YCP Office Shut Down : కుప్పంలో మూతబడిన వైసీపీ కార్యాలయం
ఓడలు బళ్లు అవుతాయి బళ్లు ఓడలవుతాయి... అంటే ఏమిటో వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YCP) నాయకులకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది.
ఓడలు బళ్లు అవుతాయి బళ్లు ఓడలవుతాయి... అంటే ఏమిటో వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YCP) నాయకులకు ఈపాటికి అర్థమయ్యే ఉంటుంది. అయిదేళ్ల పాటు హవా చెలాయించిన నాయకులు ఇప్పుడు దీనావస్థలో ఉన్నారు. ముఖ్యంగా కుప్పంలో(Kuppam) అయితే మరీ దారుణం. నిజానికి కుప్పంలో చంద్రబాబునాయుడును(Chandrababu) ఓడించి, ఆపై ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశంపార్టీ(TDP) అన్నదే లేకుండా చేయాలని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి(YS jagan) ఉబలాటపడ్డారు. కుప్పంలో చంద్రబాబు ఓటమి సంగతేమిటో కానీ రాష్ట్ర ప్రజలే వైసీపీకి చుక్కలు చూపించారు. కుప్పంలో అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్ కార్యాలయానికి(YCP Office) తాళం పడింది. కార్యాలయం స్థానంలో త్వరలో హోటల్ రాబోతున్నదట! తెప్పలుగా చెరువు నిండిన కప్పలు పదివేలు చేరు అని సుమతీశతకకారుడు చెప్పినట్టుగానే టీడీపీలోకి వైసీపీ నేతలు క్యూలు కడుతున్నారు. కుప్పం మున్సిపాలిటీలోని కొందరు వార్డు సభ్యులు, నియోజకవర్గంలోని కొందరు స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ ఫ్లో ఇప్పట్లో ఆగేట్టుగా లేదు. త్వరలోనే మరికొందరు చేరనున్నారు. జగన్ వల్ల కానిది చంద్రబాబు చేసేట్టుగా ఉన్నారు. అంటే కుప్పంలో వైసీపీని ఖాళీ చేయించేందుకు చంద్రబాబు పకడ్బందీ ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. 2019లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ అధికారంలో వచ్చిన తర్వాత కుప్పంపై దృష్టి పెడుతుందని చంద్రబాబు ఊహించి ఉండరు. ఇప్పుడాయనకు అనుభవం వచ్చింది కాబట్టి ముందుగానే అప్రమత్తమయ్యారు. కుప్పంలో వైపీసీ అనే చెట్టును వేర్లతో సహా పీకి పారేయాలని అనుకుంటున్నారు. నాందివాచకంగా పార్టీ కార్యాలయాన్ని మూసుకునేలా చంద్రబాబు చేశారు. ఇప్పటి వరకు కుప్పం నియోజకవర్గ బాధ్యతలను మోసిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడా భారాన్ని మోయలేరు. పుంగనూరులోనే పెద్దిరెడ్డి కుటుంబం అడుగుపెట్టే పరిస్థితి లేనప్పుడు కుప్పంకు ఎలా వెళతారు? ఏం చేస్తారు?