వాళ్ళ సంసారాన్ని చక్కదిద్దే బాధ్యత కూడ ఉన్నదని విశ్వశించి అందరు శుభ ఫలితాలు పొందండి!

త్వరలోనే మీ అందరికీ శుభం కలగాలని మీ ఇంటిలో తొందరగా మంగళ తోరణాలు కట్టుకోవాలని ఆశిస్తూ అందరికీ నమస్కారం.

ehatv

ehatv

Next Story