తిరుమల ఘాట్ రోడ్డు.. నరసింహ స్వామి ఆలయం ఏడవ మైలు మధ్య అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత చిక్కింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి ఆ ప్రాంతానికి చేరుకున్నారు.
తిరుమల(Tirumala) ఘాట్ రోడ్డు.. నరసింహ స్వామి ఆలయం(Narasimhaswamy Temple) ఏడవ మైలు మధ్య అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత(Leopard) చిక్కింది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి(TTD Chairman Bhumana Karunakar Reddy) ఆ ప్రాంతానికి చేరుకున్నారు. రాత్రి పన్నెండు ఒంటి గంట మధ్య ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో మరో చిరుత బందీ అయ్యింది. రెండు నెలల్లో ఇది ఐదవ చిరుత కావడం గమనార్హం. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర రెడ్డి మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రత విషయంలో.. భక్తుల క్షేమం విషయంలో.. వారి సౌలభ్యం కోసం టీటీడీ(TTD) ఎంత పటిష్టమైన చర్యలు తీసుకుంటుందో.. చెప్పడానికి ఇదొక ఉదాహరణ మాత్రమేనన్నారు. అటవీశాఖ అధికారుల సహకారంతో.. వారి నిరంతర పర్యవేక్షణలో అలుపెరగకుండా ఆపరేషన్ చిరుత కొనసాగుతుందని తెలిపారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ ఈవో ధర్మారెడ్డి(TTD EO Dharma Reddy) నేతృత్వంలో నిరంతర కృషి జరుగుతోందని.. ఈ కారణంగానే ఐదవ చిరుతను ఈ రోజున పట్టుకోవడం జరిగిందని వివరించారు.ఇలాంటి ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉంటాయని వెల్లడించారు. ఇప్పటివరకు ఇద్దరు.. చిరుత పులి దాడికి గురైతే, అందులో ఒక పాప మరణించడం జరిగింది. ఆ తర్వాత మరింత అప్రమత్తం అయ్యాం.. నడక దారిలో నడుస్తున్న భక్తులను గుంపులు గుంపులుగా ప్రయాణించమని, వారితో పాటు తోడుగా సిబ్బందిని పంపి, ధైర్యాన్ని నింపే ఏర్పాట్లు కొనసాగుతాయని పేర్కొన్నారు.
మధ్యాహ్నం రెండు గంటల తర్వాత చిన్న పిల్లలు నడిచేందుకు అనుమతి నిరాకరించడం జరిగిందని అన్నారు. ఎవరికీ ఇబ్బంది కలగకుండా భద్రత కల్పించే చర్యల్లో భాగమే ఇది. భక్తులలో ఆత్మస్థైర్యాన్ని నింపడం కోసం నిన్నటి నుంచి చేతి కర్రలు కూడా ఇవ్వడం జరిగింది. కర్రలు ఇస్తామని ప్రకటించగానే దానిమీద ఇష్టం వచ్చినట్టుగా మా మీద ఎన్నో అసభ్యకర మాటలతో దూషించటం జరిగింది. భక్తులకు భద్రతా సిబ్బంది తోడుగా ఇచ్చి అదనపు భద్రత కల్పిస్తూనే.. అదనంగా కర్రలు ఇవ్వడం జరిగింది. కర్రలు ఇస్తామని భక్తుల భద్రతను గాలికి వదిలేయ లేదని విమర్శలకు బదులిచ్చారు. కర్రలు ఇస్తామని ప్రకటించిన తర్వాత దొరికిన నాలుగో చిరుత ఇదని వివరించారు.
అంతకు మునుపు ఒక చిరుత దొరికింది. భక్తుల భద్రత విషయంలో టీటీడీ ఎంత బాధ్యతాయుతంగా పనిచేస్తుందో.. అనడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. అటవీ శాఖ అధికారి అధికారుల పర్యవేక్షణలో రెండు మూడు వందల మంది సిబ్బంది అధునాతన బోనులతో ఆపరేషన్ చిరుత కొనసాగిస్తున్నారు. ఆపరేషన్ చిరుత నిరంతరాయంగా కొనసాగుతుందన్నారు. భక్తుల భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. మీ విమర్శలకు, బూతులకు జడిసి.. ఆపరేషన్ చిరుతను ఆపేసే ప్రసక్తి అంతకంటే లేదని స్పష్టం చేశారు.